ఈశాన్య సోదరి మణిపూర్ అట్టుడుకుతోంది. జనం వీధుల్లో పడి చంపుకుంటున్నారు. ఇళ్లు తగులబెట్టుకుంటున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితి అదుపుకు వచ్చినట్లే కనిపించి మళ్లీ మొదటికి చేరుకుంటోంది. మెయిటీలు, కుకీతెగల మధ్య రిజర్వేషన్ వార్ తారా స్థాయికి చేరింది. ఇప్పటి వరకు 120 మంది చనిపోయారు. శాంతి స్థాపన కోసం మణిపూర్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది.
ఆ వీడియోతో మరింత ఉద్రిక్తత
ఇద్దరు కుకీ మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించినట్లు కనిపిస్తున్న ఓ వీడియో బుధవారం బయటపడటంతో అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంతటి అమానవీయ సంఘటననను అడ్డుకోవడంతో భద్రతా దళాలు విఫలమయ్యాయని ప్రజా సంఘాలు సైతం నిలదీస్తున్నాయస. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా ఈ అంశంపై స్పందించారు. మణిపూర్ బిడ్డలకు జరిగిన అవమానం క్షమించరానిదని మోదీ ఆవేదన చెందారు. ఇలాంటి ఘటనలు దేశానికే సిగ్గుచేటని ఆయన అన్నారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. తన హృదయం ద్రవిస్తోందని మోదీ చెప్పుకున్నారు.
సుుమోటోగా సుప్రీం విచారణ
ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన మణిపూర్ వీడియోపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఇలాంటి వీడియోలు ఆందోళన కలిగిస్తున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఘటనలను సహించకూడదని అంటూ ఇదీ రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనే అవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందన కోరిన సుప్రీం కోర్టు ఈ నెల 28న విచారణ చేపడతామని ప్రకటించింది.
సీఎంతో మాట్లాడిన అమిత్ షా
నగ్న ఊరేగింపు ఘటనపై మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వీడియో వచ్చిన వెంటనే పోలీసులు సుమోటోగా రంగంలోకి దిగి తొలి అరెస్టులు చేశారని ఆయన వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను వదిలే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. సీఎం బిరేన్ సింగ్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలి పెట్టకూడదని సూచించారు. మరో పక్క ఈ వీడియోకు జనంలోకి వెళ్లడానికి కారణమైన ట్విట్టర్ పై భారత ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇలాంటి వీడియోలు చూపించకూడదని ట్విటర్ కు తెలియదా అని ప్రభుత్వం నిలదీసింది. ట్విటర్ పై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.