ఖేలో ఇండియా స్కీంకు ఏపీ ప్రభుత్వ స్టిక్కర్ ఆడుదాం ఆంధ్రా !

ఏపీ ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ క్రీడా రంగాల్లో పోటీలు నిర్వహించెందుకు నిర్ణయించింది. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) నిర్ణయించింది. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట ఈ క్రీడలు నిర్వహించనున్నారు. వివిధ స్థాయిల్లో 2.99 లక్షల పోటీలను నిర్వహించెందుకు అధికారులు ప్రతిపాదించారు. రూ.45 కోట్లతో 49 రోజుల పాటు ఈ క్రీడలు నిర్వహించనున్నారు. అసలు ఏపీ సర్కార్ ప్రయారిటీలోనే క్రీడలు లేవు. మరి హఠాత్తుగా ఎందుకు ఈ ఆటలు నిర్వహిస్తున్నారనే డౌట్ సహజంగానే వస్తుంది. దీనికి కారణం ఖేలో ఇండియాస్కీం కింద నిధులు వస్తూండటమే. ఆ నిధులతో తమ స్టిక్కర్ వేసుకుని ఆడుదాం ఆంద్రా అని పేరుతో ఆటలు నిర్వహించబోతున్నారు.

ప్రధాని మోదీ వినూత్న ఆలోచన ఖేలో ఇండియా

దేశంలో నైపుణ్యం ఉన్న క్రీడాకారులకు కొదవ లేకపోయినా.. ఆ నైపుణ్యాన్ని ప్రదర్శించే సరైన వేదిక లేకపోవడం అసలు సమస్య. దీనికి పరిష్కారం చూపే దిశగా 2018లో కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. చిన్న వయసు నుంచే పెద్ద వేదికలపై తలపడే అవకాశాన్ని ఈ కార్యక్రమం యువ అథ్లెట్లకు ఇస్తోంది. వాళ్ల టాలెంట్‌ను గుర్తించి, ఇండియాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే సత్తా ఉన్న అథ్లెట్లను ప్రోత్సహించే పని స్పోర్ట్స్‌ అథారిటీలు చేస్తున్నాయి. తొలిసారి 2018లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఖేలో ఇండియా స్కూల్‌ గేమ్స్‌గా పిలిచేవారు. తొలి గేమ్స్‌లో దేశవ్యాప్తంగా అండర్‌-17 కేటగిరీలో 3507 మంది అథ్లెట్లు, 16 క్రీడల్లో పాల్గొన్నారు. ఆ తర్వాతి ఏడాది నుంచి ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌గా ఈ కార్యక్రమం పేరు మారింది. 2019లో ఈ గేమ్స్‌లో పాల్గొన్న వారి సంఖ్య 5925కు, క్రీడల సంఖ్య 18కి చేరింది. గత నెలలో ముగిసిన ఈ ఖేలో ఇండియా మూడో ఎడిషన్ లో 21 క్రీడాంశాల్లో 200కు పైగా యూనివర్సిటీల నుంచి పదిహేను వేల మంది అథ్లెట్లు పోటీపడ్డారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి వస్తూండటంతో కేటాయించే నిధులు పెంచారు.

భారీగా నిధులు కేటాయిస్తున్న కేంద్రం

తొలి ఏడాది ఈ కార్యక్రమం కోసం రూ. 324 కోట్లు కేటాయించగా.. ఆ తర్వాతి ఏడాది రూ. 500 కోట్లు, కేటాయించారు. ఇప్పుడు అది రెట్టింపు అయింది. అన్ని రాష్ట్రాలకు కలిపి దాదాపుగా రూ. వెయ్యి కోట్లుకేటాయించారు. ఏపీకి ఇందులో యాభై కోట్ల వరకూ వస్తున్నట్లుగా చెబుతున్నారు. క్రీడా మంత్రిత్వ శాఖకు ఈ ఆర్థిక సంవత్సరంలో నరేంద్రమోదీ ప్రభుత్వం కేటాయించిన మొత్తం రూ. 3397.32 కోట్లు. దేశంలో క్రీడలను యువత జీవన విధానంలో భాగం చేయడానికి ప్రధాని మోదీ తీసుకున్న శ్రద్ధ నిధుల కేటాయింపులోనే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 1,000 ఖేలో ఇండియా సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఏపీకి వస్తున్న నిధులతో జగన్ తన స్టిక్కర్ ను వసుకునేందుకు ఆడుదాం ఆంధ్రా స్కీమ్ తో హడావుడి చేస్తున్నారు.

రాజకీయం చేస్తే లక్ష్యానికి ఎసరు

భారత్‌లో అత్యధిక జనాభా ఉన్నారు. ప్రతి వ్యక్తిలోనూ ఓ టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ను వెలికి తీయడం ప్రభుత్వాల పని. అందు కోసం అవసరమైన అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. చిన్న తనం నుంచే ఆటల్లో ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహిస్తే… చాలా సులువుగా దేశం క్రీడారంగంలో అత్యున్నత స్థాయికి చేరుతుంది. ఇదంతా కేంద్ర ప్రభుత్వం ఒక్కటే చేయడం కాదని.. అన్ని ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ,.. మున్సిపల్, పంచాయతీ ప్రభుత్వాలు కూడా భాగస్వామ్యం కావాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారు. ఖేలో ఇండియా స్ఫూర్తి అదే. కానీ ఏపీ లో వైసీపీ వంటి ప్రభుత్వాలు స్వార్థ రాజకీయాలకు ఈ నిధులను దుర్వినియోగం చేసే పరిస్థితి కనిపిస్తూండటం… అసలు విషాదం.