బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై డైరక్ట్ ఎటాక్ – తెలంగాణలో బీజేపీ రూట్ మ్యాపేమిటో తేల్చేసిన ప్రధాని మోదీ !

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ …బీఆర్ఎస్‌తో అవగాహన కుదుర్చుకుందని ప్రచారం చేస్తున్న వారికి దిమ్మ తిరిగేలా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇక ఆశలు వదిలేసుకోవాలని ప్రధాని మోదీ వరంగల్ గడ్డపై నుంచి హెచ్చరికలు జారీ చేశారు. బీఆర్ఎస్ విషయంలో బజేపీ ఎంత కఠినంగా ఉండబోతోందో నేరుగా చెప్పారు. ఊపు తెచ్చుకుంటున్నామనుకున్న కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని కూడా మోదీ మాటల్లో స్పష్టమయింది. గ్రేటర్ ఎన్నికల్లో ట్రైలర్ చూపించామని వచ్చే ఎన్నికల్లో సినిమా చూపిస్తామని ప్రకటించారు.

కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు సంస్థల దృష్టి

కేసీఆర్ కుటుంబ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. వరంగల్ లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడిన మోదీ..
తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రోజూ నాలుగు పనులే చేస్తోందన్నారు మోదీ. ఉదయం నుంచి సాయంత్రం వరకు మోదీని తిట్టడం మొదటి పని అయితే… కుటుంబ పార్టీని పెంచి పోషించడం రెండో పనిగా చెప్పారు మోదీ. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం మూడో పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. నాల్గో పనిగా తెలంగాణను అవినీతిలో కూరుకుపోయేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంనూ ప్రస్తావించిన మోదీ

గతంలో రెండు రాష్ట్రాల మధ్య అభివృద్ధి కోసం ఒప్పందాలు జరిగేవి అన్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య అవినీతి ఒప్పందాలు జరుగుతున్నాయని ఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. ఇక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోందన్నారు మోదీ. అవన్నీ ఇప్పుడు బహిర్గతమయ్యాయని గుర్తు చేశారు. కుటుంబ పార్టీల పాలనలో తెలంగాణ కూరుకుపోతుందని ఏనాడు అనుకోలేదన్నారు మోదీ. కుటుంబ పార్టీల డీఎన్‌ఏ మొత్తం అవినీతి మయమే అన్నారు. జనాల నమ్మకాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వమ్ముచేసిందన్నారు. 9 ఏళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న మోదీ

. దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర అని కొనియాడారు. ఆర్థిక వృద్ధిలోనూ తెలంగాణ ముందుందన్నారు. దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారిందన్నారు. తెలంగాణలో రూ.6 వేల కోట్లతో నేషనల్ హైవేలు నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ ఆర్థిక హబ్‌గా మారుతోందని మోదీ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు వస్తున్నాయన్నారు. తెలంగాణలో రూ.6 వేల కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.తెలంగాణలో రైల్వే ట్రాక్‌ల కనెక్టివిటీని పెంచుతున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ ట్రైలర్‌ చూపించింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను అడ్రస్‌ లేకుండా చేస్తాం. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. తెలంగాణలో కుటుంబ పార్టీలు అవినీతికి కొమ్ముకాస్తున్నాయి. కేసీఆర్‌ సర్కార్‌ అవినీతిని పెంచి పోషిస్తోంది. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్‌దే. 9 ఏళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి? యువత, ప్రజలను కేసీఆర్‌ ప్రభుత్వం మోసం చేసింది. అవినీతి లేకుండా తెలంగాణలో ఏ పని జరగట్లేదు’’ అని మండిపడ్డారు. .

తెలంగాణలో అధికారమే లక్ష్యమని తేల్చిన మోదీ !

ఇటీవలి కాలంలో మారిన రాజకీయాలతో.. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న ప్రచారం ఉద్దృతంగా సాగుతోంది. దీనికి చెక్ పెట్టేలా ప్రధాని మోదీ.. ఘాటుగా హెచ్చరికలు చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయని హెచ్చరించడం.. ఢిల్లీ లిక్కర్ స్కాంను కూడా ప్రస్తావించం ఆసక్తికరంగా మారింది. తాము బీఆర్ఎస్ ట్రాప్ లో పడటానికి సిద్దంగా లేమని.. తామేంటో చూపిస్తామని.. బీజేపీ నేతలంటున్నారు.