గిద్దలూరులో అన్నా రాంబాబుకు టిక్కెట్ లేనట్లేవా ? వైసీపీలో పొగ పెట్టేస్తున్నారు !

”ఎన్నికలకు సంవత్సరం సమయం ఉన్నా.. నాకు ఎమ్మెల్యే టికెట్ అంటే.. నాకు ఎమ్మెల్యే టికెట్ అంటూ నాయకులు పుట్టుకు వస్తున్నారు. టిక్కెట్ అడిగే వాళ్ళు ఎప్పుడైనా పార్టీ జెండాలు మోశారా. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మే వ్యాపారం కుదరదు..” అని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఇటీవల పార్టీ సమావేశంలో ఫైర్ అయ్యారు. ఆయన ఎంతో కాలం .. తన కోపాన్ని అదిమి ఉంచుకుని ఒక్క సారిగా బ్లాస్ట్ అయ్యారు. దీనికి కారణం అక్కడ ఆయనకు తీవ్ర వ్యతిరేకత ఉందని ఈ సారి టిక్కెట్లు ఇవ్వరన్న ప్రచారం చేస్తూండటమే .

ఎమ్మెల్యేలగా విఫలమయ్యారని వైసీపీ వర్గాల ప్రచారం

అన్నా రాంబాబు వైసీపీ ఎమ్మెల్యేగా విఫలమయ్యారని ఆపార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. తనను అసమర్థుడి కింద లెక్కేయడం మంచిది కాదని ఆయన చెబుతున్నారు. దీనివల్ల పార్టీకి నష్టమే తప్ప ఒరిగేది ఏమీ లేదు. ప్రజలు, నాయకుడి ఆశీస్సులు ఉంటే టికెట్, గెలుపు రెండూ వస్తాయని చెప్పుకొస్తున్నారు. ఎన్నికల సమయంలో టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ కోసం పని చేస్తా. నేను ఎవరికి ద్రోహం చెయ్యలేదని ప్రచారం చేసుకుంటున్నారు. తప్పు చెయ్యలేదు. అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి గిద్దలూరులో లాగానే ఉందా.. నేను ఏమైనా లోకువగా కనిపిస్తున్నానా. అవసరమైనప్పుడు అన్ని విషయాలు మాట్లాడుతానని. పార్టీ వేదికలపై చెబుతున్నారు.

గతంలో పలుమార్లు పార్టీపై అసంతృప్తి

గతంలో టీటీడీలో సరైన గౌరవం లభించడం లేదని మంచి దర్శనం కూడా చేయించడం లేదని అన్నా రాంబాబు గతంలో ఆన్నా రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు సుబ్బారావు గుప్తాపై దాడి చేసినప్పుడు కూడా స్పందించారు. సుబ్బారావు గుప్తాను ఓ మస్లిం నేత దారుణంగా కొట్టడమే కాదు.. ఆయన తల్లిని కుటుంబసభ్యులను కూడా దూషించడాన్ని తప్పు పట్టారు. సీఎం జగన్ ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్లు ఇవ్వడం లేదు. అన్నా రాంబాబు కూడా చాలా కాలంగా సీఎంను కలవాలని అనుకుంటున్నారు. కానీ చాన్స్ దొరకడం లేదు. మరో వైపు గిద్దలూరులో వైసీపీ అంతర్గత రాజకీయాలు పెరిగిపోతున్నాయి.

రెడ్డి వర్గానికి టిక్కెట్ కేటాయించాలని వైసీపీ నేతల

గిద్దలూరులో వైసీపీలోని రెడ్డి సామాజికవర్గం మొత్తం ఏకం అయింది. అది తమ సీటు అని ఈ సారి రాంబాబుకు టిక్కెట్ ఇస్తే పని చేయబోమని చెబుతున్నారు. పోటా పోటీ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది ఆయనను ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి వాటిని చెప్పుకుందామనుకున్నా ఆయనకు చాన్స్ రావడం లేదు. గిద్దలూరు వైసీపీలో 3, 4 వర్గాలు తయారయ్యాయ్. దీనికి తోడు.. గతంలో లాగా అధికారాలన్నీ ఎమ్మెల్యే చేతిలో లేకపోవడం, కింది స్థాయి నాయకులకు.. చిన్నా, చితక కాంట్రాక్టులు అప్పగించే పవర్ లేకపోవడం.. కేడర్‌లో వ్యతిరేకత తలెత్తే పరిస్థితి తెచ్చిందనే.. చర్చ జరుగుతోంది. దీంతో.. ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోక తప్పదని.. అనుచరులు, పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. వీటికి తోడు.. గిద్దలూరు నియోజకవర్గంలో అధిక ప్రాబల్యం ఉండే రెడ్డి సామాజికవర్గం.. ఎమ్మెల్యే రాంబాబుకు వ్యతిరేకంగా పావులు కదుపుతుండటం, వచ్చే ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గం నాయకుడికే టికెట్ ఇవ్వాలని ఒత్తిడి తెస్తుండటంతో ఆయనకు టిక్కెట్ డౌటేనన్న చర్చ జరుగుతోంది.