ఒడిశా కాంగ్రెస్ లో సస్పెన్షన్ల సంక్షోభం

ఒడిశాలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే మారి చాలా రోజులైంది. నవీన్ పట్నాయక్ అధికారం సుస్థిరమైన తర్వాత కాంగ్రెస్ మరింత బలహీనమైపోయింది. అక్కడ బీజేపీ క్రమంగా బలం పుంజుకుంటుంటే, కాంగ్రెస్ మాత్రం అంతర్గత కుమ్ములాటతో కూనారిల్లుతోంది. హస్తం పార్టీ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తూ పార్టీ పరువును బజారుకీడ్చుతున్నారు.

ఇద్దరు నేతల సస్పెన్షన్

ఒడిశాకు చెందిన ఇద్దరు నేతలు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఈ వారం సస్పెండ్ చేసింది. కటక్ -బారాబతి ఎమ్మెల్యే మొహ్మద్ మొకిమ్, మాజీ ఎమ్మెల్యే చిరంజీబ్ బిశ్వాల్ ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తారిక్ అన్వర్ ప్రకటించారు. క్రమశిక్షణా సంఘం నివేదిక ఆధారంగా ఒడిశా పీసీసీ అధ్యక్షుడు శరద్ పట్నాయక్ సిఫార్సు మేరకు వారిని తాత్కాలికంగా పార్టీ నుంచి తొలగించారు. పార్టీపై బహిరంగ విమర్శలు చేస్తూ, క్రమశిక్షణను ఉల్లంఘించారని ఆ ఇద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

పెద్దల సమక్షంలోనే విమర్శలు

చిరంజీబ్ బిశ్వాల్ పార్టీ పెద్దల సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీ తీరుపై తరచూ విమర్శలు సంధిస్తున్నారు. ఒడిశా పీసీసీ అధ్యక్షుడు పాల్గొన్న ఒక సభలో ఆయన స్పీచ్ తెగ వైరల్ అయ్యి పార్టీ పార్టీ పరువు పోయింది. 2024 ఎన్నికల నాటికి పార్టీ పునరుద్ధరణ అసాధ్యమని ఆయన ప్రకటించేశారు. పార్టీలో నాయకత్వ సంక్షోభం ఉందని, ఎవరినీ సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని, అదో ఔషధం దొరకని రోగంగా మారిందని ఆయన ఆరోపణాస్త్రాలు సంధించారు. దీనితో ఒడిశాలో కాంగ్రెస్ పార్టీ నవ్వుల పాలవుతోందన్న అభిప్రాయమూ కలుగుతోంది.

లోపిస్తున్న క్రమశిక్షణ

ఒడిశాలో కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది మంది ఎమ్మెల్యేలున్నారు. వారు తొమ్మిది రకాలుగా పార్టీని అభాసుపాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే మొహ్మద్ మొకిమ్ ను సస్పెండ్ చేసిన వెంటనే ఆయన అనుచరులు రెచ్చిపోయారు. అక్కడక్కడా పీసీసీ అధ్యక్షుడు శరద్ పట్నాయక్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మొకిమ్ మాత్రం చాలా వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు. తాము ఎలాంటి తప్పుచేయలేదని త్వరలోనే సస్పెన్షన్ ఎత్తివేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేవలం వాట్సాప్ లో చూసి తన సస్పెన్షన్ ను తెలుసుకున్నానని ఆయన చెబుతున్నారు. తాను సంతృప్తిరకమైన వివరణ ఇచ్చిన తర్వాత కూడా సస్పెండ్ చేయడంపై ఆయన ఆగ్రహం చెందుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు మద్దతిచ్చినందుకే తమపై కొందరు కక్షకట్టారని ఆయన ఆరోపిస్తున్నారు.

ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో సగం మంది అధికార బీజేడీకి మద్దతిస్తున్నారని వారి కదలికలను బట్టే తెలుస్తోంది. అసెంబ్లీలో, బయట ఏ విషయం చర్చకు వచ్చినా వాళ్లు నవీన్ పట్నాయక్ కు జై కొడుతున్నారు. కొందరు బీజేడీ వైపుకు మరికొందరు బీజేపీ వైపుకు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడదే పెద్ద శిరోభారమై కూర్చుంది.