దీర్ఘకాలిక సమస్యలను సృష్టించే హామీలు ఇవ్వడం కాంగ్రెస్ నేతృత్వ విపక్షాలకు రివాజుగా మారింది. ఎన్నికల గెలుపు కోసమూ, అధికారంలో కొనసాగాలన్న ఏకైక లక్ష్యంతోనూ ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించే పథకాలు అమలు చేయడం హస్తం పార్టీకి అలవాటుగా మారింది. వారి వైఖరి దేశాభివృద్ధికి ప్రతిబంధకమని బీజేపీ పదే పదే గుర్తుచేసినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదు. ఏదోటి చేసి గెలిచిపోవాలన్న తపనే కానీ నిజమైన ప్రజా సంక్షేమం ఆ పార్టీకి పట్టడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత గానీ అసలు కష్టం అర్థం కావడం లేదు. తాజాగా కర్ణాటకలో ఉచిత బియ్యం కథ కూడా అలాంటిదేనని చెప్పాలి. ఇచ్చేందుకు బియ్యం లేక ఇప్పుడు జనం ఖాతాలో డబ్బులు వేస్తామని సిద్ధరామయ్య ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ అనాలోచిత హామీలు, విధానపరమైన డొల్లతనానికి దర్పణం పడుతోంది.
తప్పుడు హామీలతో జనం నెత్తిన టోపీ
విపక్షాలు ఇప్పుడు తప్పు హామీలిస్తున్నాయని ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భోపాల్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశ వాస్తవ స్థితిని ప్రజల కళ్లకు కట్టి చూపించేందుకు ఆయన ప్రయత్నించారు. ఉచిత హామీలు గుప్పిస్తున్నారంటే అందులో ఏదో తప్పు జరుగుతోందని దేశ ప్రజలు గుర్తించాలన్నారు. ఉచిత కరెంట్, బస్సు ప్రయాణం, తక్కువ రేటుకు పెట్రోల్ లాంటివి అందించడం ద్వారా దేశాన్ని దెబ్బతీస్తున్నారని మోదీ గుర్తు చేశారు.
నష్టాన్ని వివరించిన ప్రధాని
ఉచిత హామీలను నమ్మకూడదని ప్రధాని పిలుపునిచ్చారు. వాటి వల్ల దేశానికి ఎలాంటి నష్టం వాటిల్లుతుందో కూడా పూసగుట్టినట్లుగా ఆయన వివరించారు. ఉచిత కరెంట్ ఇస్తున్నారని సంబరపడితే భవిష్యత్తులో కరెంట్ ఛార్జీలు భారీగా పెరుగుతాయని హెచ్చరించారు. నిజానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతన్నది కూడా అదే. ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నామని అనుకుంటే పొరపాటేనని దాని వల్ల భవిష్యత్తులో రవాణా వ్యవస్థే దెబ్బతింటుందని ఆయన గుర్తుచేశారు. మోదీ చెప్పినది నిజమేనని ఇటీవల కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో మహిళలు తన్నుకుని ఎక్కిన తీరును బట్టి అర్థమవుతుంది. పెన్షన్లు పెంచడమంటే సకాలంలో జీతాలు ఇవ్వలేని దుస్థితి వస్తుంది. పెట్రోల్ రేట్లు తగ్గిస్తే.. భవిష్యత్తులో పన్నులు పెంచడం ఖాయమన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని జనానికి ఆయన హితబోధ చేశారు..
వారసత్వ రాజకీయాల వల్లే ఇదంతా..
ఉచిత హామీలతో దేశం ఇబ్బందుల్లో వెళ్లోందంటే అది వారసత్వ రాజకీయాల వల్లేనని ప్రధాని మోదీ అంటున్నారు. తమ వారసులను అధికారంలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నించే కొందరు నాయకులు… జనం ఎప్పుడు తమవైపున ఉండేందుకు వీలుగా ఉచితాలను ఎరగా వేస్తున్నారని మోదీ ఆరోపించారు. స్కాములతో జైలుకు వెళ్లిన వాళ్లు, అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వాళ్లు ఇలాంటి హామీలతో రాజకీయాల్లో మనుగడ సాగించేందుకు ప్రయత్నిస్తారన్నారు. బీజేపీ అలాంటి దుశ్చర్యలకు దిగదని మరో మారు ప్రకటించారు. సహేతుకమైన పథకాలైనా ఉజ్వల ఫథకం,ఉచిత రేషన్ లాంటివే అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.