బాఘెల్ వర్సెస్ బాఘెల్ – శభాష్ సరైన పోటీ

ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ కు సరైన పోటీ తగిలింది.అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. సీఎంకు దూరపు బంధువైన విజయ్ బాఘెల్ ను రంగంలోకి దించింది. కమలాన్ని గెలిపించే బాధ్యతను విజయ్ పై పెట్టింది.

బీజేపీ క్యాంపైన కమిటీ చైర్మన్ విజయ్

లోక్ సభ సభ్యుడైన విజయ్ బాఘెల్ ను ఛత్తీస్ గఢ్ ఎన్నికలకు బీజేపీ ప్రచార సారథిగా నియమించారు. 30 మందితో ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీకి కూడా విజయ్ నాయకత్వం వహిస్తారు. కాంగ్రెస్ ప్రకటిస్తున్న సహేతుకం కాని హామీలను ఎండగట్టే బాధ్యత కూడా ఆయనకే అప్పగించారు 2000 సంవత్సరం వరకు కాంగ్రెస్ లో ఉన్న విజయ్.. ఆ తర్వాత బీజేపీలో చేరారు. భూపేష్ పై రెండు సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓ సారి గెలిచారు . 2013 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన లోక్ సభకు పోటీ చేసి గెలిచారు.

రైతు సంక్షేమమే ప్రధానం..

మేనిఫెస్టో కమిటీ పెద్దగా వ్యవసాయానికి పెద్ద పీట వేస్తానని విజయ్ బాఘెల్ చెబుతున్నారు. ధాన్యాగారమైన ఛత్తీస్ గఢ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసిందని విజయ్ ఆరోపిస్తున్నారు. అధికారానికి వచ్చిన తర్వాత రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని విజయ్ చెబుతున్నారు.నిజానికి వరి సేకరణపై కాంగ్రెస్, బీజేపీ మధ్య వార్ నడుస్తోంది. రాష్ట్రంలో పండిన ధాన్యంలో 80 శాతం కేంద్రమే సేకరించిందని ఇటీవల ఛత్తీస్ గఢ్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించడం వాస్తవ స్థితికి దర్పణం పడుతోంది.ధాన్యం దిగుబడి పెరిగిన నేపథ్యంలో కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదని రైతులు వాపోతున్న మాట వాస్తవం. కూలీల బతుకుల్లో వెలుగులు నింపడమే తమ ప్రథమ ప్రాథమ్యమని విజయ్ బాఘెల్ చెప్పుకున్నారు.

జనంలోకి వెళ్లనున్న విజయ్

మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా విజయ్ బాఘెల్ రోజువారీ పర్యటనలకు సిద్ధమవుతున్నారు. మేనిఫెస్టో రూపొందించే లోపు అన్ని సామాజిక వర్గాల పెద్దలను, మహిళలను, విద్యార్థులను, కార్మిక సంఘాల ప్రతినిధులను, వ్యాపారులు, రైతులు, పాత్రికేయులను, ప్రభుత్వోద్యోగులను కలవబోతున్నారు. ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చి జనం తమ అభిప్రాయాలను ఆ నెంబర్ కు పంపించాలని కోరబోతున్నారు. అన్ని వర్గాలు ఇచ్చే సలహాల ఆధారంగా మేనిఫెస్టో రూపొందుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా మేనిఫెస్టోపై దృష్టి పెట్టకపోయినప్పటికీ వరి సేకరణను ఎకరాకు 15 క్వింటాళ్ల నుంచి 20 క్విటాళ్లకు పెంచుతామని ప్రకటించింది. అయితే కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పుట్ట అని విజయ్ బాఘెల్ ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి భూపేష్ కు ఉన్నంత గర్వం దేశంలో ఎవరికీ ఉండదని ఆయన అంటున్నారు. కాంగ్రెస్ కంటే బీజేపీలోనే తనకు ఎక్కువ గౌరవం దక్కిందని, ఈ సారి ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో కమలం పార్టీని గెలిపించి చూపిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు.