తెలంగాణ బీజేపీ చీఫ్‌గా బండి సంజయ్ ను తీసేసి కిషన్ రెడ్డిని నియమించారు అని తెలియగానే చాలా మంది ఇక బీజేపీ ఆశలు వదిలేసుకుందని.. బీఆర్ఎస్ తో సఖ్యత కోసమే ఇలా చేస్తోందన్న ప్రచారం చేస్తున్నారు. కానీ దేశంలో తిరుగులేని స్థానంలో ఉన్న ఓ జాతీయ పార్టీ ఇలా ఓ ఉప ప్రాంతీయ పార్టీతో మద్దతు కోసం ఇలా సొంత పార్టీ అధ్యక్షుడ్ని మారుస్తుందా అన్న ఆలోచన మాత్రం చేయలేకోపతున్నారు.
తమ పార్టీ అధ్యక్షుడ్ని తప్పించాలని కేసీఆర్ లేదా కేటీఆర్ అడిగితే తప్పించేంత బలహీనంగా అమిత్ షా , ప్రధాని మోదీ ఉంటారని అనుకోరు. ఇక్కడే ఇసలు మాస్టర్ ప్లాన్ ఉంది.
కిషన్ రెడ్డి సిన్సియారిటీని ఎవరైనా శంకించగలరా ?
కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగిన నేత. ఒకప్పటి మోదీ సహచరుడు. 1977లో జనతాపార్టీలో యువనాయకుడిగా ప్రస్థానంప్రారంభించారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నంచి ఆ పార్టీలో పని చేస్తున్నారు. 1980లోనే రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువమోర్చా కన్వీనర్ పదవి చేపట్టారు. 1985లో ఉమ్మడి రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు అయ్యారు. యువమోర్చాలో అనేక పదవులు నిర్వహించారు. 2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష పదవులను నిర్వహించారు. 2010, మార్చి 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కిషన్ రెడ్డి 2004లో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు. 2009 ఎన్నికలలో అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 27000 పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014 ఎన్నికలలో మూడో సారిగెలిచారు. 2014 లో మరల తెలంగాణ జనతా పార్టీ అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టారు. కిషన్ రెడ్డి 2018 లో ఎమ్మెల్యేగా పోటీ చేసి టీఆరెస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి పాలైనా 2019 లో జరిగిన పార్లమెంట్ ఎలెక్షన్లలో సికింద్రాబాద్ నుండి గెలిచి క్యాబినెట్ మంత్రి అయ్యారు. ఇలాంటి చరిత్ర ఉన్న నేత ను శంకించడం అంటే… రాజకీయంగా తప్పటడుగు వేయడమే.
కిషన్ రెడ్డిపై మోదీ కి అపారమైన నమ్మకం !
తెలంగాణ బీజేపీని బండి సంజయ్ బలోపేతం చేశారు. అందులో సందేహం లేదు. కానీ రాజకీయ పార్టీ అన్నాక కొన్ని సమస్యలు రావడం సహజమే. పార్టీలోకి బలమైన నేతలు వచ్చారు. ఆయన దూకుడు కూడా పార్టీ విస్తరణకు అడ్డు పడింది. చేరికలు ఆగిపోవడానికి ఆయన తీరే కారణమన్న అభిప్రాయం ఉంది. అందుకే హైకమాండ్ అన్ని విధాలుగా ఆలోచించి సమర్థుడైన నేత అయిన కిషన్ రెడ్డికి మళ్లీ పగ్గాలివ్వాలని నిర్ణయించుకుంది. ప్రధాని మోదీకి కిషన్ రెడ్డిపై ఆపారమైన నమ్మకం ఉంది. తెలంగాలో బీజేపీ అధికారంలోకి రావాలన్న లక్ష్యాన్ని ఆయన చేతుల మీదుగానే సాధించగలమన్న విశ్వాసంతో పదవి అప్పగించినట్లుగా తెలుస్తోంది.
రెండు నెలల్లో కీలక పరిణామాలు
ఇప్పుడు వ్యతిరేక కామెంట్లు చేస్తున్న వారు అత్యధిక మంది వచ్చే నెలల్లో జరగబోయే పరిణామాల తర్వాత బీజేపీ .. కిషన్ రెడ్డిని చీఫ్ గా చేయడంలో ఇంత ప్లాన్ ఉందా అని ఆశ్చర్యపోక తప్పదంటున్నారు. బీజేపీ ఇప్పటి వరకూ అభ్యర్థుల బలంపై ఆధారపడి ఉపఎన్నికల్లో గెలిచింది. కానీ ఇక ముందు పార్టీ బలోపేతం అవుతుందని అంటున్నారు. ఊహించని చేరికలు.. ఉండబోతున్నాయని.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారాన్ని చేపట్టాలనే టార్గెట్ ను హైకమాండ్ చాలా గట్టిగా పెట్టుకుందని చెబుతున్నారు. అందుకే కిషన్ రెడ్డి నియామకంపై బీఆర్ఎస్ వర్గాలు… కాంగ్రెస్ నేతలు కూడా.. మోదీ , షాల ప్లానేమిటో అని అంతర్గతంగా తర్జనభర్జన పడుతున్నాయి. అదేమిటో అమలు చేసే వరకూ ఎవరికీ తెలియకకుండా ఉండటమే బీజేపీ అగ్రనేతల చాణక్యం.