50 శాతం ఓట్ షేరే లక్ష్యం

విపక్షాల కిచడీ కూటమి బెంగళూరులో సమావేశమైన రోజునే ఢిల్లీలో ఎన్డీయే భేటీ జరిగింది. ఇండియా కూటమికి ప్రధాని నరేంద్ర మోదీ గట్టి కౌంటరిచ్చారు. వాజ్ పేయి, ఆడ్వాణీ ఒక స్వరూపమిచ్చిన తమ కూటమి ఇటీవలే 25 వసంతాలు పూర్తి చేసుకుందని మోదీ గుర్తు చేస్తూ.. మరో పాతికేళ్లు సులభంగా మనుగడ సాగిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రకాశ్ సింగ్ బాదల్, బాలాసాహెబ్ ఠాక్రే, శరద్ యాదవ్, అజిత్ సింగ్, జార్జ్ ఫెర్నాండెజ్, రామ్ విలాస్ పాశ్వాన్ లాంటి నేతల సేవల వల్లే ఎన్డీయే పటిష్టమైన కూటమిగా అవతరించిందని మోదీ అన్నారు.

రేపు అధికారం మాదేనంటున్న మోదీ

నిన్నా, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నామని 2024 ఎన్నికల్లో కూడా తామే గెలుస్తామని మోదీ ప్రకటించేశారు. అందులోనూ యాభై శాతంపైగా ఓట్ షేర్ తమకే దక్కుతుందని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో 225 స్థానాలకు పైగా 50 శాతం ఓట్ షేర్ ను దాటి గెలిచామని మోదీ ప్రస్తావించారు. ఆాయా లోక్ సభా స్థానాలను ఎన్డీయే నుంచి లాక్కోవడం ఇండియా కూటమికి దుర్లభమని కూడా మోదీ గుర్తుచేశారు. స్థూలంగా చూస్తే 2014లో ఎన్డీయేకు 38 శాతం ఓట్ షేర్ ఉండేది. 2019 నాటికి అది 44 శాతానికి పెరిగింది. ఈ సారి మొత్తం మీద 50 శాతం దాటుతుందని మోదీ ధీమాగా ఉన్నారు.

ఆ నాలుగు రాష్ట్రాలే కీలకమా..

మోదీ లక్ష్యం నెరవేరాలంటే పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు కీలకంగా ఉంటాయని బీజేపీ లెక్కలేస్తోంది. ఎందుకంటే అక్కడ బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ కు తగిన అవకాశం ఇవ్వవు. దానితో విపక్ష కూటమిలో సంఘర్షణ ఖాయమవుతుంది. పైగా ఎన్డీయే కూటమిలోకి అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ లాంటి కొత్త నేతలతో పాటు చిరాగ్ పాశ్వాన్, రాజ్ బహర్ లాంటి పాత నేతల పునరాగమనం సరికొత్త ఊపునిచ్చింది. అందుకే ఎన్డీయేకు మోదీ కొత్త అబ్రివేషన్ చెప్పారు. ఎన్ అంటే న్యూ ఇండియా అని, డీ అంటే డెవలప్డ్ నేషన్ అని, ఏ అంటే యాస్పిషన్స్ అంటే ఆకాంక్షలనీ మోదీ నిర్వచించారు.

తప్పులు జరుగుతాయి.. దురుద్దేశాలుండవ్..

విపక్ష పార్టీలకు మోదీ గట్టిగానే చరకలంటించారు. దురుద్దేశంతో వాళ్లంతా ఒకటయ్యారని అన్నారు. తన వైపు నుంచి తప్పులు జరిగి ఉండొచ్చన్న, కాకపోతే ప్రజలను ముంచెయ్యాలన్న దురుద్దేశం తనకు ఎప్పుడూ లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రతిక్షణం దేశం కోసమే పనిచేస్తానని మోదీ చెప్పుకున్నారు. కేరళలో ఒకరినొకరు చంపుకునే లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు బెంగళూరు వేదికపై మాత్రం పక్కపక్కన కూర్చున్నాయని, అలాంటి పార్టీలను ఎలా నమ్మాలని ఆయన ప్రశ్నించారు. నిజానికి మోదీకి ఒక అడ్వాంటేజ్ ఉంది. రేపటి ఎన్నికల్లో మోదీ పేరు చెప్పి ఎన్డీయే ఓట్లు అడుగుతుంది. పైగా మోదీపై ఎలాంటి అవినీతి, ఆశ్రిత పక్షపాత ఆరోపణలు లేవు.ఆయన ఎన్నడూ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించలేదు.మోదీ ప్రపంచంలోనే అత్యంత జనాదరణ ఉన్న నాయకుడు. అదే బీజేపీకి శ్రీరామరక్ష..