తమిళనాడు బీజేపీ.. నిత్యం యాక్టివ్ గా ఉండే ఒక శాఖ. ప్రస్తుత తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు కూడా పార్టీ క్రియాశీలంగా కనిపించేది. ఆమె గవర్నర్ గా వెళ్లిపోయిన తర్వాత మాజీ ఐపీఎస్ అన్నామలై తమిళనాడు బీజేపీ శాఖాధ్యక్షుడైనప్పటి నుంచి ఫైర్ బ్రాండ్ పేరు స్థిరపడిపోయింది.
స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు
అన్నామలై బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలైంది. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వంపై రోజువారీ విమర్శలు చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అదీ అన్నామలై మాత్రమేనని చెప్పాలి. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే కంటే కూడా అన్నామలై ఎక్కువ దూకుడుగా కనిపిస్తారు. డీఎంకే నేతలతో మాటకు మాట అంటూ సవాలు చేస్తుంటారు.
సంచలనం సృష్టించిన డీఎంకే పైల్స్
స్టాలిన్ కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలతో ఈ ఏడాది ఏప్రిల్ లో అన్నామలై వార్తల్లో వ్యక్తి అయ్యారు. స్టాలిన్ ఆయన కుమారుడు ఉదయనిధి, స్టాలిన్ అల్లుడు శబరీషన్ సహా 13 మంది ఆస్తులు 1.34 లక్షల కోట్లుగా ఉన్నాయని అన్నామలై ఆరోపించారు. పైగా అప్పటి తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్, డీఎంకే ఫస్ట్ ఫ్యామిలీపై చేసిన ఆరోపణలుగా భావిస్తున్న ఒక ఆడియో క్లిప్ ను కూడా అన్నామలై బహిర్గతం చేయడంతో డీఎంకే డిఫెన్స్ లో పడిపోయింది. దానితో త్యాగరాజన్ శాఖను స్టాలిన్ మార్చేశారు. మరో పక్క రూ. 500 కోట్లకు డీఎంకే అన్నామలైపై పరువునష్టం దావా వేసింది. తాను కూడా డీఎంకేపై ఐదు వందల కోట్ల ఒక్క రూపాయికి పరువు నష్టం దావా వేసి ఆ డబ్బును ప్రధాని సహాయ నిధికి పంపుతానని అన్నామలై అప్పట్లో ప్రకటించారు.తాను పూర్తి సాక్ష్యాధారాలతో డీఎంకేపై ఆరోపణలు చేస్తున్నానని, అధికార పార్టీ ప్రతినిధులు మాత్రం తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నామలై సమాధానమిచ్చారు.
ఇకపై జనంలోకి అన్నామలై..
స్టాలిన్ ప్రభుత్వంపై సమర భేరీ మోగించిన అన్నామలై ఇకపై జనంలోకి వెళ్లిపోవాలని డిసైడయ్యారు. అందుకోసం ఈ నెల 28న పవిత్ర పుణ్యక్షేత్రం రామేశ్వరం నుంచి పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా వచ్చి జెండా ఊపి అన్నామలై పాదయాత్రను ప్రారంభిస్తారు. తమిళనాడు అంతటా తిరిగే అన్నామలై.. ప్రతీ గ్రామంలో, పట్టణంలో డీఎంకే ప్రభుత్వ తప్పిదాలను ఏకరవు పెడతారు. ఢిల్లీ వెళ్లిన అన్నామలై అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుసుకుని పాదయాత్ర ఏర్పాట్లను వివరించారు. బీజేపీ కార్యక్రమాలకు జనంలో వస్తున్న స్పందనను ఆయన దృష్టికి తీసుకెళ్లారు..
నిజానికి అన్నామలై కీలక సమయంలో తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అన్నాడీఎంకే చీలికలు పీలికలై క్రమంగా ప్రజాదరణ కోల్పోతున్న సమయంలో ఆయన రాజకీయ బాధ్యతలు చేపట్టారు. అన్నాడీఎంకే స్థానంలో బీజేపీని నిలబెట్టాలన్నది ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. ఐపీఎస్ అధికారిగా పనిచేస్తూ రాష్ట్రం మొత్తం తిరిగిన అనుభవం ఆయనకు పనికొచ్చింది. జనం కూడా అన్నాడీఎంకేకు దూరం జరుగుతూ ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ వైపు చూసే టైమ్ వచ్చిందని అన్నామలై గ్రహించారు. అందుకే రోజురోజుకు దూకుడును పెంచుతున్నారు. స్టాలిన్ ను ఎదుర్కోవాలంటే బీజేపీ వల్లే సాధ్యమని నిరూపించడం అన్నామలై ఉద్దేశంగా తెలుస్తోంది