అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండేది జెసి కుటుంబం. ఇప్పటికీ తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జెసి.ప్రభాకర్‌రెడ్డి వార్తల్లో ప్రముఖంగా ఉంటూనే ఉంటారు. కాని ఆయన అన్న జెసి.దివాకర్‌రెడ్డి మాత్రం గత కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. ఏదో ఓ స్టేట్మెంట్తో ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా ఉంటూ వచ్చేవారు. అయితే గత కొంత కాలంగా ఆయన రాజకీయపరమైన వ్యాఖ్యలేవి చేయకుండా మౌనంగా ఉంటున్నారు.
వారసుడ్ని గెలిపించలేకపోవడంతో నిరాశ
2009 వరకు కాంగ్రెస్ పార్టీ తరుపేనే పోటీ చేసి డబుల్ హ్యాట్రిక్ విజయాలను సాధించారు. ఆ తరువాత 2014లో రాష్ట్రరాజకీయ పరిణామాల నేపథ్యంలో టిడిపిలో చేరి పార్లమెంటుకు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనూ ఆయనే విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఆయన తనయుడు జెసి. పవన్‌కుమార్‌రెడ్డి తొలిసారిగా పోటీ చేశారు. ఆయన ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత కూడా రాజకీయంగా హడివుడే చేశారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డిపైనా అనేక విమర్శలు చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం వైపున ఉంచి ఆయనకు సంబంధించి గనులను మూసివేయడం తదితర సమస్యలు చుట్టుముట్టినా తన విమర్శల పదునును తగ్గించలేదు. కానీ హఠాత్తుగా సైలెంట్ అయ్యారు.
ఎన్నికలు సమీపిస్తున్నా సైలెంట్ గానే జేసీ దివాకర్ రెడ్డి !
ఎన్నికలు సమీస్తున్న తరుణంలోనూ ఆయన రాజకీయపరంగా యాక్టివ్‌గా లేకపోవడం చర్చనీయాంశమూ అవుతోంది. ఇదే నేపథ్యంలో ఆయన తనయుడు జెసి, పవన్‌కుమార్‌రెడ్డి కూడా రాజకీయపరమైన కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలో కేశ్ పాదయాత్రలోగాని, పార్టీ కార్యక్రమాల్లోనూ ఎక్కడా కనిపించటం లేదు. వ్యక్తిగత కార్యక్రమాల రిత్యా కొంతకాలం ఇతర దేశాలకు వెళ్లినప్పటికీ, ఆ తరువాత కూడా ఆయన పాల్గొన్న దాఖలాలు కనిపించడం లేదు.
చురుకుగా జేసీ ప్రభాకర్ రెడ్డి !
జె.సి.ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నారు. జెసి.దివాకర్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డిలు మాత్రం ఎన్నికల సమయం ఆసన్నమైనా కనిపించకపోవడం చర్చనీయాంశమూ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ బరిలో దిగుతారా లేక పార్లమెంటుకే మరోమారు ప్రయత్నిస్తారా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఏది ఏమైనా ఎప్పుడూ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా ఉండే ముఖ్య నేత ఇలా సైలెంట్ అవడం వెనుక ఆంతర్యం ఏమిటా అని రాజకీయ వర్గాల్లో గుసగసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా దివాకర్ రెడ్డిసైలెంట్ గా ఉండరని అంటున్నారు. పవన్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారన్న చర్చ జరుగుతోంది.