జోనల్ సమావేశాలకు సిద్ధమైన బీజేపీ – ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేసేందుకు కార్యాచరణ

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి జోనల్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా జోనల్ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఆదివారం నుంచి బీజేపీ జోనల్ సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. మొదటగా రాయలసీమ జోనల్ సమావేశం ప్రొద్దుటూరులో జరగనంది.

నాలుగు ప్రాంతాల్లో బీజేప జోనల్ సభలు

రాయలసీమ జోనల్ సమావేశం ప్రొద్దుటూరులో నిర్వహించేందుకు సిద్ధమైంది బీజేపీ.. ఈ నెల 25వ తేదీన గుంటూరులో కోస్తాంధ్ర జోన్ సమావేశం జరగనుండగా.. 26వ తేదీన రాజమండ్రిలో గోదావరి జోన్ సమావేశం నిర్వహించనున్నారు.. ఇక, 27వ తేదీన విశాఖలో ఉత్తరాంధ్ర జోన్ సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ క్యాడర్ మొత్తాన్ని యాక్టివ్ చేయడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని పురందేశ్వరి భావిస్తన్నారు. అందుకే.. కింది స్థాయిలో ఉండే బీజేపీ సానుభూతి పరుల్ని పార్టీ వ్యవస్థలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

అధికార పార్టీపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు

అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏపీ బీజేపీ ఏ మాత్రం సంకోచించడం లేదు. కార్పొరేషన్‌ల పేరుతో తెచ్చిన అప్పులు.. కార్పొరేషన్‌లకు కేటాయించడం లేదన్న ఆమె.. పెద్ద ఎత్తున చేస్తున్న అప్పులకు వడ్డీలు కట్టడంతోనే రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుందని.. అప్పులు చేసి సంపద సృష్టించే ఒక్క నిర్మాణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం లేదని విమర్శలు గుప్పించారు. తమ పోరాటం అధికార పార్టీపైనేనని చెప్పకనే చెప్పారు. ఆ పార్టీతో బీజేపీకి లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయన్న ప్రచారాన్ని పురందేశ్వరి గట్టిగా తిప్పికొడుతున్నారు.

పని చేసే వారితో పార్టీ కమిటీలు

పార్టీలో కొత్త కమిటీల రూపకల్పన ముందు జోనల్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు పురంధేశ్వరి.. జోనల్ సమావేశాలు ముగిశాక కొత్త కమిటీలను ప్రకటించనున్నారు. ఇప్పటికే పార్టీ కోసం పని చేసే వారికే ప్రాధాన్యం ఇవ్వాలని.. చురుగ్గా తిరిగే యువనేతలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నారు.