ముక్కలేనిదే ముద్దదిగనివారెందరో. ఏవైనా పండుగలు ప్రత్యేక రోజులు, ఉపవాసాల సమయంలో తినొద్దంటేనే తెగ బాధపడిపోతుంటారు. కానీ ఆ గ్రామంలో వందల ఏళ్లుగా నాన్ వెజ్ మాటే వినిపించలేదు. అక్కడ కొలువైన స్వామిపై భక్తితో అప్పట్లో తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ ఫాలో అవుతూనే ఉన్నారు…
స్వచ్ఛమైన శాఖాహార గ్రామం
మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలో ఖానాపూర్ తాలూకాలో ఉన్న రేనవి గ్రామాన్ని స్వచ్ఛమైన శాఖాహార గ్రామంగా పిలుస్తారు. ఈ గ్రామ జనాభా 2,382. డోంగర్ కాపరిలో ఉన్న ఈ గ్రామ ప్రత్యేకత శ్రీ రేవణసిద్ధ నాథుడు కొలువైన పవిత్ర స్థలం. నవనాథులలో ఏకనాథుడు స్వయంభువుగా ఇక్కడ వెలిశాడని విశ్వసిస్తారు. అందుకే ఈ ఉర్లో నూటికి నూరుశాతం నాన్ వెజ్ ముట్టుకోరు. స్వామివారిపై భక్తిలో వందలఏళ్లుగా అనుసరిస్తున్న ఆచారం ఇది. వీళ్లు పాటించడమే కాదు ఈ గ్రామానికి కోడలిగా అడుగుపెట్టేవారు ముక్క ముట్టుకోకూడదు…ఇక్కడ అమ్మాయిని పెళ్లిచేసుకునే అబ్బాయిలు కూడా నాన్ వెజ్ మాటెత్తకూడదు. ఈ నిబంధనలకు అంగీకరిస్తేనే పెళ్లిచేసుకుంటారు. ఈ ఊర్లో ఉన్నంత సేపు తినరు కానీ బయటకు వెళ్లాక తింటారేమో అనుకున్నా పొరపాటే…ఎందుకంటే ఇక్కడి వారంతా హంగారం, వెండి వ్యాపారలనిమిత్తం దేశం నలుమూలలా తిరుగుతుంటారు. ఎక్కడికి వెళ్లినా కేవలం శాఖాహారం మాత్రమే తీసుకుంటారు.
అన్ని కులాల వారూ ఉన్నారు
నాన్ వెజ్ నాట్ అలోడ్ అని ఇంత స్ట్రిక్టుగా అమలుచేస్తున్నారంటే అక్కడ అగ్రకులాల డామినేషన్ ఉందేమో అనుకుంటే పొరపాటే. ఈ గ్రామంలో అన్ని కులాలవారూ, అన్ని మాతల వారూ ఉన్నారు. కానీ ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా అందరూ కలసి అనుసరిస్తున్న నియమం ఇది.
ప్రతిజ్ఞలు చేసే దేవాలయం
ఈ ఆలయంలో ఏదైనా గట్టిగా అనుకుని ప్రతిజ్ఞ చేస్తే అది నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. అందుకే దేశం నలుమూలల నుంచి ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చి తమన మనసులో కోర్కెలు విన్నవించుకుంటారు. అవి నెరవేరిన తర్వాత మళ్లీ వచ్చి దర్శించుకుంటారు. వెంటాడుతున్న కష్టాలనుంచి కూడా ఉపశమనం పొందుతారని చెబుతారు. ఈ ప్రాంతం కొండలు, దట్టమైన అడవుల మధ్య ఉంటుంది. ఉత్తరాభిముఖంగా ఉన్న ఈ ఆలయం అద్భుతమైనది, దివ్యమైనదిగా భక్తులు భావిస్తారు.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.