కైలాస దేశ ప్రధానిగా రంజిత – ఆమె పేరు ఇప్పుడు ‘నిత్యానందమయి స్వామి’

అత్యాచారం ఆరోపణలతో దేశం నుంచి పారిపోయి ఈక్వెడార్ సమీపంలో ఓ దీవిను కొనుక్కుని కైలాస దేశంగా ప్రకటించుకున్న నిత్యానంద స్వామి .. ఆ దేశానికి మాజీ సినీ నటి రంజితను ప్రధానిగా ప్రకటించినట్లుగా తెలుస్తోంది. తాను సృష్టించుకున్న ‘కైలాస దేశ’ దీవికి తన ప్రియ శిష్యురాలైన మాజీ నటి రంజితను ప్రధానిగా ప్రకటించుకున్నట్లు తమిళ మీడియా ప్రకటించింది. ఈ మేరకు నిత్యానంద వెబ్‌సైట్‌లోనూ ప్రకటించారని పేర్కొనడం కలకలం రేపుతోంది. ఆ వెబ్‌సైట్‌లో రంజిత చిత్రం దిగువన ‘నిత్యానందమయి స్వామి’ అనే పేరుందని, దాని దిగువనే హిందువుల కోసమే ఏర్పాటైన కైలాసదేశ ప్రధానిగా పేర్కొని ఉంది.

ఐక్యరాజ్య సమితి సమావేశంలోనూ కనిపించి కలకలం రేపిన నిత్యానంద శిష్యులు

ఫిబ్రవరి 24న జెనీవాలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ సుస్థిర అభివృద్ధి అనే అంశంపై బహిరంగ చర్చా వేదిక నిర్వహించింది. యునైటెడ్ స్టేట్ ఆఫ్ కైలాస ప్రతినిధుల పేరుతో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారు. వారిలో విజయప్రియ నిత్యానంద అనే మహిళ తనని తాను పరిచయం చేసుకుంటూ కైలాస దేశ ప్రతినిధిగా పేర్కొన్నారు. దీంతో ఐక్యరాజ్య సమితి కైలాస దేశాన్ని అధికారికంగా గుర్తించిందా? అన్న సందేహం అందరిలోనూ వ్యక్తమైంది.

కైలాసను గుర్తించలేదన్న ఐక్యరాజ్య సమితి

ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ప్రసంగించామని ప్రకటించుకున్న కైలాస దేశ ప్రతినిధులకు ఐరాస షాకిచ్చింది. ఐరాస సాధారణ సమావేశాల్లో ఎవరైనా పాల్గోవచ్చని, రాతపూర్వకంగా తమ అభిప్రాయం చెప్పొచ్చని పేర్కొంది. దీనివల్ల వేర్వేరు వ్యక్తుల వ్యక్తిగత, లేదంటే వివిధ సంఘాల ప్రతినిధుల అభిప్రాయం తెలుసుకునే అవకాశం లభిస్తుందని పేర్కొంది. ఐరాస చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి రూపొందించే ప్రణాళికల్లో వాటిని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుందని, అంతమాత్రాన కైలాస దేశాన్ని గుర్తించినట్లు కాదని తెలిపింది.

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస

స్వామి నిత్యానంద ఓ దీవి కొనుగోలు చేసి దానికి “United States of Kailasa” అనే పేరు పెట్టుకోవడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. రెండేళ్ల క్రితమే ఈ పేరు పెట్టారు ఆయన. ఇప్పుడా దీవికి నిత్యానంద దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేసింది. తమ దేశం చాలా చోట్ల ఎంబసీలను ఏర్పాటు చేసిందని, 150 దేశాల్లో ఎన్‌జీవోలనూ స్థాపించిందని కైలాస దేశ ప్రతినిధులు చెబుతున్నారు. నిత్యానంద ఆ దీవికి ప్రత్యేకంగా కరెన్సీ కూడా ప్రారంభించారు. అంతేకాదు, ఆ కైలాస దీవిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐరాసలోనూ విజ్ఞప్తి చేశాడు. అయితే ఈక్వెడార్ మాత్రం ఈ వార్తలను ఖండించింది. అయితే కొన్ని నెలల క్రితం నిత్యానంద స్వామి చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్త‌ల‌తో ఖంగుతిన్న నిత్యానంద స్వామి …త‌న మ‌ర‌ణంపై సాగుతున్న ప్ర‌చారాన్ని కొట్టి పారేశారు. ఇప్పుడు రంజితను ప్రధానిని చేశారు.