పార్టీలో చీలిక భయం – మళ్లీ బీజేపీ వైపు అడుగులేస్తున్న బీహార్ సీఎం !

బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష కూటమిని రెడీ చేస్తానని సమావేశాలు పెట్టిన నితీష్ కుమార్ చివరికి తన పార్టీ ఉంటుందో ఊడుతుందోనన్న భయంతో బీజేపీ వైపు అడుగులేస్తున్నట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. బీజేపీతో విడిపోయి ఆర్జేడీతో జట్టు కట్టడంపై ఆయన పార్టీలో చాలా అసంతృప్తి ఉంది. ఇప్పుడు వారంతా విడిపోయి.. మహారాష్ట్ర తరహాలో బీజేపీతో జట్టు కట్టాలని ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన నితీష్ చీలికను నివారించడానికి బీజేపీతో సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారు.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ద్వారా మంతనాలు

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవల రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ , జనతాదళ్ (యునైటెడ్) ఎంపీ హరివంశ్‌తో పాట్నాలో సమావేశమయ్యారు, ఇరువురు నేతల మధ్య దాదాపు గంటన్నరపాటు భేటీ జరిగింది. జేడీయూ ఎంపీ హరివంశ్ బీజేపీ నుంచి తమ పార్టీ విడిపోవాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అందుకే ఆయనను నితీష్ దూరం పెట్టారు. గత ఏడాది ఆగస్టులో బీజేపీతో పొత్తు నుంచి వైదొలిగి, ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత హరివంశ్‌ను నితీష్ కుమార్ కలవలేదు. మళ్లీ ఇప్పుడే కలిశారు. హరివంశ్ ఇప్పుడు బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఆయన ద్వారా మళ్లీ బీజేపీతో దగ్గరయ్యేందుకు నితీష్ ప్రయత్నాలు ప్రారంభిచారు.

నితీష్ పార్టీలో ఎన్సీపీ తరహా చీలిక

జెడి(యు)లో ఎన్‌సిపి తరహా చీలిక కూడా వచ్చే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్న తరుణంలో హరివంశ్‌తో కుమార్ భేటీ కావడం విశేషం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బీహార్ సీఎం గత ఐదు రోజులుగా తన పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు మరియు ఎంపీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. హరివంశ్‌తో ఆయన భేటీ, అతను JD(U)లో చీలిక గురించి భయపడుతున్నాడా లేదా RJDతో పొత్తుపై పార్టీలోని అసంతృప్తిని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడా అనేది చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్, ఆర్జేడీతో పొత్తులపై జేడీయూలో వ్యతిరేకత

మహారాష్ట్రలో ఎన్సీపీ చీలిక తర్వాత బీహార్‌లో జేడీయూ విడిపోతుందని పలువురు నేతలు జోస్యం చెప్పారు. ఈ వారం ప్రారంభంలో, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ నితీష్ కుమార్ తన పదవీకాలాన్ని పూర్తి చేయలేరని.. బీహార్‌లో త్వరలో మధ్యంతర ఎన్నికలు జరగవచ్చని జోస్యం చెప్పారు. నితీష్ కుమార్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నేతలు తనతో టచ్‌లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో జెడి(యు) 10 సీట్లు కూడా గెలవదని ఆయన అన్నారు. జెడి(యు)లో త్వరలో చీలిక వచ్చే అవకాశం ఉందని, అలాంటి విభజన భయంతోనే నితీష్ కుమార్ తన శాసనసభ్యులతో విడివిడిగా చర్చలు జరుపుతున్నారని బిజెపికి చెందిన సుశీల్ మోడీ సంచలన ప్రకటన చేశారు.

ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలకు నితీష్ బుజ్జగింపులు

నితీష్ కుమార్ పట్ల కొంతమంది జెడి(యు) ఎమ్మెల్యేలు కలత చెందడంతో త్వరలో బీహార్‌లో మహారాష్ట్ర తరహా పరిస్థితి తలెత్తుతుందని బిజెపి మిత్రపక్షం, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అన్నారు.బీహార్ సిఎం ఎంపికలను అన్వేషిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, నితీష్ కుమార్ కోసం బిజెపి తలుపులు మూసుకుపోయాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను తిరిగి ఎన్‌డిఎలోకి తీసుకోరని సుశీల్ మోడీ చెబుతున్నారు. మొత్తంగా బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలనుకున్న నితీష్ పరిస్థితే దారుణంగా మారింది.