పవన్‌ను నిండా ముంంచినా కమ్యూనిస్టులు వదలరా ? – వారిలాగా మారాల్సిందేనా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్డీఏ మీటింగ్ కు వెళ్లడంపై కమ్యూనిస్టుపార్టీల నేతలు చేస్తున్న విమర్శలు శృతి మించుతున్నాయి. తమతో ఉన్నవారే మంచి వాళ్లు ఇతర పార్టీలతో కలిస్తే మంచి వారు కాదన్నట్లుగా విమర్శలు చేస్తున్నారు. వ్యక్తిగత విమర్శలకూ సీపీఐ నేత నారాయణ వెనుకాడకపోవడం రాజకీయ వర్గాలను విస్మయపరుస్తోంది. పవన్ పై .. సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలను ఏపీ బీజేపీ ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీపీఐ నారాయణ మానసిక వైకల్యంతో బాధపడుతున్నట్లుగా ఉందన్నారు.

కమ్యూనిస్టులతో కలిసి మునిగిపోతే మంచి వాళ్లా ?

" నాకు దండం పెట్టాడు ..  అతను చాలా మంచోడురా "  అని తనకు గౌరవం ఇచ్చిన వాళ్లే మంచోళ్లనుకునే కురచబుద్ది ఉన్న వాళ్ల జాబితాలోకి కమ్యూనిస్టు పార్టీల నేతలు చేరిపోయారని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.  వెలిసిపోతున్న ఎర్ర రంగును పట్టుకుని ఎన్నికలు ఈది తత్వం బోధపడటంతో బయటకు వచ్చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ గురించి ఇలాగే మాట్లాడుతున్నారని..  నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్ కూటమి మీటింగ్‌లో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ వెళ్లడాన్ని తప్పు పడుతూ సీపీఐ నేత నారాయణ వ్యక్తిగత విమర్శలు కూడా చేయడాన్ని ఆయన ఖండించారు.  దళారి అని, లౌకిక వాదానికి ప్రమాదకరమని, సావర్కర్ దుస్తులు వేసుకున్నాడని , నిలబడి మాట్లాడిటం కూడా  చేత కాదని  కించపరిచేలా మాట్లాడారు. సీపీఐ నారాయణ మాటల్లోనే కమ్యూనిస్టులు ఎంత ప్రమాదకరమో నిరూపిస్తున్నారని విమర్శించారు.   మునిగిపోయినా పర్వాలేదు..  కమ్యూనిస్టులతో కలిస్తే మంచోళ్లు. వాళ్ల నైజం తెలుసుకుని బయటకు వచ్చి దేశం కోసం , రాష్ట్రం కోసం రాజకీయం చేస్తూంటే మాత్రం  దళారులు.. స్థిరత్వం లేని వాళ్లు అవుతారు. అయినా మాట్లాడేటప్పుడు అటూ ఇటూ కదలడానికి.. రాజకీయ స్థిరత్వానికి  లింక్ పెట్టే సీపీఐ నారాయణ అవగాహన స్థాయి, మానసిక స్థితిపై ఎవరికైనా అనుమానాలు రావడం సహజమన్నారు. 

గత ఎన్నికల్లో జనసేనను దెబ్బకొట్టింది కమ్యూనిస్టులే !

2019 ఎన్నికల్లో జనసేన ..కమ్యూనిస్టులతోనే కలిసి పోటీ చేసింది. అంతకు ముందే బీజేపీ కూటమిలో ఆయన భాగస్వామి. కారణం ఏదైనా ఆయన మళ్లీ తప్పు తెలుసుకుని దేశం కోసం, రాష్ట్రం కోసం రాజకీయాలు చేసేందుకు ఎన్డీఏలోకి వచ్చారు. దీనిపై మీకు అభ్యంతరాలు ఉండవచ్చు కానీ.. మీతో కలిసినప్పుడు మంచోడు.. బీజేపీతో కలిస్తే మంచోడు కాదని .. అనుచిత విమర్శలు చేయడం మానసిక వైకల్యానికి నిదర్శనమేనన్నారు. కమ్యూనిస్టు నేతలు ఇప్పటికే ప్రజాభిమానాన్ని పూర్తిగా కోల్పోయారు. ఆ నిజం కళ్ల ముందు కనిపిస్తున్నా.. ఎవరో ఒకరి తోక పట్టుకుని ఈది రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. అలాంటి రాజకీయాలు చేసుకోవచ్చులే కానీ బీజేపీతో కలిశారని.. కలుస్తున్నారని.. ఎదుటి వార్ని వ్యక్తిగతంగా కించ పరిస్తే.. అది మీ మానసిక వైకల్యాన్నే బయటపెడుతుంది. ఇప్పటికైనా సీపీఐ నారాయణ లాంటి వాళ్లు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు.

కమ్యూనిస్టులు పొత్తులు పెట్టుకోని పార్టీలేమైనా ఉన్నాయా ?

రాజకీయ పొత్తుల్లో కమ్యూనిస్టు పార్టీలేమైనా పతివ్రతలా? ఎవరు సీట్లు ఇస్తారంటే వారితో పొత్తుకు రెడీ అయిపోయేది నిజం కాదా ?. ఒక్క బీజేపీ తప్ప.. తెలుగు రాష్ట్రాల్లో పొత్తులు్ పెట్టుకోని పార్టీ ఉందా.. ? టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, జనసేన.. రేపు షర్మిల పార్టీతోనూ పొత్తులకు రెడీ అవుతారేమో ?. ఒకరిని అనే ముందు మనం చేసిన ఘనకార్యాలను కూడా గుర్తు చేసుకోవాలి కదా !. మాట్లాడితే సిద్దాంతాలు అంటారు.. ఇన్నీ పార్టీలతో కలిసి పోటీ చేసేటప్పుడు.. మీ సిద్దాంతాలన్నీ కలిశాయా.. ఆ పార్టీలన్నీ దండం పెట్టేసి పొమ్మన్నప్పుడు ఆ సిద్ధాంతాలు కానివయ్యాయా ? అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్నించారు. ఇప్పుడు తెలంగాణలో రెండు సీట్లిచ్చినా చాలని బీఆర్ఎస్‌ దగ్గర దేబిరిస్తోంది మీరు కాదా.. ఆ రెండు సీట్లు కూడా కేసీఆర్ ఇవ్వరేమోనని.. మరో వైపు కాంగ్రెస్‌కు కన్ను గీటుతోంది నిజం కాదా !.పవన్ దళారి, స్థిరత్వం లేని వారయితే.. కమ్యూనిస్టుల్ని ఏమనాలి ?పవన్ కల్యాణ్ చేగువేరా అభిమాని కావొచ్చు. అయితే సావర్కర్ భావాల్ని గౌరవించకూడదా ? వారిద్దరూ శత్రువులా ?. కాలానికి తగ్గట్లుగా భావాలు మార్చుకునేవాళ్లు తప్పు చేసినట్లా ? అని విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు.