వచ్చే 10 నెలల్లో ఎవరూ ఊహించని కార్యాచరణ – పురందేశ్వరి బాధ్యతల స్వీకరణకు ఏపీ బీజేపీ భారీ ఏర్పాట్లు !

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ఆమెకు పార్టీ శ్రేణులు భారీ స్వాగతం చెప్పేందుకు ఏర్పాట్లు చేశారు. అమెరికా పర్యటన నుంచి వచ్చిన వెంటనే.. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.. పురందేశ్వరి బాధ్యతల స్వీకార కార్యక్రమాలను పర్యవేక్షణ ప్రారంభించారు. భారీ ర్యాలీగా విజయవాడ రాష్ట్ర కార్యలయానికి చేరుకుని ఉదయం 11 గంటలకి బాధ్యతలు పురందేశ్వరి బాధ్యతలు స్వీకరిస్తారని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

పురందేశ్వరికి బాధ్యతలు అప్పగించనున్న సోము వీర్రాజు

మూడేళ్లకుపైగా ఏపీ బీజేపీ అధ్యక్షునిగా సోము వీర్రాజు ఉన్నారు. పదవి కాలం ముగియడంతో.. పురందేశ్వరిని నియమించారు. మధ్యాహ్నం 12 గంటలకి కార్యకర్తలతో సమావేశంలో సోము వీర్రాజు పూర్తిస్ధాయి బాధ్యతలు అప్పగిస్తారు. పార్టీ సహ ఇన్ ఛార్జి సునీల్ ధియోధర్, సోము వీర్రాజు, మాజీ సిఎం‌కిరణ్ కుమార్ రెడ్డి, సత్యకుమార్, ఎంపి సిఎం రమేష్, జీవీఎల్ సహా కీలక నేతలంతా పాల్గొంటారు. వచ్చే ఎన్నికలలో పురందేశ్వరి నేతృత్వంలో బిజెపి ముందుకు వెళ్తుందని.. ఎపి ప్రజలు బిజెపి వైపే ఉంటారనే నమ్మకముందని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

16వ తేదీన బీజేపీ కీలక సమావేశం

పురందేశ్వరి నేతృత్వంలో వచ్చే ఆరు నెలల్లో భారీ స్థాయిలో కార్యాచరణ చేపట్టాలని బీజేపీ నిర్ణయించుకుంది. అందు కోసం ఈ నెల 16 న విజయవాడలో జిల్లా అద్యక్షులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహి్సతున్నారు. ..‌రాబోయే పది నెలల కార్యాచరణపై చర్చిస్తారు. ఈ సమావేశానికి ఎపి ఇన్ చార్జి మురళీధర్, శివప్రకాష్ జీ కూడా హాజరవబోతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. ఎవరూ ఊహించని రాజకీయ వ్యూహాలను ఖరారు చేయాలని బీజేపీ అనుకుంటోంది. పొత్తులు.. ఇతర అంశాలపై కేంద్ర పార్టీ ఆలోచనల మేరకు ఏపీ బీజేపీ ముందుకు వెళ్లనున్నారు. అధికార పార్టీ అక్రమాలపై పోరాడే విషయంలో .. ఇప్పటి వరకూ చూపిన స్ఫూర్తితోనే ముందుకు వెళ్లాలన్న సంకేతాలు హైకమాండ్ నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది.

యువ టీంకు కీలక బాధ్యతలు

ఏపీబీజేపీ లో ఇతర వ్యాపకాలేమీ పెట్టుకోకుండా.. కేవలం బీజేపీ కోసం పూర్తి స్థాయిలో కష్టపడే నేతలకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అధ్యక్షురాలిని కొత్తగా నియమించినందున.. సంస్థాగతంగా కూడా కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. గతంలో పార్టీ పదవులు పొందిన పని చేయని వారిని తప్పించి.. యువనేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని హైకమాండ్ సూచించినట్లుగా చెబుతున్నారు.