ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొత్త ఉత్సాహంతో ముందుకెళ్లేందుకు రంగం సిద్దమయింది. కొత్త అధ్యక్షురాలిగా నియమితులైన దగ్గుబాటి పురందేశ్వరి పదమూడో తేదీన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇప్పటి వరకూ ఆమె బీజేపీ ఏపీ అధ్యక్షురాలి హోదాలో మీడియాతో మాట్లాడలేదు. బాధ్యతలు చేపట్టిన తర్వాతే మాట్లాడాలనుకుంటున్నారు. పదమూడో తేదీన విజయవాడకు రానున్న పురందేశ్వరికి పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. బాధ్యతల స్వీకరణ తర్వాత పురందేశ్వరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.
ఏపీపై బీజేపీ హైకమాండ్ ప్రత్యేక శ్రద్ధ
ఆంధ్రప్రదేశ్ బీజేపీ విషయంలో హైకమాండ్ ప్రత్యేకమైన శ్రద్ధతో ఉంది. పార్టీపై ఇతర ప్రాంతీయ పార్టీల ముద్ర లేకుండా బలోపేతం చేయాలనుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఏపీలో ఎవరిని బీజేపీ అధ్యక్షులుగా నియమించిన కొన్ని పార్టీల సేవకు అంకితమైన మీడియా.. ఆ నియామాన్ని ఓ పార్టీకి అంటగట్టేసేవి. ఆ పార్టీకి వ్యతిరేకం లేదా సహకరించడానికి బీజేపీ అధ్యక్షుడ్ని మార్చారని ప్రజల్లో ఓ అభిప్రాయం బలపడేలా చేసేవారు. అయితే పురందేశ్వరి నియామకం తర్వాత అలాంటి ముద్ర వేయడానికి మీడియా కూడా సాహసం చేయలేకపోయింది.
యువ టీంను ఏర్పాటు చేసే అవకాశం
ఈ సారి ఏపీ బీజేపీ లో యువ నేతలు.. చురుగ్గా రాష్ట్రం మొత్తం పర్యటించే నేతలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వ్యాపారాలు చేసుకుంటూ పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేసే వారిని కాకుండా.. పూర్తిగా పార్టీకే అంకితమైన వారికి ఈ సారి కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లుగా తెలుస్తోంది. విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్ లతో పాటు పలువురు యువనేతలు ఈ సారి పార్టీలో మరింత కీలకంగా వ్యవహరించేలా హైకమాండ్ మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్లగా చెబుతున్నారు. ఏపీలో పార్టీ వ్యూహాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన హైకమాండ్ ఇప్పటికే బ్లూప్రింట్ రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్న కొత్త అధ్యక్షురాలు
బాధ్యతలు చేపట్టిన తర్వాత పురందేశ్వరి జిల్లాలు పర్యటించనున్నారు. పార్టీ నేత ల మధ్య ఏమైనా విబేధాలుంటే పరిష్కారం చేయడం… కొత్త నేతల్ని చేర్చుకోవడం.. పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేయడం వంటి కార్యాచరణ ప్రారంభించనున్నారు. మొత్తంగా ఏపీ బీజేపీ ఎన్నికలసన్నాహాల్ని ఓ రేంజ్ లో చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది