తమిళనాడు తంజావూరులో ఎంతో ప్రాచీనమైన ఆలయాల్లో బృహదీశ్వర ఆలయం ఒకటి. యునెస్కోతో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన ఈ దేవాలయంలో అణవణువూ అంచుచిక్కని రహస్యాలే. అవేంటో చూద్దాం..
అత్యంత ప్రాచీన ఆలయాల్లో తంజావూరు బృహదీశ్వర ఆలయం ఒకటి. తంజావూరులో మొత్తం 74 దేవాలయాల్లో అత్యద్భుతమైనది శ్రీ బృహదేశ్వర ఆలయం. 11వ శతాబ్దంలో చోళులు నిర్మించిన ఈ ఆలయం మొత్తం గ్రానైట్ తో నిర్మించిన ప్రపంచంలోనే మొట్ట మొదటి శివాలయంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రధాన దైవం శివుడు అయినప్పటికీ ఆలయ గోడలపై సర్వ దేవతల విగ్రహాలు ఉంటాయి. అష్ట దిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాల్లో ఇదొకటి.
ఆలయ నిర్మాణంలో అణువణువూ అద్భుతాలే
వేయి సంవత్సరాల ఆలయాలు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి కానీ ఈ ఆలయం మాత్రం ఇప్పటికీ అత్యద్భుతంగా కొత్తగా నిర్మించినట్లు కనిపిస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయంగా ఈ ఆలయం గుర్తిస్తారు. భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయం ఇది 13 అంతస్థులతో నిర్మితమైన ఈ ఆలయ నిర్మాణానికి ఉక్కు, సిమెంట్ వాడలేదు. నిర్మాణం మొత్తం గ్రానైట్ రాయితోనే భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇది. శివలింగం ఎత్తు దాదాపుగా 3.7 మీటర్లు, నందీశ్వరుని విగ్రహం ఎత్తు 2.6 మీటర్లు, గోపుర కలశం 80 టన్నుల ఏకశిలతో నిర్మించారు.
నీడ పడని ఆలయం
ఈ ఆలయంలో మరో విశిష్టత ఏంటంటే మిట్ట మధ్యాహ్న సమయంలో ఈ ఆలయ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడినా ఆలయ గోపురం నీడ మాత్రం కనిపించదు. ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి. ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియని రహస్యంగానే ఉంది. ఈ ఆలయంలో ఉన్న నందీశ్వరుని విగ్రహం ఎత్తు 2.6 మీటర్లు. ఇక ఈ ఆలయ గోపుర కలశం 80 టన్నుల ఏకశిలతో నిర్మించడం ఈ ఆలయ విశేషం. ఎవరైనా భక్తులు ఆ ఆలయంలో మాట్లాడుకుంటే ఆ శబ్దాలు ఈ ఆలయంలో మళ్లీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఙానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు.
తమిళనాడులో ఆలయాల సందర్శనకు వెళ్లేవారు తప్పనిసరిగా చూడాల్సిన శైవక్షేత్రం ఇది…
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.