ఈ సారి ఏపీ నుంచి ఓ కేంద్ర మంత్రి – ఎవరికి చాన్స్ దక్కనుందంటే ?

కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ప్రధాని మోదీ సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. సోమవారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ భేటీకి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా మంంత్రి పదవులు ఎవరికి వస్తాయన్నదానిపై విస్తృత చర్చ జరుగుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు.. . రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ అగ్రనాయకత్వం సుదీర్గ కసరత్తు జరిపింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్ పలుమార్లు సమావేశమయ్యారు. చివరికి పార్టీలో సంస్థాగత మార్పులతో పాటు కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు , చేర్పులు చేయాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.

ఏపీ నుంచి రేసులో సీఎం రమేష్‌. జీవీఎల్ నరసింహారావు !

సహజంగా ప్రతీ రాష్ట్రానికి ఓ కేంద్రమంత్రి ఉండేలా కేంద్ర ప్రభుత్వం లెక్క తప్పకుండా చూసుకుంటుంది. ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఆ అవకాశం దక్కింది. తమిళనాడు, కేరళలకు కూడా కేబినెట్ మంత్రులున్నారు. కానీ ఏపీకి మాత్రం.. కేంద్రమంత్రి లేరు. తెలుగు రాష్ట్రాలకు కిషన్ రెడ్డే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఎన్నికలు వస్తున్నందున ..ప్రత్యేకంగా ఏపీకి ఓ కేంద్ర మంత్రి ఉంటే బెటరని బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్ోతంది. టీజీ వెంకటేష్, సుజనా చౌదరి పదవి కాలం ముగిసింది. సీఎం రమేష్ పదవి కాలం ఉంది. అలాగే జీవీఎల్ నరసింహారావుకూ పదవీ కాలం ఉంది. కానీ ఆయన యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. . ఏపీకి ఓ కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి అనుకుంటే.. సీఎం రమేష్ లేదా జీవీఎల్‌లకు మాత్రమే చాన్స్ ఉందని భావిస్తున్నారు.

తెలంగాణ నుంచి మరొకరికి మంత్రి పదవి !

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అయితే ఈ సారి మరో బీసీ నేతకు మంత్రి పదవి ఇవ్వవొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఆయనతో పాటు ఇద్దరు లోక్ సభ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ కూడా బీసీ కేటగరిలోకే వస్తారు. చాన్స్ ఇవ్వాలనుకుంటే ఈ ముగ్గురిలో ఒకరికి చాన్స్ ఇస్తారు.ఎస్టీ వర్గాలకు చాన్సివ్వాలనుకుంటే ఆదిలాబాద్ ఎంపీకి అదృష్టం తలుపు తడుతుంది. అయితే బండి సంజయ్ తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉన్నారు. ధర్మపురి అర్వింద్ మొదటి సారి ఎంపీ అయ్యారు. లక్ష్మణ్ మాత్రం చాలా సీనియర్ అందుకే చాన్స్ ఇస్తే లక్ష్మణ్‌కే ఇవ్వొచ్చంటున్నారు.

బండి సంజయ్, సోము వీర్రాజుల నేతృత్వంలోనే ఎన్నికలు

ప్రధాని మోదీ కేంద్రమంత్రి వర్గంతో పాటు వివిధ రాష్ట్రాల్లో నాయకత్వాలను కూడా మార్చాలని అనుకుంటున్నారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, కేరళ తదితర రాష్ట్రాల్లో నాయకత్వాలను మార్చాలని భావిస్తున్నారు. కర్ణాటక బీజేపీ చీఫ్ ఇప్పటికే రాజీనామా చేశారు. తెలుగు రాష్ట్రాల బీజేపీ చీఫ్ లను మారుస్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ హైకమాండ్ మాత్రం బండి సంజయ్, సోము వీర్రాజులవైపే మొగ్గు చూపింది. ఇప్పటికే ఈ అంశంపై పార్టీ నేతలు క్లారిటీ ఇచ్చారు.