గద్దలు మాంసాహారం తింటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఓ రెండు గద్దలు మాత్రం మాంసాహారం ముట్టుకోవు. కేవలం ఆ ఆలయంలో పెట్టే ప్రసాదం తింటాయి. రోజూ భోగం పెట్టే సమయానికి రెండు గ్రద్దలు వచ్చి ప్రసాదం తిని వెళతాయి. అదే అక్కడి ప్రత్యేకత…
పక్షితీర్థం..ఈ పక్షితీర్థం చెన్నై నగరానికి దక్షిణంగా చెంగల్పట్టు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో మహాబలిపురం వెళ్లే దారిలో ఉంటుంది. నిజానికి ఈ ఊరి అసలుపేరు తిరుక్కుర కుండ్రం. ఇక్కడ ఒక పెద్ద దేవాలయం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. కానీ ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కొండపైకి నిత్యం రెండు పక్షులు వచ్చి ప్రసాదాన్ని తిని వెళుతుంటాయి. పక్షులు వచ్చి ప్రసాదం తినివెళ్లడం వెనుక ఓ పురాణకథ ప్రచారంలో ఉంది. కృత యుగంలో సర్వ సంగ పరిత్యాగులైన ఎనిమిది మంది మహామునులకు ప్రపంచ భోగాలు అనుభవించాలనే కోరిక కలిగింది. తపస్సు చేయగా పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆ మునులంతా మీ సేవే చాలుస్వామి అన్నారు. కానీ మోక్షం కావాలని ఆశించిన వారి మనసులో కోరిక గ్రహించిన శివుడు..ఎనిమిది మందినీ 8 పక్షులుగా జన్మించనమన్నాడు. ఒక్కో యుగంలో ఇద్దరు రెండు పక్షులుగా ఉంటారు. నిత్యం గంగాస్నానం చేసి తన ప్రసాదం తిని వెళ్తారని ఆ తర్వాత జన్మలో మోక్షం కలుగుతుందనే వరమిచ్చాడు. అలా పుట్టినవే ఈ రెండు గద్దలు. అంటే యుగానికి ఇద్దరు మునులు రెండు గద్దలుగా జన్మించారు. ఇప్పటికే మూడు యుగాలు గడిచి నాలుగో యుగంలో అడుగుపెట్టాం.
(గద్దలుగా మారిన మునుల పేర్లు)
కృతయుగంలో పూష ,విధాత
త్రేతాయుగంలో జటాయువు, సంపాతి
ద్వాపర యుగమున శంభుగుప్త, మహా గుప్తులు
కలియుగమున శంబర – శంబరాదులు… ఇప్పుడు పక్షితీర్థం ఆలయం దగ్గరకు వస్తున్న పక్షులివే…
నిత్యం పొంగలి తినే గద్దలు
నిత్యం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం పూర్తైన తర్వాత… సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలయ్యే సరికి అర్చకులు చిన్న బిందె నిండుగా చక్కెర పొంగలి పట్టుకుని కొండపైకి వెళతాడు. బిందెమీద ఉంచిన పళ్లాన్ని తీసి గరిటెతో శబ్దం చేస్తూ కూర్చుంటాడు. పై నుంచి రెండు పక్షులు వచ్చి ఆయన పక్కన వాలతాయి. బిందెలో ఉన్న పరమాన్నాన్ని స్పూన్లతో తీసి ఆ పక్షుల ముందు ఉంచుతాడు. అవి ఆ పరమాన్నంలో రెండు, మూడుసార్లు ముక్కు ముంచి వెళ్లిపోతాయి. ఆ తర్వాత ప్రసాదాన్ని భక్తులకు పంచిపెడతారు. ఈ పక్షులు కాశీ, రామేశ్వరం యాత్ర చేస్తూ మధ్యలో పూజారి ఇచ్చిన పరమాన్నం రుచి చూసిన ప్రాంతంలో ఆగుతాయని అందుకే “పక్షితీర్థం”గా ప్రసిద్ధిచెందందని చెబుతారు. ఇక్కడ కొలువైన స్వామి పేరు “భక్తవత్సలేశ్వరుడు”, అమ్మవారి పేరు “త్రిపురసుందరి”. ఈ ఆలయంలోని శిల్పకళ అత్యద్భుతంగా ఉంటుంది. సుమారు 500 అడుగుల ఎత్తులో ఉండే ఈ కొండను వేదగిరి అని పిలుస్తుంటారు. కొండమీద వేదగిరీశ్వరాలయం అనే పేరుతో ఒక శివాలయం ఉంటుంది. ఇక్కడి అమ్మవారిని చుక్కాలమ్మగా కొలుస్తుంటారు. ఏదేమైనా పక్షులు ప్రసాదం తిని వెళ్లే దృశ్యాలు చూసిన వారంతా…అంతా స్వామివారి మహిమే అంటారు….
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.