అయోధ్య రాముడి విగ్రహం తయారు చేస్తున్న పవిత్ర శిల విశిష్ఠత ఇదే!

శ్లోకం
శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి

శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో నూతనరామమందిరం నిర్మాణం శరవేరంగాసాగుతోంది. ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే. విగ్రహప్రతిష్టాపనకు సమయం దగ్గరపడతుండడంతో పనులన్నీ చకచకా పూర్తవుతున్నాయి. ఇందులో భాగంగా విగ్రహాల తయారీకి తీసుకొచ్చిన శాలిగ్రామ శిల ఎంత ప్రత్యేకమైనదో తెలుసా…

కోట్ల సంవత్సరాల క్రితం శిల
సీతారాముల విగ్రహాల తయారీ కోసం నేపాల్ నుంచి ‘శాలిగ్రామ శిల’ పవిత్ర రాళ్లను తీసుకొచ్చారు. ఆరునెలల క్రితమే ఈ శాలిగ్రామ శిలలు అయోధ్యకు చేరుకోగా వేలాది భక్తుల రామనామ స్మరణ మధ్య వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శిల్పులు చెక్కడం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఈ పూజల అనంతరం శిల్పులందరూ కలిసి విగ్రహాలను తయారు చేస్తారు. ఈ శాలిగ్రామ శిలలు దాదాపు 6 కోట్ల సంవత్సరాల నాటివని చరిత్ర చెబుతోంది. నేపాల్ లోని కాళీ నది నుంచి శాలిగ్రామ శిలను తొలగించేందుకు ముందుగా నియమ నిబంధనల ప్రకారం పూజలు నిర్వహించారు. కాళేశ్వర్ మహాదేవ్ ఆలయంలో అభిషేకం చేసి. ఆ తర్వాతే దేవుళ్లకు క్షమాపణ చెబుతూ ఈ పవిత్ర శాలిగ్రామ శిలలను భారతదేశంలోని అయోధ్యకు తరలించారు. ఈ పవిత్ర రాళ్లలో ఒకదాని బరువు 26 టన్నులు. మరొక రాయి బరువు 14 టన్నులు. శ్రీరామ నవమి రోజున సూర్య కిరణాలు నేరుగా స్వామి వారి నుదుటిపై పడేలా విగ్రహం ఎత్తు ఉంచనున్నారు. ఈ పవిత్రమైన శిలలలో సీతారాముల విగ్రహాలతో పాటూ ఆయన సోదరులైన లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుల విగ్రహాలు కూడా చెక్కనున్నారు.

శాలిగ్రామ శిల విశిష్ఠత ఇదే!
శాస్త్రాల ప్రకారం ఈ శాలిగ్రామంలో శ్రీ మహా విష్ణువు కొలువై ఉంటాడని విశ్వసిస్తారు. ఈ రాళ్లు గండకీ నదిలో మాత్రమే లభ్యమవుతాయి. శాలిగ్రామ రాయిని పూజించడం వల్ల ఆనందం, శాంతి, ఐశ్వర్యం, ప్రేమ చెక్కు చెదరకుండా ఉంటాయని లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వసిస్తారు. హిమాలయాల నుంచి ప్రవహించే నది భారీ శిలలను చీల్చుకుంటూ ప్రవహిస్తుంది. 33 రకాల శిలాజాలతో ఈ శాలిగ్రామ శిలలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.