జనసేనలో ఆమంచి సోదరుడు – చీరాల వైసీపీ క్యాడర్ అంతా ఆ పార్టీలో చేరుతుందా ?

ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు జనసేనలో చేరనున్నారు. తర్వాత చీరాలలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తారు. ఆమంచి సోదరులు ఇద్దరూ కలసి కట్టుగానే రాజకీయాలు చేస్తారు. ఆమంచి కృష్ణమోహన్ తెర ముందు రాజకీయం చేస్తే.. స్వాములు తెర వెనుక రాజకీయంం చేస్తారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఆమంచి ఓడిపోయి.. చీరాలలో కరణం బలరాం టీడీపీ తరపున గెలుపు తర్వాత చీరాల రాజకీయం మారింది. ఎమ్మెల్యే కరణం అనూహ్యంగా వైసీపీకి దగ్గరవడంతో ఆమంచికి చీరాలలో ప్రాధాన్యతను తగ్గించారు. అంతేకాకుండా కరణం బలరాం వర్గంతో విభేదాలు కూడా ఉన్నాయి.
ఆమంచికి ఇష్టం లేకపోయినా చీరాల ఇంచార్జిగా పంపిన హైకమాండ్

వైసీపీ అధిష్టానం చీరాలపై నియోజకవర్గాన్ని కరణం బలరాంకు అప్పగించింది. పర్చూరు నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా ఆమంచి కృష్ణమోహన్ ను నియమించింది. అయితే తనకు పట్టు ఉన్న చీరాలలో కాకుండా.. టీడీపీ బలంగా ఉన్న పర్చూరులో తనకు సీటు ఎందుకని ఆయనంటున్నారు. టీడీపీతో పొత్తు ఉంటే.. చీరాల సీటు కేటాయిస్తారన్న ఉద్దేశంతో .. సోదరులిద్దరూ మాట్లాడుకుని .. ముందుగా ఒకరు జనసేనలో చేరుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవల ఆమంచి కృష్ణమోహన్ పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. గతంలో ఆయన వివాదాస్పద ప్రకటనలు చేయడంలో ముందు ఉండేవారు.

సోదరిలిద్దరూ మాట్లాడుకునే రాజకీయం చేస్తున్నారా ?

ఇండిపెండెంట్ గా కూడా గెలిచిన తన కంచు కోట చీరాల నుంచి వెళ్లడాన్ని ఆమంచి సహించలేకపోతున్నారని అంటున్నారు. అక్కడ తమ పట్టు ఉండాలంటే కుటుంబం నుంచి ఒకరు ఉండాల్సిందేనని అనుకుంటన్నారు. అధికార పార్టీని ధిక్కరించలేక.. జగన్ కాదంటే.. జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి.. ఆయన పర్చూరు ఇంచార్జ్ గా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆయన వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు.. అది వైసీపీనే అవ్వాలన్న రూల్ లేదని కూడా అనుకుంటున్నారు. ఆయన దృష్టిలో జనసేన ఉంది.అందుకే ఆ పార్టీలోకి సోదరుడ్ని పంపి ఖర్చీఫ్ వేసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.

గతంలోనే జనసేనలో చేరుతారనిప్రచారం

నిజానికి ఆమంచి జనసేనలో చేరుతారని చాలా కాలంగా ప్రచారం లో ఉంది. ఇలా ప్రచారం జరిగినప్పుడు వైసీపీ నేతలు.. పవన్ ను.. ఆమంచితో ప్రెస్ మీట్ పెట్టి తిట్టించేవారు. ఇటీవల పవన్ పై ప్రెస్ మీట్లు పెట్టడం లేదు ఆమంచి. తన సీటులోకి టీడీపీ ఎమ్మెల్యేను ఆహ్వానించి వారికే టిక్కెట్ ఖరారు చేయడంతో ఆమంచి నమ్మి మోసపోయానని రగిలిపోతున్నారు. అందుకే ఆయన వచ్చే ఎన్నికలకు ముందు జగన ఝులక్ ఇవ్వడానికి రెడీ అవుతారని.. ముందుగా తన సోదరుడ్ని పంపుతున్నారని అంటున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం.. సోదరులిద్దరూ విబేధాలొచ్చాయని ఎవరి రాజకీయ వారు చేస్తున్నారని అంటున్నారు. ఒక వేళ లేకపోయినా కరణం బలరాంకు మాత్రం మద్దతిచ్చే ప్రశ్నే ఉండదంటున్నారు.