హిందూపురం వైసీపీలో ఉన్న విభిన్న పరిస్థితి మరే పార్టీలోనూ ఉండదు. అక్కడ పార్టీ నేతల మధ్య తీవ్ర విబేధాలున్నాయని… అది పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపిస్తోందని.. వైసీపీ అధినేత అక్కడ కొత్త ఇంచార్జ్ ను నియమించారు. గ్రూపులన్నింటికీ చెక్ పెట్టారు. అయితే అసలేం జరిగిందో తెలుసుకునేలోపు అంతా అయిపోయింది ప్రత్యర్థి వర్గాలకు . ఇప్పుడు వారంతా మేలుకున్నారు. కలిసిపోయి… సీటు తమలో ఒకరికే ఇవ్వాలంటూ కొత్త వాదన ప్రారంభిస్తున్నారు. ఇది వైసీపీలో విచిత్ర పరిణామాలకు కారణం అవుతోంది.
ఏకమైన ఇక్బాల్ – నవీన్ నిశ్చల్
పార్టీ సీనియర్ నేతలు ఎమ్మెల్సీ ఇక్బాల్, ఏపీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ ఇద్దరూ తమ విభేదాలు పక్కనపెట్టి ఒక్కటయ్యారు. ఓ కౌన్సిలర్ ఇంట్లో ఇద్దరు భేటీ అయ్యి, రాజకీయాలపై చర్చించారు. నిన్నటిదాకా ఇద్దరూ ఉప్పునిప్పులా రాజకీయాలు చేశారు. టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. ముందుగా పార్టీలో వర్గ విభేదాలకు చెక్ పెట్టాలని ప్లాన్ చేసింది. హిందూపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా దీపికారెడ్డిని నియమించింది అధిష్ఠానం. దాంతో ఖంగుతిన్న ఎమ్మెల్సీ ఇక్బాల్, నవీన్ నిశ్చల్ అధిష్ఠానం నిర్ణయానికి తలొగ్గక తప్పలేదు. ఆమె నియామకం జరిగిన 10 రోజుల తర్వాత ఇద్దరు నేతలు ఒక్కటయ్యారు.
కొత్త అభ్యర్థిని ఖరారు చేసిన వైసీపీ హైకమాండ్
2019 ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా నవీన్‌నిశ్చల్ కాకుండా, మాజీ ఐపీఎస్ అధికారి మహమ్మద్ ఇక్బాల్‌కు టికెట్ కేటాయించింది అధిష్ఠానం. ఐతే ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బాలకృష్ణపై మహమ్మద్ ఇక్బాల్ ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుండి ఎమ్మెల్సీ ఇక్బాల్, నవీన్ నిశ్చల్‌ల మధ్య పచ్చగడ్డి వేయకముందే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పార్టీ కేడర్‌లో వర్గవిభేదాలు ఏర్పడ్డాయి. ఇద్దరి మధ్య సయోధ్యకోసం అధిష్ఠానం ప్రయత్నించింది. కలిసి పనిచేయాలని అనేకసార్లు సూచించినా ఏ ఒక్కరూ వినలేదు. అలా..దాదాపు నాలుగేళ్లుగా ఇక్బాల్, నవీన్ ఉప్పు-నిప్పుగానే ఉండిపోయారు. ఈకారణంగానే దీపికారెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేశారు.
తమలో ఒకరికే ఇవ్వాలంటున్న ఇక్బాల్ – నవీన్
హిందూపురం వైసీపీ కోసం అసలు కష్టపడింది తాము అని.. టిక్కెట్ ఇస్తే గిస్తే తమలో ఒకిరికి ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు. అసలు పార్టీ కోసం పని చేయని వారికి ఇవ్వడం ఏమిటని వారి వాదన. హిందూపురంలో వైసీపీ జెండా ఎగురవేయడమే తమ లక్ష్యమమని … తమలో ఒకరే సీటివ్వాలంటున్న ారు. ఎమ్మెల్సీ ఇక్బాల్, ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ కలయికతో హిందూపురంలో సమీకరణలు మారినట్లు కనిపిస్తున్నాయి. కానీ దీపికారెడ్డిని వైసీపీ వద్దంటున్నదా అన్నదే సందేహం.