వచ్చే ఎన్నికల తర్వాత ఓ ప్రాంతీయ పార్టీ కనుమరుగు అవుతుందని కొద్ది రోజుల కిందట ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చెబితే.. .. చాలా మంది రొటీన్ స్టేట్ మెంట్ అనుకున్నారు. కానీ రెండు నెలల్లోనే బీజేపీ కార్యాచరణ అమల్లోకి వచ్చిందని తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ నియామకంతో స్పష్టత వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో లేని పురందేశ్వరిని .. ఏపీ బీజేపీ చీఫ్ గా హైకమాండ్ నియమించింది. ఎన్టీఆర్ కుమార్తె అయినప్పటికీ సొంతంగా నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్న ఆమె బీజేపీని ఉన్నత శిఖరాలకు చేరుస్తారని.. ఇందు కోసం బీజేపీ హైకమాండ్ సంపూర్ణమైన బ్లూప్రింట్ రెడీ చేస్తోందని భావిస్తున్నారు.
టీడీపీ , వైసీపీలకు షాకిచ్చిన పురందేశ్వరి నియామకం !
దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో బిన్నమైన రాజకీయం ఉంది. రెండు ప్రాంతీయ పార్టీలు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటూ పబ్బం గడిపుపుకుంటున్నాయి. బీజేపీని ఎదగకుండా చేస్తున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆ పప్పులు ఉడికే పరిస్థితి లేదు. పురందేశ్వరి రెండు పార్టీలకూ షాకులివ్వడంలో నేర్పరి. బీజేపీ సొంత మార్గాన్ని ఆమె పక్కాగా ప్రజల ముందు ఉంచుతారు. అసలు పురందేశ్వరిని నియమిస్తారని ఎవరూ ఊహించలేకపోయారు. అక్కడ హైకమాండ్ అసలైన వ్యూహం పన్నింది.
జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా చర్చలు – పురందేశ్వరి నియామకానికి లింక్ ఉందా ?
టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహారి శైలి నచ్చకే గతంలో తెలుగుదేశం పార్టీని వీడారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి దంపతులు. దాంతోనే ఆమెను ఎంచుకున్నారనే చర్చ కూడా సాగుతోంది.. అంతేకాదు.. పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించడంతో.. జూనియర్ ఎన్టీఆర్‌ను దువ్వేందుకు కూడా ఆమె ఉపయోగపడతారనే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉంది. పార్టీకి సినీ గ్లామర్ జత చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ అవసరమని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది.. గతంలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కూడా జరిగింది.. ఇప్పుడు మేనత్త పురంధేశ్వరి కి బాధ్యతలు ఇవ్వడం ద్వారా ఎన్టీఆర్‌ను బీజేపీకి దగ్గర చేసే ప్లాన్ లో భాగమేనని తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల తర్వాత ఏం జరుగుతుంది ?
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం ఉంది. అయితే సీఎం జగన్ ముందుగానే తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే… మరింత ముందుగా ఎన్నికలు జరుగుతాయి. ఏపీ బీజేపీ అప్పట్లోపు బలోపేతం అవడానికి చేయాల్సినంత చేస్తుంది. ఆ తర్వాత మాత్రం అసలైన రాజకీయం చేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే పార్టీ కనుమరుగు కావడం ఖాయమని.. ఆ ప్లేస్ లోకి బీజేపీ వస్తుందని హైకమాండ్ నమ్మతోంది. ఆ ప్రణాళికల్లో భాగంగానే పురందేశ్వరిని నియమించినట్లుగా రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.