ప్లీజ్ మళ్లీ కలుపుకోండి – బీజేపీని బతిమాలుతున్న మరో పాత మిత్రపక్షం !

బీజేపీతో విడిపోతే ఏం జరుగుతుందో ప్రాంతీయ పార్టీలకు చాలా వరకూ అర్థం అవుతోంది. మొత్తం నిర్వీర్యం అయిపోయిన తర్వాత మళ్లీ కలుపుకోండి మహా ప్రభూ అని బీజేపీ దగ్గరకు కాళ్ల బేరానికి వస్తున్నాయి. తాజాగా మరో మిత్రపక్ష పార్టీ అదే దారిలో ఉంది. అదే శిరోమణి అకాలీదళ్

బీజేపీతో స్నేహం కోసం ఆరాటపడుతున్న శిరోమణి అకాలీదళ్

పంజాబ్‌ లో 2024 సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తుండటంతో అక్కడి ప్రాంతీయ పార్టీ శిరోమణి అకాలీదళ్ బీజేపీ అండ కోసం చూస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి అకాలీదళ్ గుడ్ బై చెప్పింది. అప్పుడు వ్యవసాయ చట్టాలను సాకుగా చూపించారు. తిరిగి పంజాబ్‌లో ఉనికి నిలుపుకునేందుకు బీజేపీ సాయం అవసరం అని.. అకాలీ దళ్ కు అర్థమయింది. లోక్‌సభ ఎన్నికల కోసం మళ్లీ మూడోసారి బీజేపీతో కలిసి పనిచేయాలని అకాలీదళ్‌ కోరుకుంటోంది. ఇందుకోసం శిరోమణి అకాలీదళ్ మంతనాలు సాగిస్తోంది. పంజాబ్‌లో సీట్ల షేరింగ్ ఆధారంగా పొత్తుకు మంతనాలు సాగిస్తోంది.

వ్యవసాయ చట్టాల పేరుతో బీజేపీకిదూరం

కేంద్ర తీసుకువచ్చిన సాగుచట్టాల సమయంలో రైతులు తీవ్ర నిరసనల మధ్య బీజేపీతో పొత్తును శిరోమణి అకాలీదళ్ అప్పట్లో ఉపసంహరించుకుంది. ఆ తర్వాత సాగుచట్టాలను కేంద్రం ఉపసంహరించుకున్నప్పటికీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పంజాబ్‌లో ఓటమి చవిచూసింది. అయితే బీజేపీ ఎప్పుడూ ఆ పార్టీని శత్రువుగా చూడలేదు. దివంగత ప్రకాష్ సింగ్ బాదల్‌‌‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇటీవల ఘనంగా నివాళులర్పిస్తూ ఆయనను సౌభ్రాతృత్వానికి అధిపతిగా అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఏప్రిల్ 26న ఛండీగఢ్ వెళ్లి బాదల్‌కు నివాళులర్పించారు. దీంతో అకాలీదళ్ బీజేపీతో పొత్తుకు రెడీ అయినట్లు అయింది.

పడిపోతున్న అకాలీదళ్ గ్రాఫ్…

‘శిరోమణి అకాలీ దళ్ ‘ రాజకీయ గ్రాఫ్ బీజేపీతో విడిపోయినప్పటి నుండి కిందకు పడిపోతోంది. పంజాబ్‌లో ప్రధాన విపక్ష పార్టీగా చోటు కూడా దక్కించుకోలేకపోతోంది. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించగా, సాద్ మూడో స్థానానికి పరిమితమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ విపక్షంలోకి వచ్చింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సాద్ కేవలం 3 స్థానాలకే పరిమితమైంది. ప్రస్తుతం పంజాబ్‌లో సాద్‌కు రెండు పార్లమెంటరీ సీట్లు మాత్రమే ఉన్నాయి. సుఖ్‌బీర్ బాదల్, ఆయన భార్య హర్‌సిమ్రత్ కౌర్ బాదల్‌ మాత్రమే ఎంపీలుగా ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హవాతో ఎక్కువ సీట్లు గెల్చుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే బీజేపీతో జట్టు కట్టేందుకు రెడీ అవుతున్నారు.