శాస్తవేత్తలకు అంతుచిక్కని రహస్యాల నిలయం ఈ ఆలయం – ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది!

కర్నూలు జిల్లాలో ఉన్న యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయానికి ఎన్నో మహిమలున్నాయని భక్తుల విశ్వాసం. ఆలయంలో పెరుగుతున్న నందే ఇందుకు నిదర్శనం. ఇంతకీ నంది విగ్రహం ఎలా పెరుగుతోంది? దీని వెనుకున్న మిస్టరీ ఏంటి?

శ్రీ వేంకటేశ్వర స్వామి బదులు ఉమామహేశ్వరుడు
వందల ఏళ్ల క్రితం దక్షిణ భారత యాత్రలో భాగంగా అగస్త్య మహాముని నల్లమలకు వచ్చి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైష్ణవ పద్ధతిలో నిర్మించారు. ఆలయంలో ప్రతిష్టించేందుకు వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో బొటన వేలు విరిగింది. అవయవలోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్టిస్తే కీడు తప్పదని భావించిన అగస్త్యుడు తాను చేసిన తప్పును తెలుసుకునేందుకు ఘోర తపస్సు చేస్తాడు. దీంతో శివుడు ప్రత్యక్షమై ఈ ప్రాంతం కైలాశాన్ని పోలి ఉన్నందున విగ్రహానికి నష్టం కలిగిందని బాధపడొద్దు తానే ఇక్కడ కొలువుతీరుతానని చెప్పి వెలిశాడు. దీంతో అగస్త్యుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయం పక్కనే ఉన్న ఓ కొండ గుహలో పెట్టిసి ఉమా మహేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్టిస్తాడు. ఈ విగ్రహాన్ని ప్రతిష్టించిన కొన్ని రోజుల తర్వాత చిన్న నంది విగ్రహం స్వయంగా వెలిసినట్లు స్థల పురాణం చెబుతోంది.

పెరుగుతున్న నంది
ఈ ఆలయంలో నంది విగ్రహం పెరగడం అనేది ఇప్పటికీ అందుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. 400 ఏళ్ల కిందట ఈ నంది విగ్రహం చాలా చిన్నగా ఉండేదని, భక్తులు దాని చుట్టు ప్రదక్షిణలు చేసేవారని చెబుతుంటారు. ఇప్పుడు ఆ నంది విగ్రహం సైజు పెరగడం వల్ల ప్రదక్షిణలు సాధ్యం కావడం లేదంటారు. నందిగా చిన్నగా ఉన్నప్పటి ఫొటోలేవీ లేకపోవడంతో అదంతా ప్రచారమే అని కొట్టిపడేసేవారూ ఉన్నారు. కానీ నంది సైజు పెరుగుతోంది అనేది వాస్తవం అని భక్తులు చెబుతుంటారు. 20 సంవత్సరాల వ్యవధిలో ఈ నంది విగ్రహం కేవలం ఒక్క అంగుళం మాత్రమే పెరుగుతోందని భారత పురావస్తు విభాగం అధికారులు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. నంది పెరుగుతోందా లేదా అని తెలుసుకోవడానికి ఆ ఆలయంలో విగ్రహం చుట్టూ ఉన్న స్తంభాలను చూస్తే అర్థమవుతుంది.

రాయి పెరగడం సాధ్యమా!
నంది పెరగడం వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉందంటారు శాస్త్రవేత్తలు. యూరప్‌లోని రోమేనియాలో కూడా రాళ్లు పెరుగుతూ ఉంటాయట. అవి నంది విగ్రహం కన్నా వేగంగా పెరగడమే కాదు, పిల్లల్ని కూడా పెడతాయని చెబుతారు. ఓ రసాయానిక క్రియ వల్లే ఇదంతా జరుగుతోంది అంటారు. రొమేనియాలోని రాళ్లు ఎదగాలంటే తప్పకుండా వర్షాలు పడాలి. ఇవి వేసవి కాలంలో సాధారణ రాళ్లలాగే కనిపిస్తాయి కానీ వర్షకాలం వచ్చేసరికి క్రమేణా ఎదుగుదల ప్రారంభం అవుతుంది. ఇందుకు కారణం ఆ రాళ్లలో ఉండే కాల్షియం కార్బొనేట్, సోడియం సిలికేట్. వర్షం పడగానే రసాయనిక చర్య జరిగి రాళ్ల మధ్య చిన్న చిన్న ఖాళీలు ఏర్పడతాయి. ఒత్తిడి వల్ల రాళ్లు పెరుగుతూ ఉంటాయి. రోమేనియా రాళ్లకీ, యాగంటి నంది విగ్రహానికి మధ్య ఉన్న తేడా ఏంటంటే.. ఈ నంది ఆలయంలో ఉండటం వల్ల నేరుగా వానలో తడవదు. కేవలం గాల్లో ఉన్న తేమను గ్రహించి మాత్రమే రసాయన క్రియకు గురై పెరుగుతోంది.

అన్ని ఆలయాల్లో నందులు ఎందుకు పెరగడం లేదు!
మరి మిగతా శివాలయాల్లో ఉండే నందులు ఎందుకు పెరగడం లేదు అనేదానికి మత్రం శాస్త్రవేత్తల నుంచి ఎలాంటి సమాధానం లేదు. పైగా ఆయా నంది విగ్రహాలపై పరిశోధనలు కూడా జరగలేదు. అందుకే భక్తులు ఇప్పటికీ యాగంటి నంది ఎదుగుదలను దేవుడి మాయేనని విశ్వసిస్తారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కలియుగాంతంలో యాగంటి నంది లేచి రంకెలేస్తుందని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఉంది.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.