ఎన్నికలకు ఆరు నెలలే ఉన్నాయని.. బీజేపీలోని అన్ని కమిటీల్ని బలపేతం చేయాలని ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షురాలు పురందేశ్వరి పిలుపునిచ్చారు. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తొలి సారిగా పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఇందులో ఎన్నికల వరకూ చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా కీలక నిర్మయాలు తీసుకున్నారు.
క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం చేసేలా చర్యలు
ప్రతి కార్యకర్త పూర్తి సహకారం అందించినప్పుడే పార్టీ బలోపేతం సాధ్యం అవుతుందని పదాధికారుల సమావశం నిర్ణయించింది. క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజలకు చేరువ చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్ణయించారు. 2014 తర్వాత పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఒంటరిగా వెళ్లాలని చాలా మంది సూచించారని, అయితే పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ముందు కసరత్తు చేయాలని అధినాయకత్వం సూచించిందని పురందేశ్వరి చెప్పారు. ఎన్నికలకు ఇంకా ఐదారు నెలల సమయమే ఉందని, అన్ని స్థాయిల్లోని కమిటీలను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు.. రాజకీయంగా వేసే అడుగులపైనా ఆలోచించాలన్నారు.
ప్రజలకు అండగా ఉండే బలమైన శక్తిగా బీజేపీ : విష్ణువర్ధన్ రెడ్డి
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ముఖ్య భూమిక పోషించి, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఉండబోతుందని ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. పదాధికారుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలపై ప్రజాఉద్యమం చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది, ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం చూస్తున్నారని.. స్పష్టం చేశారు 9 సంవత్సరాల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాలు నిమిత్తం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వేల కోట్ల నిధులు మంజూరు చేయడం ద్వారా నరేంద్ర మోడీ కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజల హృదయాల్లో ఉందన్నారు.
ఏపీ ప్రభుత్వ స్కాములపై పోరాటం : పురందేశ్వరి
ఏపీలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పాలిస్తోందని, మద్యం డిస్టిలరీస్ అన్నీ అధికార పార్టీ పెద్దల సన్నిహితులకే ఇచ్చారని విమర్శించారు. మద్యం అమ్మకాల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతోందని, సీఎం ఇంటి సమీపంలో అత్యాచారం జరిగినా న్యాయం జరగని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని పురందేశ్వరి విమర్శించారు. పదో తరగతి పిల్లవాడిని.. ఓ ఉపాధ్యాయుడిని పట్ట పగలు చంపేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. లూలూ, జాకీ వంటి కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయన్నారు. రాష్ట్రంలో ఇసుక దందా భారీ ఎత్తున జరుగుతోందని ఆరోపించారు. సుప్రీం కోర్టు కూడా ఇసుక తవ్వకాలు ఆపాలని ఆదేశించిందన్నారు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి అక్రమ ఇసుక తవ్వకాలే కారణమని పురంధేశ్వరి ఆరోపించారు. కేంద్రం ఏపీకి అనేక రకాలుగా సహకారం అందిస్తోందని, ఇళ్లకు రంగులు మార్చడంపై ఉన్న శ్రద్ధ.. ఇళ్ల నిర్మాణంపై చెప్పడం లేదని మండిపడ్డారు. కేంద్ర నిధులను పక్క దోవ పట్టిస్తోందని, ఏపీ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిందని పురంధేశ్వరి పేర్కొన్నారు.
ప్రత్యేక కార్యాచరణకు రెడీ
బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను .. పదాధికారుల సమావేశంలో ఖరారు చేసుకున్నారు. పార్టీ కోసం కష్టపడే నేతలకు అదనపు బాధ్యతలు ఇచ్చి.. ఎన్నికలయ్యే వరకూ ప్రజాక్షేత్రంలోనే ఉండేలా చూడనున్నారు.