యూనిఫాం సివిల్ కోడ్‌కు పెరుగుతున్న మద్దతు – మెల్లగా ప్రజల్లోకి వెళ్తున్న నిజాలు !

దేశ ప్రజలందరూ సమానమే. అందరికీ ఒకటే చట్టం అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు.కానీ ఇప్పటికే ఒకే చట్టం లేదనే నిజాన్ని మాత్రం అంగీకరించలేకపోతున్నారు. ఇప్పుడు కేంద్రం ప్రజలందరికీ ఒకే చట్టంఅమలు చేసేందుకు యూనిపాం సివిల్ కోడ్ ను తెస్తోంది. దీని చుట్టూ రాజకీయం చేసేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ తెచ్చింది కాబట్టి వ్యతిరేకించాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇందులో నిజాలు మాత్రం మెల్లగా బయటకు వస్తున్నాయి. ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇది మంచిదే కదా అన్న అభిప్రాయం అంతంకతూ పెరుగుతోంది.

బీజేపీ మూల సిద్ధాంతాల్లో ఒకటి యూనిఫాం సివిల్ కోడ్

ఉమ్మడి పౌరస్మృతి (యూసిసి)ని తీసుకురావాలనేది బీజేపీ మూల సిద్ధాంతాల్లో ఒకటి. అయితే ఇది అంత సులభమేమీ కాదు. ఎందుకంటే మన దేశం వివిధ మతాలు, జాతుల సమ్మేళనం. ఎవరి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, సంస్కృతులు వారివి. మతాచారాల ప్రకారమే చట్టాలను రూపొందించారు. కులం, మతం, జాతి వేరైనా అందరికీ ఒకే చట్టం. భారత రాజ్యాంగం కుల మతాలకు అతీతంగా ప్రతి పౌరుడికీ సమానత్వపు హక్కుకు, న్యాయం పొందే హక్కుకు, జీవించే హక్కుకు హామీ ఇచ్చింది. వివిధ మతాల వారికి ప్రస్తుతం అమలులో ఉన్న వేర్వేరు చట్టాలను విశ్లేషించి, ఆ తర్వాతే యూసీసీ ముసాయిదాను రూపొందిస్తోంది.

మతాల వారీగా చట్టాలతో ప్రజలు అన్యాయం

మతాల వారికి ఉద్దేశించిన చట్టాలలో వైరుధ్యాలు ఉన్నాయి. తండ్రి తన ఆస్తుల పంపకానికి సంబంధించి వీలునామా ఏదీ రాయకపోతే ఆస్తి ఎవరికి చెందుతుంది ? హిందూ చట్టం ప్రకారం కుమారుడి కొడుకుకే చెందుతుంది. కుమార్తె కొడుకుకి ఏమీ రాదు. అదే తండ్రి పార్సీయో, క్రైస్తవుడో అయితే ఆయన ఆస్తి ఇద్దరు మనుమలకూ సమానంగా లభిస్తుంది. ముస్లింలకు సంబంధించిన చట్టంలో రెండు రకాల వారసులు ఉంటారు. వీలునామా రాయకుండా చనిపోయిన వ్యక్తి ఆస్తిని చట్టబద్ధమైన వారసులందరికీ సమానంగా పంచడం ఒక పద్ధతి. రెండో పద్ధతిలో వారసులందరూ ఆస్తిని పంచుకున్న తర్వాత మిగిలిన ఆస్తిని సంబంధీకులెవరైనా ఉంటే వారికి ఇస్తారు. అయితే చాలా రాష్ట్రాలు హిందూ వివాహ చట్టంలో మార్పులు చేసి మహిళలకూ ఆస్తి హక్కు ఇచ్చారు. కానీ అన్ని చోట్లా ఇది లేదు. ప్రస్తుత చట్టాల ప్రకారం వారసుడెవరనేది మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఇది సంక్లిష్టమైన ప్రక్రియగా మారుతోంది.

అనేక చట్టాలతో సంక్లిష్టం

ఒక్కో సందర్భంలో ఒక్కో మతానికి చెందిన చట్టం మేలైనదిగా అనిపిస్తుంది. మత ప్రాతిపదికన రూపొందించిన చట్టాలు జటిలమైనవి, సంక్లిష్టమైనవి. వారసత్వానికి సంబంధించి వీటి మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల విషయంలోనే కాదు… దత్తత, వివాహం, విడాకుల విషయంలో కూడా ఈ చట్టాలు పరస్పర విరుద్ధంగా, జటలంగానే ఉన్నాయి. దీనికి కారణమేమిటి ? మన దేశంలో అన్ని రకాల సంప్రదాయాలనూ పాటిస్తారు. వీటిని క్రోడీకరిస్తే నిబంధనలన్నీ పీటముడులతో కూడి ఉంటాయి. మినహాయింపులూ ఉంటాయి. ఈ చిక్కుముడులను విడదీసి, ఒకేలా ముడివేస్తే అదే యూసీసీ అవుతుంది. ఇందు కోసమే కేంద్రం పని చేస్తోంది. మతాలకు అతీతంగా సమానమైన హక్కులు కల్పించాలన్నదే కేంద్రం లక్ష్యం.

గుడ్డిగా వ్యతిరేకించడం ఎందుకు.. మంచిని స్వాగతించవచ్చుగా ?

ఒక మతానికి సంబంధించిన నిబంధనలు మరో మతానికి వర్తించవు. మహిళకు సంబంధించిన ఉదాహరణనే తీసుకుందాం. వివాహిత మహిళ ఆస్తిలో వాటా విషయంలో క్రైస్తవులు, హిందువులు తల్లిదండ్రులను పరిగణనలోకి తీసుకోరు. పార్సీ, ముస్లిం మహిళలు అయితే తల్లిదండ్రులు కూడా ఆమె ఆస్తిలో వారసులు అవుతారు. మరి ఎవరి సంప్రదాయాన్ని అనుసరించాలి? ఏది ఉత్తమం? ఎవరి సంప్రదాయాన్ని పాటించినా మరొకరి హక్కుకు భంగం కలుగుతుంది. సమానత్వం, న్యాయం, జీవనం వంటి విషయాలలో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విఘాతం ఏర్పడుతుంది. ఓ పెద్ద మనిషి చెప్పినట్లు ‘యుసీసీ అంటే అందరికీ ఒకే చట్టం. అయితే అది లింగ సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ఏకరీతి సూత్రాలపై ఆధారపడిన వ్యక్తిగత చట్టాల సమాహారం’.

ఇదే అంశాన్ని పట్టించుకోకుండా బీజేపీ తెస్తోంది కాబట్టి వ్యతిరేకిస్తామన్నట్లుగా పార్టీలు ఉన్నాయి. కానీ ప్రజలలో జరుగుతున్న చర్చల ప్రకారం… యూనిఫాం సివిల్ కోడ్‌కు ప్రజల మద్దతు పెరుగుతోంది. ఇంకా చర్చ జరిగితే విపక్ష పార్టీల రాజకీయం ప్రజలకు అర్థమవుతుంది.