ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్న సామెత కాంగ్రెస్ కు అతికినట్లు సరిపోతుంది. కేంద్రంలో అధికారానికి వచ్చే అవకాశమే లేని పరిస్థితుల్లో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేస్తామంటూ చాలా మంది కాంగీయులు రోజుకు మూడు సార్లు నినాదాలిస్తుంటారు.దానితో కాంగ్రెస్లోనే కొంత వైరుధ్యం ఉన్న మాట వాస్తవం. ఇప్పుడు హరియాణా కాంగ్రెస్ పార్టీలో కూడా అలాంటి గందరగోళమే నెలకొంది.
పార్టీ మీటింగ్ అంటే భయం
హరియాణా కాంగ్రెస్ లో పార్టీ మీటింగ్ అంటేనే మితవాదులు టెన్షన్ పడిపోతున్నారు. గ్రూపులుగా విడిపోయి నినాదాలిచ్చుకుంటూ దాదాపుగా కొట్టుకునే స్థాయికి వస్తున్నారని సాధారణ కార్యకర్తలు వాపోతున్నారు. వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీ నేతల్లో మార్పురాలేదు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో భూపీందర్ సింగ్ హుడా వర్గానికి ప్రత్యర్థులకు మధ్య గొడవ జరిగి వివాదం రచ్చకెక్కింది. హుడాకు వ్యతిరేకంగా కుమారీ శైలజ, రణదీప్ సుర్జేవాలా, కిరణ్ చౌదరి ఉన్నారు. పార్టీ గెలిస్తే సీఎం పదవి కావాలని కోరుకుంటున్న శైలజ… తన వర్గాన్ని హుడా టీమ్ పై రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలున్నాయి. పార్టీ మీటింగులో హుడా మద్దతుదారులు, శైలజ సమర్థకులు నినాదాలిస్తూ కొట్టుకున్నంత పని చేశారు.
కొత్త సారథికి కష్టాలు..
హరియాణా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉదయ్ భాన్ ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. ఆయన వచ్చిందే తడవుగా గందరగోళ పరిస్థితులు మొదలయ్యాయి పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థులు పెరిగిపోతున్నారని వారితో తలనొప్పులు తప్పడం లేదని ఉదయ్ బాన్ స్వయంగా అంగీకరించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత శాసనసభా పక్ష సమావేశంలో తీర్మానం చేసి, అధిష్టానం ఆమోదించిన వ్యక్తి సీఎం అవుతారని తెలిసినప్పటికీ గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవడంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదని ఉదయ్ భాన్ వాపోతున్నారు.
ఏడాది ముందే సీఎం ఫైట్
90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 31 స్థానాల్లో గెలిచింది. పార్టీ అధికారానికి రాకపోవడానికి అధిష్టానమే కారణమని భూపీందర్ హుడా బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. తాను సూచించిన 22 మంది అభ్యర్థులకు టికెట్లు ఇచ్చే ఉంటే వారంతా గెలిచేవారని అప్పుడు పార్టీ అధికారానికి వచ్చేదని ఆయన అంటున్నారు. అందుకే హంగ్ అసెంబ్లీ వచ్చి వేరే పార్టీని కలుపుకుని బీజేపీ మళ్లీ అధికారాన్ని చేపట్టే అవకాశం లభించిందన్నారు. ఇప్పుడా స్టేట్ మెంట్ ను పట్టుకునే హుడా మద్దతుదారులు ప్రతీ మీటింగులో గొడవలకు దిగుతున్నారు. హుడాను ఏడాది ముందే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి శైలజ వర్గం అడ్డు తగులుతోంది. మరో పక్క రాష్ట్ర పార్టీలో తాను అనామకుడిగా మారే ప్రమాదం ఉందని సుర్జేవాలా టెన్షన్ పడిపోతున్నారు. లైమ్ లైట్ లో ఉండేందుకు తన మద్దతుదారులతో నినాదాలిప్పిస్తున్నారు, దానితో హరియాణా కాంగ్రెస్ చీలికలు పీలికలైపోయింది.