రూ. 2 లక్షల కోట్లు – ఏపీ జాతీయ రహదారుల కోసం కేంద్రం భారీ సాయం !

రూ. రెండు లక్షల కోట్లు. అంటే చిన్న మొత్తం కాదు. ఇంత పెద్ద మొత్తంలో ఏపీలో రోడ్ల నిర్మాణానికి కేంద్రం వెచ్చిస్తోంది. ఇది మాటల్లో చెప్పడం కాదు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు. కేంద్ర మంత్రి గడ్కరీ గురువారం.. ఏపీలో పర్యటించారు. కానీ ఆయన పర్యటన గురించి మీడియాలో పెద్దగా ప్రచారం కాలేదు. ఆయన ఏపీకి కేంద్రం ఇస్తున్న నిధుల వివరాల గురించి పూర్తి స్థాయిలో వివరించారు. వాటి గురించి తెలుసుకుంటే… కేంద్రం ఇంత పెద్ద ఎత్తున సాయం చేస్తుందా అని ఎవరైనా ఆశ్చర్యపోతారు.

కేంద్ర నిధుల వరద

దేశంలో యూపీ తర్వాత ఆంద్రప్రదేశ్ లో జాతీయ రహదారుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తిరుపతిలో గురువారం రూ.2900 కోట్లతో అభివృద్ధి చేయనున్న జాతీయ రహదారుల ప్రాజెక్ట్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కీలక వివరాలు వెల్లడించారు. తిరుపతిలో ఇంటర్నేషనల్ సెంట్రల్ బస్ స్టేషన్ నిర్మాణం, రూ.500 కోట్లతో ఏపీ ప్రభుత్వం – నేషనల్ హైవే సంస్థ మధ్య ఎం.వో యు జరిగింది. దీన్ని ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు.

కేంద్రం ఏపీలో చేపడుతున్న రహదారుల ప్రాజెక్టుల వివరాలు

దేశంలో ఏడు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారులు అభివృధ్ది చేస్తున్నారు. బెంగళూరు – చెన్నై మధ్య అభివృద్ధికి రూ.20 వేల కోట్లతో 260 కి.మీ రహదారి నిర్మాణం చేపట్టారు. వీటిలో 92 కి.మీ ఏపీ గుడిపాల మీదుగా వెళ్తోంది. చిత్తూరు 82 కి.మీ రూ.4,800 కోట్లు, ఢిల్లీ – చెన్నై గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి.. వీటిలో ఢిల్లీ నుంచి ముంబై మధ్య లక్ష కోట్లతో రహదారి నిర్మాణం చేపడుతున్నారు. సూరత్ నుంచి చెన్నై వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే.. ఏపీ గుండా 145 కి.మీ వెళ్తుంది. దీనికి రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. బెంగళూరు – విజయవాడ మధ్య 330 కి.మీ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం, దీని ద్వారా 95 కి.మీ దూరం తగ్గుతుంది. రాయపూర్ – విశాఖ మధ్య రూ.17 వేల కోట్లతో నిర్మాణం జరుగుతుంది. హైదరాబాద్- విశాఖ మధ్య రూ.7 వేల కోట్లతో నిర్మాణం, నాగ్ పూర్ – విజయవాడ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం జరుగుతుంది.

8744 కి.మీ జాతీయ రహదారులు నిర్మాణం

బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత 8744 కి.మీ జాతీయ రహదారులు నిర్మాణం చేపట్టారు. ఏపీలో 2023 లో రెట్టింపు రహదారులు నిర్మించారు. దేశ ఆర్థికానికి ఏపీ చాలా ముఖ్యమైన రాష్ట్రమని కేంద్రం భావన. దేశంలోనే విశాఖపట్నం మేజర్ పోర్ట్స్ ఒకటి అని.. జాతీయ రహదారుల నిర్మాణం ద్వారా ఏపీ పారిశ్రామికంగా మరింత అభివృధ్ది చెందుతని కేంద్ర మంత్రి గడ్కరీ ఆశిస్తున్నారు.