భగవద్గీత హిందువుల పవిత్ర గ్రంథాలలో ఒకటి. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశమే భగవద్గీత. గీతలోని బోధనలు నేటికీ అనుసరణీయమే. శ్రీమద్భగవద్గీతలో శ్రీ కృష్ణుడు విజయాన్ని సాధించడానికి అనేక మార్గాలను సూచించాడు. అందులో అత్యంత ముఖ్యమైనవి ఐదు. ఈ ఐదు లక్షణాలు ఉంటే విజయం వరించకతప్పదు, అపజయం పారిపోక తప్పదని అర్జునుడికి బోధించాడు.
మనసుపై నియంత్రణ అవసరం
ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ముందుగా మనసుపై నియంత్రణ ఉండాలని సూచించాడు శ్రీ కృష్ణుడు. పని చేస్తున్నప్పుడు, మీ మనసు ఎల్లప్పుడూ ప్రశాంతంగా, స్థిరంగా ఉండాలి. కోపం తెలివిని నాశనం చేస్తుంది, అంతే కాకుండా అది చేసిన పనిని పాడు చేస్తుంది. కాబట్టి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.
ప్రతిఫలాన్ని ఆశించకండి
శ్రీమద్భగవద్గీత ప్రకారం, ప్రతిఫలాన్ని ఆశించకుండా పని చేసేవాడు తన పనిలో తప్పకుండా విజయం సాధిస్తాడు. మీరు తలపెట్టిన పనులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినప్పుడే విజయం సాధిస్తారు. చేయాల్సిన పనులపై మనసు పూర్తిగా లగ్నం చేయకుండా ఇతర ఆలోచనలతో ఉండేవారు తమ లక్ష్యాలను ఎప్పటికీ సాధించలేరు.
మిమ్మల్ని మీరు నమ్మండి
భగవద్గీత ప్రకారం, ఒక వ్యక్తి తన చర్యలను ఎప్పుడూ అనుమానించకూడదు. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి తనను తాను నాశనం చేసుకుంటాడు. కాబట్టి, మీరు విజయం సాధించాలనుకుంటే మీరు ఏం చేసినా ఎలాంటి సందేహాలు లేకుండా పూర్తి విశ్వాసంతో పూర్తి చేయండి, అప్పుడే మీరు విజయపథంలో ముందుకు సాగుతారు.
మితిమీరిన అనుబంధం
భగవద్గీత ప్రకారం ఒక మనిషి ఏ ఒక్కరితోనూ అతిగా అనుబంధం పెంచుకోకూడదు. ఈ అనుబంధమే మనిషి కష్టాలకు, వైఫల్యాలకు దారి తీస్తుంది. మితిమీరిన అనుబంధం ఒక వ్యక్తిలో కోపం, విచారం అనే భావాలను సృష్టిస్తుంది. ఈ కారణంగా, వారు తమ పనిపై మనసును, దృష్టిని కేంద్రీకరించలేరు. అందుకే మనిషి మితిమీరిన అనుబంధానికి దూరంగా ఉండాలి.
భయాన్ని వీడండి
ఏదైనా పనిలో విజయం సాధించాలంటే ముందుగా మనలోని భయాన్ని పోగొట్టుకోవాలి. ఈ పాఠాన్ని చెబుతూ, శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధంలో నిర్భయంగా పోరాడమని చెప్పాడు. ఓ అర్జునా… యుద్ధంలో మరణిస్తే స్వర్గం, గెలిస్తే రాజ్యం లభిస్తుందని కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు గీత బోధించాడు. కాబట్టి మీ మనసులోని భయాన్ని వదిలించుకోండి.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.