ఈటల రాజేందర్ కు కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ సెక్యూరిటీ కల్పించింది. . ఇప్పటికే ఏపీలో అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ముప్పు ఉందని వై కేటగిరి భద్రత పెంచారు. ఎమ్మెల్యే అయిన ఈటల రాజేందర్ కు ఈ స్థాయి భద్రత పెంచడం మాత్రం అనూహ్య పరిణామమే. కేంద్ర భద్రత ఇస్తారన్న సమాచారం బయటకు రాక ముందు ఈటల సతీమణి జమున ప్రెస్ మీట్ పెట్టారు. తన భర్తను చంపడానికి కౌశిక్ రెడ్డి రూ. ఇరవై కోట్ల సుపారీ ఇవ్వడానికి సిద్ధపడ్డారని ఆరోపించారు. ఈ విషయాన్ని పార్టీ నేతలతో ఆయన చెప్పారన్నారు. అయితే కౌశిక్ రెడ్డి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తాను ఈటలను హత్య చేయించడానికి ప్లాన్ చేయలేదని.. హత్యారాజకీయాలు చేసేది ఈటలేనని మండిపడ్డారు.
పోలీసుల్ని ఈటల ఇంటికి పంపిన కేటీఆర్
తన హత్యకు కుట్ర పన్నారంటూ ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయవర్గాల్లోనూ సంచలనం సృష్టించాయి. అనూహ్యంగా ఇవి రాజకీయ ఆరోపణలే అనుకోకుండా మంత్రి కేటీఆర్ కూడా రంగంలోకి దిగారు. హోంశాఖ తనది కాకపోయినా… సీరియస్ గా స్పందించారు. వెంటనే డీజీపీతో మాట్లాడి సీనియర్ అధికారితో విచారణ చేయించి ఈటలకు తగినంత భద్రత కల్పించాలని కోరారు. కేటీఆర్ కోరినట్లుగా చెప్పినా అది ఆదేశం కావడంతో వెంటనే ఓ సీనియర్ అధికారిని విచారణకు నియమించారు. ఆయన ఈటల ఇంటికి వెళ్లి భద్రతా పరమైన పరిశీలన చేసి వచ్చారు.
అసలు ఈటల ఆరోపించింది బీఆర్ఎస్ నేతపైనే.. కానీ ఆ నేతకు ప్రోత్సాహం .! ఎలా నమ్ముతారు ?
అయితే ఇక్కడ ట్విస్టేమిటంటే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు బీఆర్ఎస్ మీదనే. ఇంకా చెప్పాలంటే ప్రగతి భవన్ మీదనే అంటే..కేసీఆర్ మీదనే. పాడి కౌశిక్ రెడ్డి తన హత్యకు రూ. ఇరవై కోట్ల సుపారీ ఇచ్చాడని.. ఇదంతా ప్రగతి భవన్ ప్రోత్సాహంతోనే జరుగుతోందని ఈటల చెబుతున్నారు. తమ మీద ఆరోపణలు చేసినా కేటీఆర్.. విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే కేటీఆర్ తీరు మాత్రం బీజేపీలో అనే సందేహాలకు తావిస్తోంది. కేంద్రం ఆషామాషీగా సెక్యూరిటీ ఇవ్వదని..ఏదో ఇంటలిజెన్స్ రిపోర్ట్ వచ్చి ఉంటుందని అంటున్నారు. ఈ వియయంలో ఎందుకైనా మంచిదని ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా విచారణ పేరుతో కేటీఆర్ హడావుడి చేస్తున్నారని అంటున్నారు.
ఈటలపై నిజంగానే కుట్ర జరిగిందా ?
బీఆర్ఎస్ నేతలు పడుతున్న కంగారు చూస్తే నిజంగానే ఈటల పై కుట్ర జరిగిందనే అనుమానాలు బీజేపీలో వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ఇంటలిజెన్స్ స్పష్టమైన సమాచారం ఉండి ఉంటుందని అంటున్నారు. అయితే ఈటలకు భద్రత కల్పించడంతోనే వదిలి పెట్టరని ఈ కుట్రను బయటకు లాగుతారన్న అభిప్రాయం తెలంగాణ బీజేపీలో వినిపిస్తోంది.