ఆరు రోజుల్లో కాశీ, అయోధ్య టూర్ – IRCTC ప్రత్యేక ప్యాకేజీ జులై 26 నుంచి ప్రారంభం!

ఉత్తరభారతంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వారణాసి, అయోధ్య, నైమిశారణ్య ప్రాంతాలను దర్శించుకునే వీలు కల్పిస్తోంది. రోజుల తరబడి కాకుండా వారంలోపే విమానంలో ఇవన్నీ చుట్టొచ్చే సదుపాయం కల్పిస్తోంది IRCTC. ఆ వివరాలేంటో చూద్దాం…

గంగా రామాయణ్‌ యాత్ర పేరిట ఐఆర్‌సీటీసీ పలు పవిత్ర పుణ్యక్షేత్రాల సందర్శనకు అవకాశం కల్పిస్తోంది. ఉత్తర భారతంలో పుణ్యక్షేత్రాలైన వారణాసి, అయోధ్య, నైమిశారణ్య ప్రాంతాలను దర్శించుకునే వీలు కల్పిస్తోంది. పైగా విమానంలో చకచకా చుట్టేసి వచ్చేయవచ్చు. జులై 26, ఆగస్టు 9, 27 తేదీల్లో ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ యాత్ర ఐదు రాత్రులు, ఆరు పగళ్లు కొనసాగుతుంది. హైదరాబాద్‌ నుంచి విమానంలో వారణాసికి చేరుకున్నాక ప్రారంభమై లఖ్‌నవూ నుంచి హైదరాబాద్‌ రావడంతో యాత్ర సంపూర్ణమవుతుంది.

మొదటి రోజు
హైదరాబాద్‌ నుంచి ఉదయం 9:35 గంటలకు విమానం బయల్దేరుతుంది. మధ్యాహ్నం 11:25 గంటలకు వారణాసి ఎయిర్‌పోర్ట్‌కు చేరుతారు. ముందుగా బుక్ చేసిన హోటల్లో బస చేసి మధ్యాహ్న భోజనం తర్వాత కాశీ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత గంగా ఘాట్‌ సందర్శించుకుని రాత్రి వారణాసిలోనే బస చేస్తారు. వారణాసి ఘాట్‌కు చేరటానికి బస్సు సౌకర్యం ఉండదు. ఆటో, రిక్షాల్లో ప్రయాణించాల్సి వస్తే ఆ ఖర్చులను యాత్రికులే భరించాల్సి ఉంటుంది.

రెండో రోజు
రెండో రోజు ఉదయం అల్పాహారం ముగించుకుని సారనాథ్‌కు బయలుదేరుతారు. అక్కడ దర్శనం పూర్తిచేసుకుని మధ్యాహ్నం మళ్లీ వారణాసికి చేరుకుంటారు. అక్కడి నుంచి బిర్లా ఆలయానికి వెళతారు. తర్వాత ఘాట్ల సందర్శన, షాపింగ్‌ యాత్రికుల ఇష్టం.

మూడో రోజు
వారణాసి నుంచి బయలుదేరి ప్రయాగ్‌రాజ్‌ చేరుకుంటారు. అక్కడి అలోపీ దేవీ ఆలయం, త్రివేణి సంగమాన్ని సందర్శిస్తారు. సాయంత్రం అయోధ్యకు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.

నాలుగో రోజు
నాలుగో రోజు అల్పాహారం ముగించుకుని అయోధ్యలోని ఆలయాన్ని దర్శిస్తారు. మధ్యాహ్నం అక్కడి నుంచి బయలు చేరి లఖ్‌నవూ చేరుకుంటారు. రాత్రి అక్కడే హోటల్‌లో బస ఏర్పాటు చేస్తారు.

ఐదో రోజు
లఖ్‌నవూలోని హోటల్‌లో అల్పాహారం పూర్తి చేసి నైమిశారణ్యానికి బయలుదేరుతారు. రోజంతా అక్కడే ఉండి తిరిగి సాయంత్రం హోటల్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయొచ్చు.

ఆరో రోజు
అల్పాహారం ముగించుకొని లఖ్‌నవూలోని చారిత్రక కాంప్లెక్స్‌ బారా ఇమాంబరను సందర్శిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నానికి హోటల్‌ చేరుకుంటారు. సాయంత్రం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని హైదరాబాద్‌కు (6E – 278) పయనమవుతారు. 10:50 హైదరాబాద్ చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.

ప్రయాణం చేయాలంటే ఇవి తెలుసుకోవాలి
75 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు ఎస్కార్ట్/కుటుంబ సభ్యులను తోడుగా తీసుకెళ్లాలి. విమాన ప్రయాణానికి 2 గంటల ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి ఫ్లైట్ మిస్సైతే బాధ్యత మీదే. ప్రయాణ పత్రాలతో పాటు 2 నుంచి 11 ఏళ్లున్న పిల్లలు వయస్సు ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. 11 ఏళ్లు దాటిన వారిని పెద్దలుగా పరిగణిస్తారు. ఐదు రోజుల పాటు అల్పాహారం, రాత్రి భోజనం, ఒక రోజు మధ్యాహ్న భోజనం మాత్రమే ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేస్తుంది.

ఛార్జీల వివరాలు
సింగిల్‌ షేరింగ్‌ కావాలంటే ఒక్కొక్కరికీ రూ.33,900
ట్విన్‌ షేరింగ్‌ అయితే రూ.27,800
ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ అయితే రూ.26,050
5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు ఒకరికి విత్‌ బెడ్‌ అయితే రూ.22,400, విత్‌ అవుట్‌ బెడ్‌ అయితే రూ.22,150 చెల్లించాలి.
2-4 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.16,600 చెల్లించాలి

క్యాన్సిల్ చేయాలనుకుంటే
యాత్రకు 21 రోజుల ముందు టికెట్‌ను క్యాన్సిల్‌ చేసుకుంటే టికెట్‌ మొత్తం ధరలో 30 శాతం మినహాయిస్తారు. అదే 21 నుంచి 15 రోజుల్లో అయితే 55 శాతం.. 14 నుంచి 8 రోజుల్లో అయితే 80 శాతం డబ్బును టికెట్‌ ధర నుంచి మినహాయిస్తారు. ప్రయాణానికి ఎనిమిది రోజుల ముందు టికెట్‌ క్యాన్సిల్‌ చేస్తే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవు.