భారతదేశంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలున్నాయి. సీజనల్ గా చూసేవి కొన్ని, అన్ సీజన్లోనూ సందర్శించగలిగేవి కొన్ని ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే పర్యాటక ప్రాంతాలు మాత్రం చెప్పకునేందుకు బావుంటాయి కానీ సందర్శించాలనే ఆశతో వెళితే రిస్కే. అందుకే ఈ ప్రాంతాల్లో పర్యటనని నిషేధించారు. అలాంటి కొన్ని ప్రదేశాలేంటో చూద్దాం.
చంబల్ నది
మధ్యప్రదేశ్ లోని చంబల్ నదికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ నదీతీర ప్రాంతంలో ఉండే మనోహరమైన దృశ్యాలు చూసేందుకు సందర్శుకుల ఎగబడతారు. బాలీవుడ్ లో చాలా మూవీస్ షూటింగ్స్ జరిగాయి. అందంగా ఈ ప్రదేశాన్ని చూడాలని ముచ్చపడితే మాత్రం అక్కడుండే బందిపోటు దొంగలు ఆ సరదా తీర్చేస్తారు. అందుకే ఇక్కడకు సందర్శకులు పెద్దగా వెళ్లరు.
బస్తర్
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలో ఎన్నో ప్రదేశాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఇక్కడ చిత్రకూట్ వంటి పర్యాటక ప్రదేశాన్ని ఇండియన్ నయాగరా జలపాతాలుగా పిలుస్తారు. అయితే ఈ ప్రాంతంలో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండడంతో పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు మొగ్గుచూపరు.
సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్
సుందరమైన ప్రదేశాల్లో కేరళ ఫస్ట్ ఉంటుంది. అందుకే దీనిని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. ఈ రాష్ట్రంలో ఉన్న సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఒకప్పుడు సందర్శకులతో కళకళలాడేది. కానీ ఓసారి మావోయిస్టుల దాడి జరగడంతో అప్పటి నుంచీ ఈ పార్క్ ని సందర్శించేవారి సంఖ్య అలా తగ్గిపోయింది.
మానస్ నేషనల్ పార్క్
అస్సాంలో ఉన్న అందమైన ప్రదేశం మానస్ నేషనల్ పార్క్ . ఈ పార్క్‌ని దేశంలోని ఎంతో అందమైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా పిలుస్తారు. 2011లో బోడో ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో ఆరుగురు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అధికారులను కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో పర్యాటకుల తాకిడి తగ్గింది.
బారెన్ ద్వీపం
అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న బారెన్ ద్వీపంలో అగ్నిపర్వతం ఉంది. ఈ ప్రాంతం పెద్దగా ఉనికిలో లేకపోయినా ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ అగ్నిపర్వతం నుంచి వచ్చే దట్టమైన పొగను, ఎర్రని లావాలను చూడాలనుకుంటే చిన్న షిప్లో భద్రతా ప్రమాణాలతో వెళ్లి పరిమిత దూరం నుంచి చూడవచ్చు. కానీ ఆ సాహసం చేసేవారి సంఖ్య తక్కువే.
అక్సాయ్ చిన్
అక్సాయ్ చిన్ ఈ ప్రదేశాన్ని కూడా టూరిస్టులు చూసేందుకు వీలులేదట. ఇది ప్రపంచంలో ఎంత సుందరమైన ప్రదేశమో అంతే ప్రమాదకరమైన ప్రదేశం. లడాఖ్ పర్వత శిఖరాల మధ్య ఉంటుంది ఈ ప్రాంతం.
నికోబార్ ద్వీపం
అండమాన్ లో పర్యటించినట్టగా నికోబార్ దీవుల్లో పర్యాటకులు ప్రవేశించేందుకు ఛాన్స్ ఉండదు. ఇక గిరిజన సమూహాలు ఉండే ప్రాంతాల్లో అయితే అస్సలు అనుమతించరు. ప్రత్యేక పాస్‌లు ఉంటేనే పర్యాటకులు, విదేశీయులు ద్వీపంలో పర్యటించవచ్చు.
గమనిక: ఈ కథనం ద్వారా పర్యాటకులను నిరుత్సాహపరచాలనే ఉద్దేశం లేదు. కేవలం అవగాహన కోసం మాత్రమే ఇస్తున్నాం. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది మీ వ్యక్తిగతం