తెలంగాణ బీజేపీలో కిషన్ రెడ్డి జోష్ – ఇప్పటి వరకూ ఓ లెక్క… ఇక నుంచి మరో లెక్క !

తెలంగాణ బీజేపీ పై జరుగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి బీజేపీ రంగం సిద్ధం చేసుకుంది. కిషన్ రెడ్డి ఇలా ఎంట్రీ ఇచ్చి ఇవ్వక ముందే డబుల్ బెడ్ రూం ఇళ్లలో బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాన్ని ప్రజల ముందు ఉంచింది. బాట సింగారంలో డబుల్ ఇళ్ల పేరుతో బీఆర్ఎస్ చేసిన మోసం ఎక్కడ బయటపడుతుందోనని కంగారు పడి.. కిషన్ రెడ్డిని అక్కడకు పోనివ్వలేదు. కానీ అలా అడ్డుకోవడం వల్లనే ఆ ప్రోగ్రాంకు ఎక్కువ మైలేజీ వచ్చింది. ఇప్పటి వరకూ ఓ లెక్క.. ఇక ముందు మరో లెక్క అని బీజేపీ నేతలంటున్నారు.

మూడో సారి తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కిషన్ రెడ్డి బాధ్యతలు

బీజేపీలో అట్టడుగు స్థాయి నుంచి ఉన్నతంగా ఎదిగిన నేతల్లో ఒకరు కిషన్ రెడ్డి. ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనే రెండు సార్లు బీజేపీకి చీఫ్ గా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం కూడా తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉన్నారు. ఇప్పుడు మరోసారి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చే టాస్క్ లో భాగంగా బాధ్యతలు తీసుకున్నారు . కిషన్ రెడ్డి సామర్థ్యంపై ఎవరికీ అనుమానం లేదు. ఆయన పార్టీకి వేసిన పునాదుల మీదనే తెలుగు రాష్ట్రాల్లో నిలబడి ఉంది. బీజేపీ భావజాలాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా.. కిషన్ రెడ్డి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తూ వస్తున్నరు. వచ్చే ఆరు నెలల్లోనూ ఆయన తన పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించనున్నారు.

మొదటి అడుగులోనే బీజేపీపై దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టే ప్లాన్

బీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారంటూ రాజకీయవర్గాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కిషన్ రెడ్డి .. మొదట పోరాటాన్ని డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రారంభించారు. దీంతో ప్రభుత్వం ఉలిక్కి పడింది. ఇది ఆరంభం మాత్రమే నని ముందు ముందు ఎవరూ ఊహించని పోరాటాలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉంటాయని అంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాత్మకంగా చేస్తున్న కుమ్మక్కు ప్రచారాన్ని తిప్పకొట్టేలా బీజేపీ పోరాటం ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో బీజేపీ క్యాడర్ కు ఎలాంటి సందేహాలు లేవు. కరుడు గట్టిన బీజేపీ నేత అయిన కిషన్ రెడ్డిపై… బీఆర్ఎస్ ముద్ర వేయడానికి చేసిన ప్రయత్నాలనూ తేలికగా తీసుకోవాలని బీజేపీ క్యాడర్ అనుకోవడం లేదు.

బీఆర్ఎస్ – కాంగ్రెస్ ఉత్తుత్తి ఫైట్లను ఎక్స్ పోజ్ చేయనున్న కిషన్ రెడ్డి

తమ మధ్యనే పోటీ జరుగుతోందన్న అభిప్రాయం కల్పించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలను తిప్పికొట్టేలా కిషన్ రెడ్డి ప్రత్యేకా కార్యారణ రెడీ చేసుకున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డిని అదే పనిగా హైలెట్ చేయడానికి బీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని అనుమానిస్తున్నాయి. వీటన్నింటినీ ప్రజల ముందు పెట్టి ఆ రెండు పార్టీలు ఒకటేనని.. తేటతెల్లం చేయనున్నారు.