శ్రీలంకలో తమిళుల సమస్య ఇవ్వాల్టిది కాదు. అది భూమీ హక్కుల పోరాటమే కాదు. మానవ హక్కుల పోరు కూడా అని చెప్పక తప్పదు. ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈ అంతర్ధానమై.. సిన్హలీయులు, తమిళులు శాంతియుతంగా జీవిస్తున్న తరుణంలో కూడా మైనార్టీల హక్కుల పరిరక్షణ జరగడం లేదు. అనేక మంది తమిళులు దుర్భర జీవితం గడుపుతున్న వేళ భారత ప్రభుత్వ జోక్యంతో తమకు ఉపశమనం కలుగుతుందని వారు ఎదురు చూస్తున్నారు.
శ్రీలంక అధ్యక్షుడితో భేటీ
భారత పర్యటనలో ఉన్న శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తమిళుల హక్కులను నేరుగా ప్రస్తావించారు. తమిళులకు అధికారాల బదలాయింపు చేసే శ్రీలంక 13వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని ఆయన కోరారు. తమిళుల ఆకాంక్షలను నేరవేర్చడంలో శ్రీలంక ప్రభుత్వ వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే మోదీ కాస్త గట్టిగా మాట్లాడారనే చెప్పాలి. శ్రీలంకలో ప్రాంతీయ మండళ్ల ఎన్నికలు జరిగితే తమిళుల రాజకీయ హక్కులకు అవకాశం కలుగుతుందన్న వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ఆ సంగతేంటని మోదీ ప్రశ్నించారు. శ్రీలంకలో తమిళుల ప్రాణాలకు భద్రత కావాలని, వారు గౌరవంగా బతికే అవకాశం ఇవ్వాలని చాలా కాలంగా భారత ప్రభుత్వం వాదిస్తోంది. ఈ అంశాలను మోదీ మరో సారి ప్రస్తావించారు.
భారత్ సాయంపై భరోసా
ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంకను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన వేళ .. శ్రీలంకలో తమిళుడు అడుగు పెట్టి కూడా 200 ఏళ్లు పూర్తవతుుంది. ఈ నేపథ్యంలో లంక తమిళుల సంక్షేమానికి రూ. 75 కోట్లు కేటాయించినట్లు మోదీ ప్రకటించారు. శ్రీలంకలో సమ్మిళిత అభివృద్ధితో తమిళులకు ప్రయోజనం కల్పిస్తామన్న విక్రమసింఘే ప్రకటనను మోదీ స్వాగతించారు.తమిళులు ఎక్కువగా ఉండే శ్రీలంక ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని కూడా అక్కడి ప్రభుత్వం హామీ ఇచ్చింది.
తమిళనాడు నుంచి ఫెర్రీ సర్వీస్
తమిళనాడులోని నాగపట్నం నుంచి శ్రీలంక ఉత్తర ప్రాంతంలోని కనకేసింతురై రేవుకు ఫెర్రీ సర్వీస్ ప్రారంభించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. దీని వల్ల తమిళుల రాకపోకలకు వెసులుబాటు కలుగుతుంది. ఇరు దేశాల మధ్య పెట్రోలియం పైప్ లైన్ ఏర్పాటు చేసే అంశం కూడా చర్చకు వచ్చింది. భారత్ లో గూగుల్ పే, ఫోన్ పే తరహాలో అక్కడ అమలవుతున్న శ్రీలంక పే ను ఇండియాతో అనుసంధానం చేసే ప్రక్రియకు త్వరలో శ్రీకారం చుడతారు. దీని వల్ల నగదు బదిలీ సులభమవుతుంది. మరో పక్క శ్రీలంక, చైనా సంబంధాలపై భారత్ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. శ్రీలంకలోని హంబన్‌టోటా రేవులో చైనా ఓడలు లంగరు వేసేందుకు ఎలా అనుమతించారని ప్రశ్నించింది. శ్రీలంక జల సరిహద్దుల్లో చైనా ప్రవేశాన్ని అడ్డుకోవాలని సూచించింది.