మళ్లీ వారాహి కదిలేదెప్పుడు ? పవన్ నాన్ సీరియస్ పాలిటిక్స్ !

పవన్ వారాహి యాత్ర పదిహేను రోజులు జరిగింది. అందులో మూడు రోజులు విరామం. ఇప్పుడు ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు చేస్తారు.. ఎప్పుడు ప్రారంభిస్తారన్నదానిపై స్పష్టత లేదు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం మళ్లీ సినిమా పనుల్లో బిజీ అయ్యారని చెబుతున్నారు. షూటింంగ్ పూర్తయిన సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారని .. అవి పూర్తయిన తర్వాత మళ్లీ వారాహి యాత్ర ప్రారంభమవుతుందని చెబుతున్నారు. దీంతో పవన్ గత వారాహి యాత్రలో చెప్పిన డైలాగులతో జనసైనికులు సోషల్ మీడియాలో ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు.

అడపాదడపా తిరిగి గెలిచేద్దామనే !

రాజకీయాలు ఎప్పుడూ ఫుల్ టైమ్ ప్రొఫెషనే, ఇంకా చెప్పాలంటే ఇరవై నాలుగు గంటల డ్యూటీ. అసలు పని చేసుకుంటా.. ఈ పని చేసుకుంటా.. అంటే కుదరదు. ప్రజలు నమ్మరు. కానీ పవన్ కల్యాణ్ రెండు పడవలపై కాళ్లు పెట్టి ప్రయాణం చేస్తున్నారు. తాను ఎన్నికలకు ముందు కొన్నాళ్లు తిరిగితే చాలు ప్రజలు ఓటేస్తారని అనుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఆయనకు షాక్ తగిలినా తీరు మారలేదు. తాను సినిమాలు చేస్తోందే పార్టీ నడపడానికనని చెప్పి కవర్ చేసుకుంటున్నారు .. కానీ ప్రజలు పార్టీ పెట్టమని అడగలేదు కదా అనేది అందరికీ వస్తున్న సందేహం.

ఇరవై నాలుగు గంటలూ ప్రజల్లో ఉండే నేతలేమనుకోవాలి !

గత ఎన్నికల తర్వాత మళ్లీ ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల కోసం ఏపీలో నేతలంతా రోజూ శ్రమిస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ.. అధికార పార్టీ అనే తేడా లేదు, వైసీపీ, టీడీపీ , బీజేపీ నేతలంతా పార్టీని నిర్మించుకుంటూ… తమ తమ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి శ్రమిస్తూనే ఉన్నారు. ఒక్క జనసేన మాత్రమే సైలెంట్ మోడ్ లో ఉంది. నెలకో వారానికో పవన్ ఓ సారి అమరావతి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్లడం తప్ప చేసిందేమీ లేదు. ఈ మాత్రం దానికే తాను ప్రజల కోసం ఏదో చేసేశానని ఎంతో త్యాగం చేశానని అనుకుంటే .. మరి మిగిలిన నేతల సంగతేమనుకోవాలి. కుటుంబాల్ని వదిలేసి రాజకీయాల్ని చేస్తున్న వారేముకోవాలి .

రాజకీయాలపై పవన్ తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందా ?

పవన్ కల్యాణ్ మైండ్ సెట్ .. ప్రసంగాలకు పనికొస్తుందేమో కానీ రాజకీయాలకు పనికి రాదని ఎక్కువ మంది నమ్ముతారు. ఆయనకు అభ్యుదయ భావాలు ఉండవచ్చు కానీ.. అవగాహన లేదని ఆయన మాటల్లోనే అర్థమైపోతుంది. అంతా చిటికెలో చేసేస్తానని చెబుతూంటారు. ఆ మాత్రం ఇప్పుడు అధికారంలో ఉన్న వారికి తెలియదా? . పవన్ కల్యాణ్ ప్రసంగాలు ఓట్లేస్తారో లేదో తెలియని ఆయన ఫ్యాన్స్ ను ఉద్రేకపరచడానికి పనికి వస్తాయి కానీ.. రాజకీయంగా ఉపయోగపడవన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.