బాలాసోర్ ప్రమాదం – నిందితులపై సీబీఐ కొరడా….

దాదాపు 300 మంది చనిపోయిన బాలాసోర్ రైలు ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. రైల్వే చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ప్రమాదంపై అనుమానాలు కొనసాగుతుండగా.. దానిపై సీబీఐ విచారణ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సిగ్నలింగ్ వ్యవస్థ, అందులో పనిచేస్తున్న అధికారుల తీరు వల్లే మూడు రైళ్లు ఏకకాలంలో ఢీకొన్నాయని సీబీఐతో పాటు రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణలో వెల్లడైంది.

సాక్ష్యాలు చెరిపేసేందుకు ప్రయత్నించారా…

సీబీఐ రంగంలోకి దిగినప్పటి నుంచి విచారణ వేగవంతమైంది. లోతైన విచారణ తర్వాత సీబీఐ ముగ్గురు సీనియర్ అధికారులను అదుపులోకి తీసుకుంది. సీనియర్ సెక్షన్ ఇంజనీర్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజనీర్ మొహ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్ అరెస్టయ్యారు. వారిపై సెక్షన్ 304 , సెక్షన్ 201 కింద కేసులు పెట్టింది. అందులో 201 అనేది సాక్ష్యాలను చేరిపేసేందుకు ప్రయత్నించినప్పుడు పెట్టే కేసు. ఉన్నతాధికారులకు, ప్రజలకు తప్పుడు సమాచారం అందించి తప్పించుకునేందుకు ఆ ముగ్గురు ప్రయత్నించారని కూడా సీబీఐ గుర్తించింది. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మసిపూసి మారేడు కాయ చేయాలన్న సంకల్పం కనిపించింది.
సిగ్నల్స్ నిర్వహణలో తప్పులు చేశారని, ఏదో కుట్ర జరిగిందని భావిస్తూ సీబీఐ విచారణ కొనసాగుతోంది.

లొకేషన్ బాక్స్ లో లేబులింగ్ లోపం…

సంవత్సరాలుగా కొనసాగుతున్న నిర్లక్ష్యం, జరుగుతున్న తప్పులను తెలుసుకోలేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని సీబీఐ ప్రాథమికంగా గుర్తించింది. లెవెల్ క్రాసింగ్ లొకేషన్ బాక్స్ లో వైర్లు తప్పుగా కనెక్ట్ చేస్తూ ఏళ్ల తరబడి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. నిర్వహణ పనులలో అది గందరగోళానికి దారి తీయడం వల్లే జూన్ 2 రాత్రి ప్రమాదం జరిగిందని గుర్తించారు. కోరమాండర్ ఎక్స్ ప్రెస్ వచ్చి బెంగాల్ హౌరా సూపర్ ఫాస్ట్ ను, ఒక గూడ్స్ రైలును ఢీకొట్టింది. పైగా అరెస్టయిన వారిలో మహంత అనే అధికారి…సీబీఐని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థ కారణం కాదని వాదించారు. గతంలో లోకేషన్ బాక్సులకు సంబంధించి పొరపాట్లను ఆయన దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, అందుకు ఈ ప్రమాదేం జరిగిందని గుర్తించారు.

వైరింగ్ మార్చెయ్యడం వల్లే లూప్ లైన్ లోకి ఎంట్రీ..

కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ జరిపిన విచారణలో కూడా సీబీఐ కనిపెట్టిన అంశాలే బయటపడ్డాయి. లోకేషన్ బాక్స్ లో ప్రతీ వైరుకు ఒక లేబులింగ్ ఉండాల్సిన తరుణంలో ఆ పనిలో బాధ్యులైన ముగ్గురు అధికారులు పొరపాట్లు చేశారని గుర్తించారు. దానితో సిగ్నలింగ్ లోపాలు తలెత్తి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్లోకి ప్రవేశించి అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొంది. లెవెల్ క్రాసింగ్ లో లొకేషన్ బాక్స్ రీవైరింగ్ పనులను పర్యవేక్షిస్తున్న ఆ ముగ్గురు అధికారులు పొరపాటు చేస్తున్నామన్న సంగతిని కూడా గుర్తించలేకపోయారన్నది ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశం…