భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రాన్స్ పర్యటన విజయవంతమైంది. రెండు రోజుల పాటు బిజీగా గడిపిన మోదీ అక్కడి నేతలతో జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో అనేక కీలక ఒప్పందాలు జరిగాయి.
25 ఏళ్ల విడదీయరాని బంధం
భారత్ – ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఖచితమైన రోడ్ మ్యాప్ తో ముందుకు వెళ్తున్నామని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం మొదలై పాతికేళ్లయ్యిందని, ఈ దిశగా గట్టి పునాది పడిందని ప్రధాని గుర్తుచేశారు. మరో 25 ఏళ్ల పాటు ఈ భాగస్వామ్యం కొనసాగేందుకు వీలుగా పటిష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
రక్షణరంగ భాగస్వామ్యమే ప్రధానం
ద్వైపాక్షిక భాగస్వామ్యంలో మిలటరీ సంబంధాలు మనకు కీలకంగా మారాయని మోదీ గుర్తుచేశారు. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కల సాకారం చేసుకునే దిశగా ఫ్రాన్స్ చేయూతను ఆయన ప్రస్తావించారు. జలాంతర్గాములు, నేవీ యుద్ధ విమానాల తయారీలో పరస్పర సహకారాన్ని మోదీ గుర్తుచేశారు. ఇతర మిత్ర దేశాలకు కలిసి చేస్తున్న సాయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. రక్షణ, అంతరిక్ష రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించే వీలుంటుందని మోదీ అన్నారు. హెలికాప్టర్ ఇంజిన్లు, విడిభాగాల తయారీ కేంద్రాలను ఫ్రెంచ్ కంపెనీలు భారత్ లో నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నాయని మనతో కలిసి పనిచేయడం ద్వారా మేకిన్ ఇండియా భావనకు సహకరిస్తాయని ఆయన వివరించారు. నౌకాదళానికి మూడు స్కార్పీన్ జలాంతర్గాములను నిర్మించే ప్రాజెక్టులపై కూడా అవగాహనకు వచ్చారు.
బాస్టీల్ డే పెరేడ్ కు మోదీ
ప్రతీ ఏటా జూలై 14న జరిగే ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ వేడుకలకు ఈ సారి గౌరవ అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యారు. భారత సైనికులు సైతం పాల్గొన్న బాస్టీల్ డే పెరేడ్ ను ఆయన తిలకించారు. అందులో 269 మంది భారత సైనికుల బృందం ఫ్రెంచ్ సైన్యంతో కలిసి కవాత్తు చేసింది. భారత్ కు చెందిన రఫేల్ యుద్ధ విమానాలు ఆకాశంలో రంగులద్దాయి. భారత సైనిక బృందం పరేడ్ లో పాల్గొన్నప్పుడు మోదీ లేచి నిల్చుని సెల్యూట్ చేయడం విశేషం
మోదీకి అరుదైన గౌరవం
ప్రధాని మోదీకి ఫ్రాన్స్ ప్రభుత్వం అరుదైన గౌరవమిచ్చింది. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్ తో ప్రధాని మోదీని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సత్కరించారు. ప్రపంచ చరిత్రలో భారతదేశం బాహుబలిలాంటిదని మెక్రాన్ ప్రశంసించారు. భవిష్యత్తులోనూ నిర్ణయాత్మక పాత్ర పోషించబోతోందని అభిప్రాయపడ్డారు. మానవాళికి మెరుగైన జీవితాన్ని ప్రసాదించే సత్తా భారత్ కు ఉందని ఫ్రెంచ్ అధినేత అన్నారు. మోదీ పర్యటన సందర్భంగా విద్యారంగంపై కూడా అవగాహనకు వచ్చారు. 2023 నాటికి ఏటా 30 వేల మంది ఫ్రెంచ్ విద్యార్థులు ఇండియా వచ్చి చదువుకుంటారు. ఫ్రాన్స్ లో చదువుకునే భారత విద్యార్థులకు దీర్ఘకాలిక వీసాలు ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించింది.