వారసత్వ రాజకీయమే శరద్ పవార్ కు శాపమా.. ?

దేవెంద్ర ఫడ్నవీస్ చెప్పినట్లుగానే బౌన్సర్ వేశారు. హెల్మెట్ పెట్టుకోని శరద్ పవార్ కు తల పగిలింది. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే రాజ్ భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిపోయింది. కళ్లెదుటే నిలబడి రాజకీయం చేసిన అజిత్ పవార్ ఐదో సారి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అయ్యారు. బీజేపీ- షిండే సర్కారు మరింతగా బలపడితే, విపక్ష ఎంవీఏ బలహీనమై నామమాత్ర కూటమిగా మిగిలిపోయింది. పవార్ కు ఏడుపొక్కటే తక్కువన్న చర్చ జరుగుతోంది..

దెబ్బకొట్టిన పూత్రికోత్సావం

కూతురిని వారసురాలిగా నిలబెట్టి పార్టీని పూర్తిగా ఆమెకు అప్పగిద్దామనుకున్న ఎన్సీపీ నేతకు ఎదురు దెబ్బలు తప్పలేదు. నిజానికి అలాంటి పనులు చేస్తున్న వారందరికీ దుస్థితి తప్పడం లేదని తెలిసి కూడా నేతల్లో మార్పు రావడం లేదు. ఇటీవల ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు శరద్ పవార్ ప్రకటించినప్పుడు ఎవరైనా ప్రజా నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తారని ఎదురు చూశారు. జనంలో ఉంటూ, ఎన్సీపీ అభివృద్ధికి కృషి చేసిన తనకు అవకాశం ఉంటుందని అజిత్ ఎదురు చూశారు. కాకపోతే డ్రామాకు తెరదించే క్రమంలో తన నిర్ణయాన్ని వాపసు తీసుకున్న శరద్ పవార్ పార్టీలో మార్పులు చేసినప్పుడు అజిత్ ను పక్కన పెట్టారు. కూతురు సుప్రియా సూలే, మరో నాయుకుడు ప్రఫుల్ పటేల్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇస్తూ అజిత్ కు ఎలాంటి బాధ్యత అప్పగించలేదు. దానితో అజిత్ వర్గం తీవ్ర అసంతృప్తికి లోనయ్యింది. అది చాప కింద నీరులా వ్యాపించి అజిత్ తిరుగుబాటుకు కారణమైంది. ఆయన కోరుకున్న డిప్యూటీ సీఎం పదవి వచ్చేసింది. కూతురిని అందలం ఎక్కిద్దామని శరద్ పవార్ అనుకుంటే ఇప్పుడు పార్టీ మనుగడే ప్రశ్నార్థకమైంది.

కేంద్రమంత్రివర్గంలోకి ఫడ్నవీస్, పటేల్ !

అజిత్ పవార్ ను డిప్యూటీ సీఎం చేసే తరుణంలో మోదీ అమిత్ షా మదిలో ప్లాన్ బీ కూడా మెదిలినట్లుగా చెబుతున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న దేవంద్ర ఫడ్నవీస్ ను కేంద్ర మంత్రిగా ఢిల్లీ పిలిపించుకునే ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగూ అజిత్ పవార్ ఉన్నందున మరో డిప్యూటీ సీఎంతో పనిలేదని భావిస్తూ కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ఫడ్నవీస్ కు కీలక శాఖ అప్పగించాలని తీర్మానించారు. మహారాష్ట్ర వ్యవహారాలను చక్కబెట్టినందుకు ఫడ్నవీస్ కు బీజేపీ అధిష్టానం ఇస్తున్న బహుమతి కూడా అదే కావచ్చు. మరో పక్క కొన్ని రోజులు ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ప్రఫుల్ పటేల్ ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. పవర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయన కూడా ప్లేట్ ఫిరాయించడంతో బీజేపీ ఆయనకు మంచి పదవి ఇవ్వాలనుకుంటోంది.

విపక్షాల ఐక్యత మాటేమిటి.. ?

ఎన్సీపీ సంక్షోభ ప్రభావం జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతపై కూడా పడే అవకాశాలున్నాయి. కొత్త కూటమి కోసం వారంలో మలి దఫా చర్చలు జరగాల్సి ఉండగా మహారాష్ట్ర పరిణామాలు వారిని కలవరపెడుతున్నాయి. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలన్నీ శరద్ పవార్ కు సంఘీభావం ప్రకటించినా ఏదో తెలియని అనిశ్చితి మాత్రం ఉంది. అందరూ కలిని పనిచేయడం అంత సులభం కాదని వారికి అర్థమవుతూనే ఉంది. వారి తదుపరి చర్య ఏమిటో చూడాలి…