కాశీ క్షేత్రంలోని విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్న జ్ఞానవాపి మసీదు వివాదం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మసీదు హిందూ ఆలయంపైనే నిర్మించారని, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాలతో అతని అనుచరులు ఆలయాన్ని నిర్వీర్యం చేశారని చాలా రోజులుగా ఆరోపణలు చేస్తూ కోర్టుకెక్కారు. జ్ఞానవాపిపై కోర్టులు ఇప్పుడు కీలక తీర్పులు చెబుతున్నాయి.
ఏఎస్ఐ సర్వేకు వారణాసి కోర్టు ఉత్తర్వులు
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ)కు వారణాసి జిల్లా కోర్టు అనుమతించింది.ఈ సర్వే సుప్రీం కోర్టు ఉత్తర్వులకు లోబడే ఉండాలని కూడా ఉత్తర్వులిచ్చింది. హిందూ సంఘాల తరపున ఈ ఏడాది మేలో దాఖలైన పిటిషన్ ఆధారంగా జిల్లా కోర్టు న్యాయమూర్తి ఏకే విశ్వేశా ఈ కీలక ఆదేశాలిచ్చారు. మసీదు కాంప్లెక్స్ మొత్తాన్ని పురావస్తు శాఖతో సర్వే చేయించినప్పుడు మాత్రమే ఆలయం-జ్ఞానవాపి మసీదు వివాదం పరిష్కారమవుతుందని పిటిషనర్లు వాదించారు. నలుగురు హిందూ మహిళలు ఈ పిటిషన్ వేశారు.
వజుఖానాలో సర్వే వద్దు..
వివాదాస్పద వజుఖానా ( కొలను)ను సర్వే నుంచి మినహాయించారు. వజుఖానాలో శివలింగం ఉందని హిందూ భక్తులు వాదిస్తుండగా, సుప్రీం కోర్టు మినహాయింపు ఉన్నందుకు అక్కడ శాస్త్రీయ సర్వే చేయాల్సిన అవసరం లేదని వారణాసి జిల్లా కోర్టు ప్రకటించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు 2022 మే నెలలో వజుఖానాకు సీల్ వేశారు. మిగతా ప్రదేశాల్లో గ్రౌంట్ పెనిట్రేషన్ రాడార్ (జీపీఆర్) టెక్నాలజీతో సర్వే చేయాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణ తేదీ అయిన ఆగస్టు 4న సర్వే నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించింది.
సమగ్ర నివేదిక అవసరం
జ్ఞానవాపి మసీదులో పూర్తి స్థాయి సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు తేల్చేసింది. హిందూ ఆలయాన్ని కూల్చి ప్రస్తుతమున్న మసీదును నిర్మించారన్న వాదన ఆధారంగా సర్వే చేయాలని చెప్పింది. పడమటి గోడ ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారనేది కూడా నిర్ధారించాలని చెప్పింది. మూడు డోమ్ ల కింది భాగంలో కూడా జీపీఆర్ సర్వే చేయాలని ఆదేశించింది. అన్ని సెల్లార్ల నేలపై ప్రత్యేక సర్వే చేస్తే హిందూ ఆలయం ఆనవాళ్లు కనిపిస్తాయని పిటిషనర్ల వాదనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. అవసరమైతే పురావస్తు తవ్వకాలు జరపొచ్చని సూచించింది. సేకరించిన వస్తువుల జాబితాను రూపొందించి కోర్టుకు సమర్పించాలని ఏఎస్ఐ డైరెక్టర్ ను ఆదేశించింది. అయితే వివాదాస్పద భూమిపై కట్టడాలకు ఎలాంటి ప్రమాదం ఏర్పడకుండా, అవి కూలిపోకుండా చూడాల్సిన బాధ్యత ఏఎస్ఐపై ఉందని కూడా కోర్టు హెచ్చరించింది. మసీదు మేనేజ్ మెంట్ కమిటీ అభ్యంతరాలను కూడా పరిశీలించాలని కోర్టు సలహా ఇచ్చింది. గతంలో సర్వే జరిగిందంటూ మసీదు మేనేజ్ మెంట్ కమిటీ చేసిన విజ్ఞప్తిని జిల్లా కోర్టు తోసిపుచ్చింది. గతేడాది జరిపిన సర్వేకు శాస్త్రీయత లేనందునే తాజా ఉత్తర్వులిస్తున్నట్లు వెల్లడించింది. వాస్తవాలు బయటకు రావడమే తమ ఆదేశాల సారాంశమని న్యాయమూర్తి తేల్చేశారు.