దక్షిణాదిన బీజేపీ మాస్టర్ ప్లాన్ – ఈ సారి పక్కాగా కమల వికాసమేనా ?

దక్షిణాది రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలోనే దక్షిణాదిలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికలు, పార్టీ బలోపేతం, విజయం సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు ఆరు గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ కీలక భేటీకి దక్షిణాది బీజేపీ ముఖ్యనేతలంతా హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ నుంచి పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులంతా హాజరయ్యారు.

ఉత్తరాది కంటే భిన్నమైన వ్యూహాలు రెడీ

ఉత్తరాది లో బీజేపీ ఘన విజయం సాధిస్తున్న వ్యూహాలను దక్షిణాదిలో ఇంప్లిమెంట్ చేస్తూండటంతో పెద్దగా ఫలితాలు రావడం లేదని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయానికి వచ్చింది. అందుకే దక్షిణాది కోసం ప్రత్యేక వ్యూహాలను ఖరారు చేసేందుకు హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఉత్తరాదిన బలంగా ఉన్న పార్టీ దక్షిణాదిన బలోపేతం కాకపోవడానికి గల కారణాలపై లోతుగా విశ్లేషించారు. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల అధ్యక్షులతో బీజేపీ బలోపేతం ఎందుకు ఆలస్యమవుతోందో కారణాలు అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన చర్యలపైనోట్ రెడీ చేసుకున్నారు.

రాష్ట్రానికో వ్యూహం ఖరారు చేయాలని నిర్ణయం

దక్షిణాది మొత్తం ఒకే పొలిటికల్ ప్లాన్ అమలు చేయడం సాధ్యం కాదని.. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో వ్యూహం అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి శాఖ అధ్యక్షుడి నుంచి స్పెషల్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. దాని ప్రకారం కేంద్ర పార్టీ నుంచి అందించాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని.. క్షేత్ర స్థాయిలో ప్రణాళికలు ్మలు చేయాలని నిర్దేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 9 ఏళ్ల చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని దిశా నిర్దేశం చేశారు. జాతీయ నాయకత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని నేతలకు స్పష్టం చేశారు.

దక్షిణాది రాష్ట్రాల్లో టార్గెట్ 170

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కనీసం 170 పార్లమెంట్ సీట్లు రావాలన్నది బీజేపీ లక్ష్యంగా తెలుస్తోంది. ఈ భేటీ పకడ్బందీగా జరిగింది. మీటింగ్‌తో సంబంధం లేని నాయకుల్ని గాని, మీడియాను గానీ పరిసరాల్లోకే రానివ్వలేదు. అమిత్ షా, మోదీ ఎంత స్పష్టమైన టార్గెట్ పెట్టుకున్నారో.. ఆ ప్రకారం ప్రణాళికలు అమలు చేయడానికి ఎంత సీరియస్ గా ఉన్నారో.. ఈ భేటీనే ఓ నిదర్శనమని అంటున్నారు. ముందు ముందు దక్షిణాది రాష్ట్రాల్లో అనూహ్యమైన రాజకీయ మార్పులు చోటు చేసుకోబోతున్నట్లుగా చెబుతున్నారు.