సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్ గా ఉండే జనసేన పార్టీ నేతలు, చిరంజీవి ఫ్యాన్స్ ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయి వివాదాలు రేపుకుంటున్నారు. చిరంజీవిని జనసైనికులు అవమానించారంటూ… చిరంజీవి ఫ్యాన్స్.. అసలు చిరంజీవి వల్లే జనసేన పార్టీకి నష్టం జరిగిందని జనసైనికులు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. చివరికి ఈ విషయంలో గొడవలు వద్దని నాగబాబు కూడా కల్పించుకోవాల్సి వచ్చింది. అసలు ఈ వివాదం అంతా రాయపాటి అరుణ అనే జనసేన అధికార ప్రతినిధి వల్ల వచ్చింది.
చిరంజీవి వల్లే జనసేనకు ఓట్లు వేయలేదన్న రాయపాటి అరుణ
జనసేనలో అధికార ప్రతినిధిగా రాయపాటి అరుణ అనే మహిళ ఉంటారు. ఆమె టీవీ చర్చల్లో పాల్గొంటూ ఉంటారు. ఆమెకు నోటి మీద అదుపు ఉండదని జనసైనికులే మండి పడుతూ ఉంటారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూంటారు. తాజాగా ఆమె ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ. జనసేనకు ఓట్లు రాకపోవడానికి చిరంజీవే కారణం అన్నారు . ప్రజారాజ్యం పార్టీని పెట్టి కాంగ్రెస్ లో కలిపేయడం వల్ల ప్రజల్లో నమ్మకం కోల్పోయారని.. ఈ కారణంగానే ఓట్లు వేయలేదని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఒక్క సారిగా వివాదాస్పదం అయ్యాయి. ఆమెపై చిరంజీవి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరిని అవమానిస్తున్నారో తెలుసా అంటూ మండిపడుతున్నారు.
రాయపాటి అరుణపై చిరంజీవి ఫ్యాన్స్, జనసైనికుల ఆగ్రహం
జనసైనికులు, చిరంజీవి ఫ్యాన్స్ వేర్వేరు కాదు. అయితే ఈ వివాదం ప్రారంభమయ్యేసరికి రెండువర్గాలుగా మారిపోయారు. చిరంజీవిపై రాయపాటి అరుణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ… చిరంజీవి , రామ్ చరణ్ ప్యాన్స్ .. సోషల్ మీడియా వ్యవహారాలను చూసే శివ చెర్రి అనే వ్యక్తి ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రాయపాటి అరుణ క్షమాపణ చెప్పాలన్నారు. దీనిపై చిరంజీవి అభిమానులు కూడా స్పందించారు. రాజకీయంగా సైలెంట్ గా ఉన్న చిరంజీవిని వివాదాల్లోకి లాగవద్దని… రాయపాటి అరుణ క్షమాపణ చెప్పాలన్నారు. రాయపాటి అరుణ తీరుపై అసహనంతో ఉన్న జనసైనికులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు.
రాయపాటి అరుణ వ్యాఖ్యల్ని సమర్థించిన నాగబాబు
వివాదం తీవ్రం అవుతూండటంతో నాగబాబు కూడా స్పందించారు. రాయపాటి అరుణ ఫ్లోలో మాట్లాడారని.. ఆమెను తప్పు పట్టవద్దని సోషల్ మీడియాలో జనసైనికులు, మెగా ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశారు. అయితే మెగాస్టార్ ను కించ పరిచి.. ఫ్లోలో వచ్చిందని అంటే.. ముందు ముదు చాలా మంది అదే పని చేస్తారని… మెగాస్టార్ గౌరవాన్ని కాపాడాల్సి ఉందని కొంత మంది అంటున్నారు. మొత్తంగా రాయపాటి అరుణ అనే అధికార ప్రతినిధి పెట్టిన చిచ్చుతో… మెగా ఫ్యాన్స్ వర్సెస్ జనసైనికులు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.