ఈ ఆలయంలో దేవుడికి నిత్యం తేనీటి నైవేద్యం!

ఏ ఆలయంలో అయినా దేవుడికి నైవేద్యంగా పులిహార,దద్ధ్యోజనం, చక్రపొంగలి నివేదిస్తారు. కొన్ని ప్రత్యేక ఆలయాల్లో చేపలు, మాంసం కూడా ప్రసాదంగా ఇస్తారు. కాని ఓ ఆలయంలో మాత్రం విచిత్రంగా దేవుడికి టీ నివేదిస్తారు. ఆవింత ఆచారాన్ని పాటిస్తోన్న ఆలయం గురించి ప్రత్యేక కథనం..

తేనీటి ప్రసాదం
కేరళలోని కన్నూర్ జిల్లా వలపట్టణం అనే నదీ తీరంలో ఉన్న ఆలయం చాలా ప్రత్యేకం.ఇక్కడ వెలసిన ముత్తప్పన్‌ ఆదివాసీల ఆరాధ్య దైవం. హరిహరుల అంశ అయిన అయ్యప్పస్వామిగా ఈ స్వామిని కొలుస్తారు. ఉత్తర మలబారులో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతున్న పరాసినిక్కడవులో ఉన్న ఈ ఆలయంలో ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. రాష్ట్ర నలుమూల నుంచి నిత్యం భక్తజనం తరలివస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ తేనేటిని నైవేద్యంగా సమర్పించడం అదే ప్రసాదంగా భక్తులకు ఇవ్వడం ప్రత్యేకం. ఈ సంప్రదాయం ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ దశాబ్దాలుగా కొనసాగుతోందని చెబుతున్నారు స్థానికులు. పత్రం, పుష్పం, ఫలం, నీరు.. ఏదైనా భక్తితో తనకు సమర్పిస్తే దానిని నేను సంతోషంగా స్వీకరిస్తాను అన్నాడు గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు. వీటికి అదనంగా తేనీరు కూడా చేర్చారు కేరళవాసులు. పరమాత్మకు నివేదించిన ఉష్ణోదకాన్ని ఆ ఆలయానికి వచ్చేవారికి ప్రసాదంగా పంచుతుంటారు. తేనీటితోపాటు పెసలు కూడా ముత్తప్పన్ ని నవేదించి ప్రసాదంగా అందిస్తారు. వాస్తవానికి పూర్వకాలం పెద్దోళ్లను గమనిస్తే వాళ్లలో చాలామంది పొద్దున్నే కాచే తొలి టీని దేవుడి ముందుంచి నైవేద్యం పెట్టి తాగేవారున్నారు. అలా ఆలయంలో టీ నివేదించే సంప్రదాయం ఈ ఆలయంలో ప్రత్యేకం.

భక్తులకు ఎన్నో సౌకర్యాలు
ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారు. భక్తులందరికీ ఇక్కడ ఉచితంగా బస చేసేందుకు స్థలం ఇస్తారు. ముత్తప్పన్ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే స్వామివారిని ప్రశన్నం చేసుకునేందుకు ఇక్కడ ఓ రకమైన నృత్యం ప్రదర్శిస్తారు. దీనినే తియ్యం అంటారు. ఈ నృత్యం చేసేందుకు కూడా భక్తులు భారీగా తరలివస్తారు. పైగా ఇక్కక ప్రసాదంగా ఇచ్చే తేనీటి కోసం భారీగా భక్తులు బారులు తీరి నిల్చుంటారు.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.