రానా న్యూ ప్రాజెక్ట్ హిరణ్యకశిపపై తాజాగా అప్ డేట్ వచ్చింది. త్రివిక్రమ్ కథ అందిస్తున్నాడంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇంతకీ అప్పుడెప్పుడో ఈ మూవీని తాను తెరకెక్కిస్తున్నాని చెప్పిన గుణశేఖర్ పేరెందుకు లేదు? ఈ పోస్టర్ చూసి గుణశేఖర్ ఎలా రియాక్టయ్యాడు…
రానా-త్రివిక్రమ్ హిరణ్యకశిప
నాలుగేళ్ల క్రితం రానా హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశిప అనే ప్రాజెక్టు తెరకెక్కే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అటు రానాతో పాటు గుణశేఖర్ కూడా పలు సందర్భాల్లో కన్ఫామ్ చేశారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు రానా -త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ హిరణ్యకశిప అనే ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. అందరికీ సుపరిచితమైన అమరచిత్ర కథ అనే కామిక్స్ ఆధారంగా చేసుకుని ఈ సినిమాని త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నారని సమాచారం. రాక్షస రాజు హిరణ్యకశిపుడుగా రానా కీలక పాత్రలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ కథ అందిస్తున్నాడనే విషయం మీద క్లారిటీ వచ్చేసింది. మరి దర్శకుడు ఎవరు?
వాళ్లకి నైతికత లేదు
హిరణ్య కశిప మూవీ పోస్టర్ బయటకు రావడం..దానిపై త్రివిక్రమ్ పేరుండడం చూసి తన అసహనాన్ని ట్విట్టర్ వేదికగా బయటపెట్టాడు దర్శకుడు గుణశేఖర్. పేర్లు ప్రస్తావించకుండా రానా, త్రివిక్రమ్ లను టార్గెట్ చేస్తూ వారికి నైతికత లేదని ఘాటు కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ఆళ్లగడ్డ తాలూకాలో ఉన్న అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి సంబంధించిన ఒక ఫోటోతో పాటు అక్కడ తాను కూడా ఉన్న ఫోటో షేర్ చేసిన గుణశేఖర్… దేవుడిని సెంట్రల్ థీమ్ గా పెట్టుకుని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారంటే మీ ఇంటిగ్రిటీ మీద దేవుడు కూడా ఒక కన్నేసి ఉంచుతాడని గుర్తుపెట్టుకోండి, అధర్మంగా చేసిన అన్ని పనులకు ధర్మంగానే సమాధానం దొరుకుతుందని పోస్ట్ పెట్టాడు. నేరుగా అనకపోయినా ఈ పోస్టు మాత్రం తాజాగా వచ్చిన హిరణ్యకశిప పోస్టర్ ని ఉద్దేశించే అన్నది అందరకీ అర్థమవుతోంది.
నాలుగేళ్ల క్రితమే ప్రకటించిన గుణశేఖర్
నాలుగేళ్ళ క్రితమే దర్శకుడు గుణశేఖర్ హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ ప్రకటించాడు. ఈ సినిమాకు అమరచిత్ర కథలు ఆధారం. గుణశేఖర్ హిరణ్యకశ్యప ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడాచేసి కొన్ని కోట్లు ఖర్చు చేశాడు. ప్రణాళిక ప్రకారం జరిగితే రానా-గుణశేఖర్ ల హిరణ్యకశిప 2020లోనే పట్టాలెక్కాల్సింది. కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. అదే సమయంలో శాకుంతలంతో బిజీ అయ్యాడు. ఈ మూవీ ఫ్లాప్ అవడంతో ఇక హిరణ్యకశిప ప్రాజెక్ట్ లేనట్టే అన్నారు. ఇప్పుడు అనూహ్యంగా రానా-త్రివిక్రమ్ పేరుతో జూలై 19న పోస్టర్ బయటకొచ్చింది. మరి గుణశేఖరుడి అసహనంపై రానా-త్రివిక్రమ్ స్పందిస్తారేమో చూడాలి.