చంద్రుడ్ని చేరుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి సిద్ధమవుతోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి లోపాలు లేకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తోంది. వైఫల్యాలే గుణపాఠాలుగా ముందుకు సాగాలని భావిస్తోంది. కొన్ని దేశాలు చంద్రుడ్ని చేరుకున్నా.. అక్కడి వాతావరణ పరిస్థితులపై సరైన అవగాహనకు రాలేకపోయాయి. వారందరికంటే మెరుగ్గా చంద్రయాన్ – 3 ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో నడుం బిగించింది.
2008లో తొలి ప్రయోగం
చంద్రుడిలో ఏముందో తెలుసుకునేందుకు 1958 నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. అనేక వైఫల్యాల తర్వాత కొన్ని దేశాలు చంద్రుడిని చేరుకున్నాయి. మట్టీ రాళ్లూ ఏరి తెచ్చుకున్నా.. ఇంకా అన్వేషించాల్సింది ఎంతో ఉందనే భావనతో అంతరిక్ష ప్రయోగాలు చేపడుతూనే ఉన్నారు. మన దేశం 2008లో చంద్రయాన్ పేరుతో తొలి ప్రయోగం చేపట్టింది. తొలి ప్రయత్నంలోనే చంద్ర కక్ష్యలోకి సులువుగా ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. 2019 లో ఏకంగా చంద్రుడి మీదకే రోవర్‌ను దించడానికి ప్రయత్నించి, ఆఖరి క్షణంలో విఫలమైంది. చంద్రయాన్ -2 ప్రయోగంలో భాగంగా సాఫ్ట్ ల్యాండింగ్ కుదరలేదు. ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొనడంతో రోవర్ ఆశించిన పరిశోధనలు చేయలేకపోయింది.
దాదాపు నెల తర్వాత చంద్రుడిపైకి…
శ్రీహరికోట నుంచి జూలై 14 మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు చంద్రయాన్ -3 ప్రయోగం జరుగుతుంది. దాదాపు నెల తర్వాత చంద్రుడి కక్ష్యలోకి చేరుకుంటుంది. ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రగ్యాన్ బహుశా ఆగస్టు 23న చంద్రుడిపై దిగే అవకాశాలున్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 70 డిగ్రీల అక్షాంశంపైనే చంద్రుడి దక్షిణ ధృవంపై దిగుతాయి. చంద్రాయన్ – 2 వైఫల్యాన్ని విశ్లేషించుకుని ల్యాండర్‌ను సురక్షితంగా దించడానికి అనువైన పరికరాలను ఇస్రో ఈసారి ప్రయోగిస్తోంది. గంటకు 6,058 కిలోమీటర్ల వేగంతో ల్యాండర్ కిందికి జారుతుంది. ల్యాండర్‌లో అమర్చిన నాలుగు బుల్లి రాకెట్లు ఈ వేగాన్ని నియంత్రిస్తాయి. సెకన్‌కు 2 మైళ్ల వేగంతో ల్యాండర్ హెలికాప్టర్‌లా చంద్రుడిపై వాలుతుంది. ఆ తర్వాత రోవర్ బయటకు వస్తుంది. చంద్రుడిపై తిరుగుతూ 14 రోజుల పాటు పరిశోధనలు చేస్తుంది.
రిహార్సిల్ సక్సెస్ అయ్యిందంటున్న ఇస్రో
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో రెండు రోజుల క్రితం లాంఛ్ రిహార్సిల్ నిర్వహించారు. 24 గంటల పాటు జరిగిన ఆ రిహార్సిల్ విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. దీనితో సురక్షితమైన ల్యాండింగ్ ఖాయమని ఇస్రో చీఫ్ ఎస్ . సోమ్ నాథ్ అంటున్నారు. ప్రయోగాన్ని సక్సెస్ చేసేందుకు ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్ ను అమలు చేశామని ఆయన చెబుతున్నారు. అంటే ప్రయోగం ఆఖరి దశలో ఫెయిల్ అయ్యే ప్రమాదం ఏర్పడితే.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాన్ని సక్సెస్ చేసేందుకు అవసరమైన డిజైన్ ను రూపొందించారు. మరి 14న ఏం జరుగుతుందో చూడాలి…