ఆలయాల సందర్శించుకోవడం అక్కడ విశిష్టతలు తెలుసుకోవడం చాలామంది భక్తులకు ప్రత్యేక ఆసక్తి. అందుకోసం ప్రత్యేక సమయం కేటాయించాలనే ఉద్దేశంతోనే బాధ్యతలన్నీ తీరిన తర్వాత పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. అయితే జీవిత కాలంలో తప్పనిసరిగా సందర్శించుకోవాల్సిన ఏడు క్షేత్రాలున్నాయి. వాటినే సప్తమోక్షదాయక క్షేత్రాలు అంటారు. వీటిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని పండితులు చెబుతారు.
“అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ
అవంతికాపురీ, ద్వారావతీ చైవ సప్తైతే మోక్షదాయికా”
ఈ 7 సప్తమోక్షదాయక క్షేత్రాలు అంటారు
- అయోధ్య
మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన ప్రాంతం అయోధ్య. ఉత్తర ప్రదేశ్ ఫైజాబాద్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి రామజన్మ భూమి అని ప్రసిద్ధి. రామాయణ కాలం కన్నా ముందే సాకేత పురం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. స్కంధ పురాణంలో అయోధ్యను ఏడు పవిత్ర నగరాల్లో ఒకటిగా పేర్కొన్నారు. అధర్వణ వేదంలో కూడా అయోధ్యను సాక్షాత్తు ఆ భగవంతుడు నిర్మించిన నగరంగా పేర్కొన్నారు. దేవుడు నిర్మించిన నగరం కాబట్టి ధార్మికంగా ఈ నగరం అత్యంత ప్రాధాన్యత కలిగిఉందని భక్తుల విశ్వాసం. - ద్వారక
శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన శ్రీ కృష్ణుడు మధురను విడిచి దాదాపు వందేళ్లు నివశించిన ప్రాంతం ద్వారక అని చెబుతారు. గుజరాత్ గోమతి నదీ తీరంలో ఉన్న ఈ క్షేత్రంలో ద్వారకాదీశ దేవాలయం, రుక్మిణి దేవాలయం, శారదాపీఠం లాంటి ఎన్నో ముఖ్యమైన ధార్మిక క్షేత్రాలున్నాయి. ఎనిమిదో శతాబ్దంలో ఆది శంకరాచార్యలు స్థాపించిన నాలుగు శారద పీఠాల్లో ద్వారకలో కూడా ఒకటుంది. సంస్కతంలో ద్వార అంటే ప్రవేశం అని, కా అంటే పరబ్రహ్మ సన్నిధి అని అర్థం. అందువల్లే పురాణ కాలం నుంచి ద్వారకా… మోక్షానికి ప్రవేశ ద్వారమని అంటారు. - మధుర
ఉత్తర ప్రదేశ్ లో ఉన్న మధుర శ్రీకృష్ణుడి జన్మస్థానం. ద్వాపర యుగం నుంచి ఇప్పటి వరకూ మధుర ఓ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. దీనిని ల్యాండ్ ఆఫ్ ఎటర్నల్ లవ్ అని పిలుస్తారు. బాల్యంలో కృష్ణుడు గోపికలతో గడిపన స్థలం ఇదే కావడంతో ఈ ప్రాంతం అంతా ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. - ఉజ్జయిని
మధ్యప్రదేశ్ ఉజ్జయినీ కూడా సప్తపురి క్షేత్రాల్లో ఒకటి. క్షిప్రా నదీ తీరంలో వెలిసిన ఈ పుణ్యక్షేత్రం అటు వైష్ణవులకు, ఇటు శైవులకు కూడా అత్యంత పవిత్రమైన నగరంగా పేరొందింది. మహాకాళేశ్వర దేవాలయం దేశంలో ఉన్న పరమ పవిత్రమైన శివలింగం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. - హరిద్వార్
ఉత్తరాఖండ్ లో ఉన్న హరిద్వార్ సప్తగిరి క్షేత్రాల్లో విశిష్టమైన పుణ్యక్షేత్రం. గంగోత్రి వద్ద జన్మించి దాదాపు 2543 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత హరిద్వార్ లోనే ఉధృతంగా ప్రవహించడం మొదలుపెడుతుంది. అందుకే హరిద్వార్ ను గంగా ద్వారమని కూడా పిలుస్తారు. గరుడ పురాణంలో ఈ క్షేత్రాన్ని మాయానగరమని పిలుస్తారు. గరుడుడు అమృతాన్ని తీసుకెళుతుండగా ఇక్కడ ఓ చుక్క పడిపోయిందని చెబుతారు. అందుకే ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే మోక్షం తథ్యం అంటారు. - వారణాసి
వారణాసి నగరాన్ని పురాణ ఇతిహాసాల్లో “అవిముక్తక”, “ఆనందకానన”, “మహాస్మశాన”, “సురధాన”, “బ్రహ్మవర్ధ”, “సుదర్శన”, “రమ్య”, “కాశి” అనే ఎన్నో పేర్లతో ప్రస్తావించారు. సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారాణసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథ. గంగానది తీరంలో వెలిసిన వారణాసిలో అడుగుకో దేవాలయం ఉంటుంది. పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి కొలువైన వారణాసిలో చనిపోయినా, అంత్య క్రియలు జరిగినా నేరుగా స్వర్గానికి వెళతారని భక్తుల నమ్మకం.
- కాంచిపురం
సప్తపురి క్షేత్రాల్లో దక్షిణ భారత దేశంలో ఉన్న ఏకైక పుణ్యక్షేత్రం కాంచిపురం. ఇక్కడ దేవాలయాల్లో ప్రమఖమైనది కామాక్షి అమ్మవారి దేవాలయం. ఇది ఒక శక్తిపీఠం. ఇక్కడ శివుడు కూడా కొలువై ఉండడంతో శైవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా విరాజిల్లుతోంది.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.