తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మాస్టర్ ప్లాన్ – అధ్యక్షుల మార్పుతో మారబోతున్న రాజకీయం !

బీజేపీ హైకమాండ్ తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో బలమైన ముద్ర వేయడమే లక్ష్ష్యంగా కొత్త నేతలను నియమించింది. తెలంగాణకు కిషన్ రెడ్డిని, ఏపీకి పురందేశ్వరిని అధ్యక్షులుగా నియమించారు. కిరణ్ కుమార్ రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించారు. ఈటల రాజేందర్ ను ఎన్నికల కమిటీ చైర్మన్ గా నియమించారు. ఈ నియామకాలతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఊహించని విధంగా దూసుకెళ్లబోతోందని ఆ పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి.

ఎన్టీఆర్ కుమార్తెకు పదవి ఇవ్వడం వెనుక అనూహ్య టార్గెట్

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా ఆ పార్టీ అధిష్ఠానం దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించింది. ఇప్పటి వరకూ ఈమె బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఉన్నారు. అంతేకాక, ఒడిశాకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా ఉన్నారు. సోము వీర్రాజును రాజీనామా చేయించిన అనంతరం అధ్యక్ష పదవి కోసం సత్యకుమార్, సుజనా చౌదరి పేర్లు వినిపించాయి. కానీ అధిష్ఠానం పురంధేశ్వరి వైపే మొగ్గు చూపింది. పురందేశ్వరి కేంద్ర మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరారు. ఎన్టీఆర్ కుమార్తెకు పదవి ఇవ్వడం ద్వారా బీజేపీ హైకమాండ్ ఓ స్పష్టమైన సందేశాన్ని పంపిందని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో చర్చలు.. ఆ తర్వాత పరిణామాలు.. ఇప్పుడు పురందేశ్వరికి పదవి మొత్తం కలిసి ఓ భారీ రాజకీయ వ్యూహానికి రంగం సిద్ధమైందని బీజేపీ వర్గాలు నమ్ముతున్నాయి.

జాతీయ కార్యవర్గ సభ్యులుగా కిరణ్ కుమార్ రెడ్డి

ఇటీవల బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ కార్యవర్గ సభ్యునిగా పదవి కేటాయించారు. గతంలో ఈ పదవిలో కన్నా లక్ష్మినారాయణకు ఉండేది. ఆయన పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి ఏపీలో చేరికల విషయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నట్లుగా తెలుస్తోంది. జాతీయ కార్యవర్గ భేటీలో ఏపీ నుంచి ఒక్కరే్ ఉన్నారు. జాతీయ పార్టీ తీసుకునే నిర్ణయాల్లో కార్యవర్గం కీలకం. అందుకే కిరణ్ మరింత యాక్టివ్ అవుతారని భావిస్తున్నారు.

తెలంగాణ చీఫ్ గా కిషన్ రెడ్డి
తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ హైకమాండ్ అధికారిక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే క్రమంలో కీలక మార్పులు చేయాలని హైకమాండ్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అనేక మార్లు చర్చలు జరిపి చివరికి బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని నియమిస్తూ నిర్ణయం తసుకున్నారు.
తెలంగాణ బీజేపీలో నెలకొన్న పరిణామాలతో బండి సంజయ్ ను మార్చాలని హైకమాండ్ అనుకున్నప్పటికీ ఈటల రాజేందర్ సహా పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈటల రాజేందర్ ఇటీవలే పార్టీలో చేరారు. ఆయనకు పదవి ఇస్తే..సుదీర్ఘ కాలంగా పార్టీలో ఉన్న వారు అసంతృప్తికి గురవుతారన్న ఉద్దేశంతో .. సీనియర్ నేత అయిన కిషన్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్లుగా భావిస్తున్నారు. అందర్నీ కలుపుకుని వెళ్లడంలో కిషన్ రెడ్డి చొరవ చూపిస్తారని భావిస్తున్నారు. అయితే బీజేపీలో జోడు పదవుల సంప్రదాయం లేదు. కేంద్ర మంత్రిగా ఉంటే.. రాష్ట్ర బీజేపీ పదవికి న్యాయం చేయలేరన్న ఉద్దేశంతో పార్టీ పదవి లేదా కేంద్రమంత్రి పదవి ఏదో ఒకటి కేటాయిస్తూ ఉంటారు. ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతారాలేదా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. తొలగింపునకు గురైన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు కేంద్రమంత్రి పదవి ఇస్తారని అంటున్నారు.

రెండు, మూడు నెలల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక మార్పులు

రెండు, మూడు నెలల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. బీజేపీ అమలు చేసే మాస్టర్ ప్లాన్లను అంచనా వేయడం సాధ్యం కాదని.. ముందు ముందు అసలు విషయం తెలుస్తుందని అంటున్నారు.