అనంతపురం రాజకీయాల్లో దిగ్గజాలుగా ఉన్న ఇద్దరు నేతలు రాజకీయ భవిష్యత్ కోసం.. ఎటో వైపు చూడాల్సిన పరిసిస్థితి ఏర్పడుతోంది. మాజీ పిసిసి అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డిరు ముందు నుంచి కాంగ్రెసు పార్టీలో ఉన్నారు . ఇప్పుడు కూడా కాంగ్రెస్ లోనే ఉన్నారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా దెబ్బతింది. ఈ తరుణంలో ఆయన పిసిసి అధ్యక్ష బాధ్యతలను తీసుకుని పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. కాని చివరికి అస్త్ర సన్యాసం చేశారు.
కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాలతో దెబ్బతిన్న రఘువీరారెడ్డి రాజకీయ భవిష్యత్
2014, 2019 ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లాలో పెనుకొండ, కళ్యాణదుర్గంలోనూ ఆయన పోటీ చేసినప్పటికీ కాంగ్రెసుపై ఉన్న వ్యతిరేకతతో ఓటమిని చవిచూడక తప్పలేదు. 2019 ఎన్నికల తరువాత నుంచి పిసిసి పదవి నుంచి కూడా తప్పుకుని రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెసు పార్టీ తరపున అక్కడ ప్రచారం చేశారు. తిరిగి ఆయన యాక్టివ్ అయ్యారని భావించారు. కాని ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల పట్ల మాత్రం మౌనంగానే ఉంటూ వస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు అయినా ఇక్కడి రాజకీయాల వైపు దృష్టి సారిస్తారా లేక దూరంగానే ఉంటారా అన్న చర్చ ఉమ్మడి జిల్లా వాసుల్లో చర్చ నడుస్తూ ఉంది.
శైలజానాథ్ ఏ పార్టీ వైపు ?
రఘువీరారెడ్డి పిసిసి అధ్యక్షతల నుంచి తప్పుకున్న తరువాత మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఆయన 2004లో వైద్యవృత్తిని వదిలి రాజకీయరంగ ప్రవేశం చేశారు. 2012లో కాంగ్రెసు పార్టీ హయంలోనే విద్యా శాఖ మంత్రి అయ్యారు. రఘువీరారెడ్డి పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక ఆయన పిసిసి అధ్యక్షులయ్యారు. మొన్నటి వరకు ఆయన పిసిసి అధ్యక్షులుగా ఉంటూ వచ్చారు. కాని ఇటీవల ఆయన స్థానంలో గిడుగు రుద్రరాజును నియమించారు. అప్పటి నుంచి ఆయన కొంత వరకు కాంగ్రెసుకు దూరంగా జరుగుతున్నారన్న ప్రచారం రాజకీయవర్గాల్లో నడుస్తోంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెసు ఇప్పట్లో పుంజుకునే పరిస్థితి లేదన్న ఉద్ధేశంతో ఇతర పార్టీల వైపు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పూర్వపు నియోజకవర్గమైన శింగనమలలో ఇటీవలి కాలంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముందున్న పరిచయాలతో ముఖ్యమైన వారిని గ్రామాల వారీగా కలుస్తూ, వచ్చే ఎన్నికల్లో తనకు సహకారం అందివ్వాలని కోరుతున్నారు. అయితే ఏ పార్టీ తరపున అన్నది స్పష్టంగా వారికి మాత్రం చెప్పడం లేదు.
ఇద్దరు నేతల్ని బీజేపీలోకి ఆహ్వానించిన కిరణ్ కుమార్ రెడ్డి !
రఘువీరారెడ్డి, శైలజానాథ్ లను బీజేపీలోకి తీసుకు వచ్చేందుకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ప్రాంతీయ పార్టీల్లో ఇమడలేరని.. జాతీయ పార్టీల్లో అయితే మంచి భవిష్యత్ ఉంటుందని వారి చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ హైకమాండ్ అనుసరించబోయే వినూత్న వ్యూహాలపై వారికి చెబుతున్నారు. దీంతో ఆ ఇద్దరూ ఏ పార్టీలో చేరుతారన్నది కీలకంగా మారింది.